దసరా నుంచి..
జాతీయ రాజకీయం
ముహూర్తం ఫిక్స్ చేసుకున్న కేసీఆర్
స్పాట్ వాయిస్, బ్యూరో: జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కసరత్తు చేస్తున్న కేసీఆర్.. కొత్త పార్టీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. దసరా నాటికి జాతీయ రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు. విజయదశమి నాటికి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు కేసీఆర్ చెప్పారని కర్ణాటక మాజీ సీఎం, జేడీయూ నేత కుమారస్వామి వెల్లడించారు. ఈ క్రమంలో టీఆర్ ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ తీర్మానం చేయనున్నట్లు సమాచారం.
ప్లాన్ ఇదే..
తొలి దశలో రైతులు, కార్మికులు, దళితులు, యువతకు సంబంధించిన అంశాలపై ఉద్యమాలను రూపొందించాలని కేసీఆర్ భావిస్తున్నారు. దేశంలో సాగునీరు, విద్యుత్ తగినంత అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమైనందునే రైతులకు కష్టాలు తప్పడం లేదన్న ప్రచారం చేయనున్నారు. త్వరలో హైదరాబాద్‌లో జాతీయ స్థాయి దళిత సదస్సు నిర్వహించాలని భావిస్తున్నారు. దళితబంధు దేశవ్యాప్తంగా అమలు చేయాలని దళితులు డిమాండ్ చేసేలా ఉద్యమాలు చేపట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అంశాలతో పాటు.. వివిధ రాష్ట్రాల్లో స్థానికుల ప్రత్యేక డిమాండ్లు, బలమైన ఆకాంక్షలేమిటి.. వాటిపై బీజేపీ తో పాటు అక్కడి పార్టీల వైఖరి ఏమిటనే అంశాలను గులాబీ పార్టీ పరిశీలిస్తోంది. వాటిపై స్థానిక ప్రజాభాగస్వామ్యంతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
మద్దతు కోసం..
ప్రాంతీయ పార్టీల మద్దతు కూడబెట్టుకునేందుకు కేసీఆర్ కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలను కలవడంతో పాటు.. మరికొందరిని హైదరాబాద్‌కు ఆహ్వానించి చర్చించారు. ప్రధానంగా ఎన్డీఏ ను వ్యతిరేకించే దాదాపు అన్ని పార్టీలతోనూ చర్చించారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం అనే సంకేతం మాత్రం స్పష్టంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు.
జేడీఎస్ సంపూర్ణ మద్దతు..
కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తే సంపూర్ణ మద్దతు ఉంటుందని జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ దూరంగా ఉన్న వివిధ పార్టీల నేతలతో పాటు మేధావులు, ప్రముఖులు, విశ్రాంత అధికారులతో కేసీర్ నిరంతరం చర్చిస్తున్నారు. అజెండా, ప్రయాణం, ప్రచారంపై ఏకాభిప్రాయానికొచ్చిన కేసీఆర్.. విజయదశమి నాటికి పార్టీ ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీకి భారత రాష్ట్ర సమితి.. బీఆర్ఎస్ పేరు పెట్టాలా.. మరో పేరు ఖరారు చేయాలా అనేదానిపై కసరత్తు చేస్తున్నారు.
Recent Comments