స్పాట్ వాయిస్, దామెర: మండలంలోని దుర్గంపేట గ్రామ సమీపంలోని ఎన్ఎస్ఆర్ డైయిరీలో శుక్రవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉదయం నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎక్స్ పైరీ అయిన పదార్థాలను వినియోగిస్తూ పాలు, పాల పదార్థాలు తయారు చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జోనల్ అధికారి అమృత ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన ఆహార భద్రతా ల్యాబ్ అధికారులు లక్ష్మీ నారాయణ, ధర్మేంద్రలు తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రతి పదార్థాలను పరీక్షల కోసం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. గతంలో రెండు సార్లు డెయిరీలో నాణ్యతలేని పదార్థాలు వాడుతున్నారనే ఫిర్యాదు మేరకు డెయిరీని పరిశీలించి కేసు నమోదు చేసి జరిమానాలు విధించడం జరిగిందన్నారు. అయినప్పటికీ డెయిరీలో ఎక్స్ పైరీ అయిన పదార్ధాలను వాడుతున్నారనే ఫిర్యాదు రాగా ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా ఎక్స్ పైరీ అయిన పదార్ధాలను గుర్తించి, వాటిని సీజ్ చేయడం జరిగిందన్నారు. పాలను నాలుగు రకాలుగా తయారు చేస్తున్నారని, సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తయారు చేస్తున్నారని వాటి నమూనాలకు పరీక్షల కోసం హైదరాబాద్ ల్యాబ్ కు పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు. అదే విధంగా డెయిరీలో శుభ్రత లేని ప్రదేశాల్లో పదార్థాలను తయారుచేయడాన్ని గుర్తించినట్లు తెలిపారు. పలు నమూనాలను మొబైల్ ల్యాబ్లో పరీక్షించగా నాణ్యత లోపించినట్లు రుజువైందని వెల్లడించారు. వీటన్నింటిని దృ ష్టిలో ఉంచుకొని డెయిరీ లైసెన్స్ వారంరోజుల పాటు రద్దు చేస్తున్నట్లు వారు ప్రకటించారు. వారం రోజులపాటు డెయిరీలో పదార్థాలు తయారు చేయవద్దని వారికి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో పరీక్షించిన అనంతరం నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ దాడుల్లో ఆహార భద్రతా అధికారు శ్రీశిబి, బి. వాసురావు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments