ఆన్ లైన్ గేమ్ లో రూ.92 లక్షలు పోగొట్టుకుంటున్న యువకుడు
స్పాట్ వాయిస్, డెస్క్ : వంద కాదు.., వెయ్యి కాదు.., పది వేలు కాదు.., అక్షరాల 92 లక్షల రూపాయలు ఆటలో పోగొట్టాడు. తల్లిదండ్రుల అమాయకత్వం అతడికి ప్లస్ అయ్యింది.., భూమి అమ్మగా వచ్చిన డబ్బులు సరదా తీర్చేందుకు పెట్టుబడిగా మారాయి. తాను చేస్తున్న తప్పుడు పనికి అడ్డు చెప్పేవారే లేకపోవడంతో ఆడిందే ఆటా.. పాడిందే పాట మారింది. అనుకున్నదే తడవుగా డబ్బులన్నీ ఆన్ లైన్ గేమ్ లో పెట్టి చేతులు కాల్చుకున్నాడు. జరిగిన విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఆ అమ్మానాన్న లబోదిబో మన్నారు. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి..
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, విజయలక్ష్మి దంపతులకు శ్రీపాల్ రెడ్డి, హర్షవర్థన్ రెడ్డి అని ఇద్దరు కుమారులు. శ్రీపాల్ రెడ్డి బీటెక్, హర్షవర్థన్ డిగ్రీ చదువుతున్నాడు. వారిది వ్యవసాయాధారిత కుటుంబం. పదెకరాల భూమి ఉంది. ఈ మధ్యే టీఎస్ఐఐసీ కోసం ప్రభుత్వం సేకరించిన భూముల్లో ఆ పదెకరాలు ఉండడంతో పరిహారంగా ఆయనకు ఎకరాకు రూ.10.5 లక్షల చొప్పున రూ.1.05 కోట్లు వచ్చాయి. ఆ డబ్బుతో శ్రీనివాస్ రెడ్డి ఇంకోచోట భూమి కొనడానికి రూ.20 లక్షలు బయానా ఇవ్వగా మిగిలిన డబ్బులు భార్య, అతడి అకౌంట్లలో ఉంచాడు. దానినే ఆసరాగా చేసుకున్న హర్షవర్ధన్ తండ్రికి, తల్లికి కల్లబొల్లి మాటలు చెప్పి వారి మొబైల్ ఫోన్లను తీసుకుని వాటిల్లోనే క్యాసినో గేమ్ ఆడడం షురూ చేశాడు. అనుకున్నది ఒక్కటైతే జరిగింది మరోటి అన్నట్టుగా మొత్తం ఇద్దరి అకౌంట్లలో ఉన్న రూ.85 లక్షలు ఆటలో పోగొట్టుకుని చేతులు కాల్చుకున్నాడు. విషయం ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు సైబర్ పోలీసులను ఆశ్రయించారు. తమ డబ్బులు తమకు ఎలాగైనా ఇప్పించాలని ప్రాధేయపడ్డారు. కాగా, హర్షవర్ధన్ గ్రామంలో మరికొందరి దగ్గర కూడా రూ.7 లక్షల వరకు అప్పులు చేసి కూడా ఆటలోనే తగలేసినట్టు తెలిసింది. ఏదిఏమైనా ఓ వ్యక్తి ఆన్ లైన్ గేమ్ వ్యసనం ఆ కుటుంబాన్ని నడి రోడ్డున నిలబెట్టింది.., వారి జీవితాలను గందరగోళంలోకి నెట్టేసింది.
Recent Comments