స్మార్ట్ కాదు కబ్జా సిటీ
గుడిని, బడిని చెరబడుతున్నారు..
పంచభూతాలను వదలని బీఆర్ఎస్ నేతలు
ఆక్రమణకు అడ్డు లేకుండా పోతోంది..
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి
ఆక్రమణకు గురైన దాసాంజనేయ ఆలయ భూమి పరిశీలన
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: హన్మకొండ నగరం స్మార్ట్ సిటీ అవుతుందనుకుంటే.. ఇక్కడి పాలకుల పుణ్యమా అని కబ్జా సిటీగా మారుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. బుధవారం పెగడపల్లి డబ్బాల సమీపంలోని అతిపురాతన దాసాంజనేయ స్వామి ఆలయంలో కబ్జాకు గురవుతున్న స్థలాన్ని ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. రాజలమ్మ నాయుడు అనే మహాతల్లి దానంగా ఇచ్చిన ఆలయ భూమిని కొందరు కబ్జాకోరులు తమ సొంతం చేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే ఇది జరుగుతోందని ఆరోపించారు. మన ఓరుగల్లు కాకతీయుల ఏలుబడిలో ప్రపంచానికే ఆదర్శంగా నిలించిందని, కానీ ప్రస్తుత బీఆర్ఎస్ పాలనలో నాయకులు పంచభూతాలను చెరబడుతున్నారని మండిపడ్డారు. గడిచిన పదేళ్లలో పేదల భూములు, ప్రభుత్వ స్థలాలు, చెరువు శికం భూములు, ఆలయాల భూముల కబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. ఎనకటికి ఒక శాస్త్రం ఉన్నట్టు వీళ్లను ఇలాగే వదిలేస్తే ‘గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తారని ఎద్దేవా చేశారు. ప్రజా సేవ చేయమని అవకాశం ఇస్తే అవకాశం ఇచ్చిన ఆ ప్రజలకే గుండు కొడుతున్నారని విమర్శించారు. గుడి స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకునేది లేదని, ఇప్పటికైనా కబ్జాకోరులు వెనక్కి తగ్గాలని లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 2 వ డివిజన్ కార్పొరేటర్ లావుడ్య రవి నాయక్, ఆలయ కమిటీ అధ్యక్షుడు కుమార్, ఇతర బాధ్యులు అశోక్, రాజు, లక్ష్మణ్, సారయ్య, బాబురావు, చేరాలు బీజేపీ నాయకుడు సతీష్, గోపీకృష్ణ, సంతోష్ యాదవ్ ఉన్నారు.
విద్యాలయాలకు రక్షణ లేదు..
బీఆర్ఎస్ పాలనలో ఆఖరికి సమాజానికి అతి ముఖ్యమైన మూల స్తంభాలైన విద్యాలయాలను కూడా వదలడం లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి మండిపడ్డారు. వరంగల్ లోని ఎల్బీ కళాశాలలో నిర్మాణం అవుతున్న అక్రమ కట్టడాలు, కబ్జాకు గురవుతున్న కళాశాల భూములను కాలేజీ విద్యార్థులతో కలిసి రాకేశ్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఎన్నో వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఎల్బీ కళాశాలలో భూములు ఆక్రమణకు గురవుతున్నాయన్నారు. అక్రమ కట్టడాలు వెలుస్తున్నా..ప్రభుత్వ అధికారం యంత్రాంగం నిద్ర నటిస్తూ కబ్జాకోరులకు సహకరిస్తోందని ఆరోపించారు. గుడిని బడిని కాపాడుకుంటే సమాజం బాగుపడుతుందంటారని, కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బడి భూముల మీద గుడి భూముల మీదనే పడ్డారన్నారు. మానవ కళ్యాణానికి “బడి – గుడి” రెండు మూల స్థంభాలు అని, ఒకటి జ్ఞానాన్ని, ఇంకొకటి ముక్తిని ప్రసాదించే కేంద్రాలు అని రాకేశ్ రెడ్డి చెప్పారు. కానీ ఆ రెండింటినీ చెరబట్టి సర్వ నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చారిత్రాత్మకమైన ఎల్బీ కాలేజీ భూమిని, మరో వైపు డబ్బాల అడ్డా దగ్గర హనుమాన్ ఆలయ భూమిని, మరో వైపు భద్రకాళి అమ్మవారి చెరువు శికం భూములు ఇలా నగరం నలుమూలాల కబ్జా చేస్తూనే ఉన్నారన్నారు. ఒకప్పటి పూర్వ విద్యార్థులైన కొండా మురళి, కొండా సురేఖ, నన్నపునేని నరేందర్, ప్రస్తుత ఎల్బీ కళాశాల సెక్రటరీగా ఉన్న మంత్రి హరీష్ రావు తక్షణమే స్పందించి ఎల్బీ కళాశాల భూములను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ కళాశాల విద్యార్థులు, బీజేపీ నాయకులు కొమురయ్య, తిరుపతి రెడ్డి, అమరేష్, రాజేష్, రూప్ సింగ్, ప్రవీణ్, అనిల్, గణేష్, రేవంత్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments