Thursday, November 21, 2024
Homeతెలంగాణకేంద్రం నిధులతోనే ఆస్పత్రి పనులు..

కేంద్రం నిధులతోనే ఆస్పత్రి పనులు..

కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆస్పత్రి పనులు

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

స్పాట్ వాయిస్ , నర్సంపేట : కేంద్ర ప్రభుత్వ నిధులతో నర్సంపేటలో ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వాస్తవాలు ప్రజలకు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనులు చేపట్టినట్లు మాట్లాడడం నీతిమాలిన చర్య అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలో ఆసుపత్రి అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి హరీష్ రావు శనివారం శంకుస్థాపన చేసిన శిలా ఫలకాలను ఆదివారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల బృందం ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా రేవూరి మాట్లాడుతూ ఇది ప్రజలను మోసం చేయడమేనని దీనిని బీజేపీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నర్సంపేటలో 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్ హెచ్ఎం ) ద్వారా 66 కోట్ల 36 లక్షలు కేంద్ర నిధులు మంజూరు చేసినందుకు గాను హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ ఫ్లెక్సీకి బీజేపీ బృందం క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆరోగ్య పరిరక్షణ మౌళిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. దేశంలోని అనేక ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తోందన్నారు. మంత్రి హరీష్ రావు శనివారం శంకుస్థాపన చేసిన పనులకు వందకు వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభమైనవేనని రేవూరి తెలిపారు. కరోనా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్లతో పాటు పట్టణ ప్రాంతం వరకు కూడా మౌళిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకమైన మిషన్ ను ఏర్పాటు చేసి దేశ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేస్తోందన్నారు. ఆ క్రమంలోనే మన నర్సంపేట ఆస్పత్రులకు 66 కోట్ల 36 లక్షల రూపాయలు కేటాయించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు కేటాయిస్తే 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన 66 కోట్ల 36 లక్షల కేంద్ర ప్రభుత్వం నిధులతో మాత్రమే పనులు చేపడుతున్నారని రేవూరి తెలిపారు. కానీ హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనులు చేపట్టినట్లు మాట్లాడడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. సొమ్మోకరిది సోకొకరిది అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అయన ఆరోపించారు. ఇప్పటికైన హరీష్ రావు అబద్ధాలు చెప్పడం మాని ప్రజలకు వాస్తవాలను చెప్పాలన్నారు. లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. ఒక బాధ్యతగల మంత్రిగా ఉన్న వ్యక్తి ఏ నిధులతో ఆసుపత్రి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందో చెప్పవలసిన కనీస బాధ్యత అయనపై ఉందన్నారు. కనీస బాధ్యతలు నిర్వర్తించలేని వారు రాష్ట్ర ఆరోగ్య,ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగే అర్హత హరీష్ రావుకు లేదన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments