తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణం
భూపాలపల్లి జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి
స్పాట్ వాయిస్, మహదేవపూర్: బీజేపీ కుటిల రాజకీయాలను సీఎం కేసీఆర్ తిప్పి కొడుతుండడంతోనే కల్వకుంట్ల కవితపై అక్రమ కేసుల పేరుతో బీజేపీ మనోధైర్యం దెబ్బతీసేలా కుట్రలకు తెరలేపుతోందని, కార్యకర్తలు ఏమరుపాటున ఉంటే అన్యాయం జరుగుతుందని భూపాలపల్లి జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు, జెడ్పీ చైర్ పర్సన్, ఆత్మీయసమ్మేళన జిల్లా ఇంచార్జి గండ్ర జ్యోతి అన్నారు.
భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండల కేంద్రంలో ఆదివారం జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మంథని నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇన్ చార్జి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహదేవ్‌పూర్ పొలిమేరల నుంచి భారీ బైక్ ర్యాలీగా సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆనాడు సమైఖ్యాంధ్ర పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆలోచన చేసిన సీఎం కేసీఆర్ ఉద్యమస్పూర్తితో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. అలాంటి తెలంగాణలో అనేక అభివృధ్ది సంక్షేమపథకాలను అమలు చేసి దేశంలోనే అగ్రబాగాన నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. 2014 ఎన్నిల్లో 68 సీట్లు, 2018లో 88 సీట్లతో అధికారం చేపట్టామని, ఈసారి జరిగే ఎన్నికల్లో హాట్రిక్ సాధించేలా కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. గడపగడపకూ సంక్షేమ పథకాలను తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం తంటాలు పడుతుంటే బీజేపీ మతచిచ్చు పెడుతోందని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన టీఆర్‌ఎస్ పార్టీ దేశంలో అన్ని రాష్ట్రాలను అభివృధ్ది పథంలోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో బీఆర్‌ఎస్ పార్టీగా ఆవిర్బవిస్తే జీర్ణించుకోలేని బీజేపీ అనేక కుట్రలు చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్ నాయకులపై ఈడీ దాడులు, విచారణల పేరుతో భయానక వాతావరణం సృష్టిస్తోందన్నారు. తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్ పాలకులే కారణమని, ఆనాడు విద్య, వైద్య, వ్యవసాయ రంగాలను పట్టించుకోలేదన్నారు. కానీ, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 24 గంటల విద్యుత్, ఆధునిక వైద్యం, రైతులకు అనేక పథకాలను అమలు చేశాడన్నారు. కార్యకర్తలంటేనే పార్టీ అని, పార్టీకి కార్యకర్తలే బలమని, కార్యకర్తలను కలుపుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అభివృద్ది, సంక్షేమం రెండు కళ్లలా ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నాడని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంథనిలో ఎమ్మెల్యేగా పుట్ట మధును గెలిపించుకోవాలని ఆమె కోరారు.
తండ్రి ఆశయాలు ఏంటో ప్రజలకు చెప్పాలే
పెద్దపల్లి జిల్లా చైర్మన్ పుట్ట మధు
తండ్రి ఆశయాల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్న మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్‌బాబు అసలు తండ్రి ఆశయాలు ఏంటో ప్రజలకు చెప్పాలని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు. 20 ఏండ్లు అధికారంలో ఉండి నియోజకవర్గంలో ఏం అభివృద్ధి పనులు చేశారని, రింగ్‌రోడ్డు పూర్తి చేశారా..?, ధన్వాడలో నలుగురికి ఇండ్లు కట్టిచ్చాడా.?, చిద్నేపల్లికి బ్రిడ్జి వేయించాడా..?, చెరువులు పోయించాడా..? అని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉండి ఏం చేయకుండా ఆయన ఆశయాలు ఏంటని ఎద్దేవా చేశారు. మహదేవపూర్ మండలం లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషకరమైన విషయమని, కానీ అంబేద్కరిజం, బహుజనవాదం అంటే ఎంటో ఎమ్మెల్యే చెప్పాలన్నారు. అంబేద్కరిజం, బహుజనవాదం ఒక్కటేననే విషయం తెలియని పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఉన్నారన్నారు. మంథని నియోజకవర్గంలో 40 ఏండ్లు తండ్రి కొడుకులకు ఓట్లు వేసి అధికారం అప్పగించారని, మంథని ఎమ్మెల్యేకు చిత్తశుద్ది ఉంటే మంథని అంబేద్కర్ నగర్‌లోని దళితుల ఇండ్లకు బ్రాహ్మణులను తీసుకెళ్లి పూజలు చేయించాలని డిమాండ్ చేశారు. అధికారం కోసం ఎస్సీ, బీసీల మధ్యచిచ్చు పెట్టి ఓట్లు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కుట్రలు, కుతంత్రాలలోప్రజలను మభ్యపెట్టి పదవులు పొందుతున్నారని, ఏనాటికైనా ప్రజలకు నిజం తెలుస్తుందని ఆనాడు ప్రజలే తగిన బుద్ది చెబుతారని అన్నారు. 2014 ఎన్నికల్లో మహదేవ్‌పూర్ మండలం తనకు మెజార్టీ ఇవ్వలేదని, 2018లో సైతం అదేరీతిలో కొనసాగినా తాను ఏనాడు మండల ప్రజలను దూరం చేసుకోలేదన్నారు. తనకు వచ్చిన అవకాశంతో మండల అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, తనకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి రాగా తనతో పాటు అందిరికి పదవులు ఉండాలనే ఆలోచన చేశారని, పదవులు పొందడం కాదు పార్టీని కాపాడుకోవడంలో ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Recent Comments