Thursday, November 21, 2024
Homeక్రైమ్నాలుగు రోజుల్లో పెళ్లి.. అంతలోనే పెండ్లి కూతురు ఆత్మహత్య

నాలుగు రోజుల్లో పెళ్లి.. అంతలోనే పెండ్లి కూతురు ఆత్మహత్య

కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
భూపాలపల్లి జిల్లా చెల్పూర్ లో విషాదం

స్పాట్ వాయిస్, గణపురం: నాలుగు రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగింది. బంధువులు, ఆత్మీయులు పలకరింపులు, నవ్వులు విరబూయాల్సిన చోట.. కన్నీళ్లు.. ఏడుపులు నిండాయి. ఏమైందే ఏమో పాపం.. కుటుంబ సభ్యులంతా సంబురంగా పెండ్లి పనుల్లో ఉండగా.. పెళ్లి కూతురు మాత్రం.. ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల పరిధిలోని చెల్పూర్ లో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…చెల్పూర్ గ్రామానికి చెందిన బటికె సంపత్ దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు వివాహం చేశారు. చిన్న కూతురైన కోమల (25) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇంట్లో ఉంటుంది. మూడేళ్ల క్రితం కోమలకు పెళ్లి సంబంధం కుదుర్చి వరపూజ కూడా చేశారు. కాగా కోమల తనకు పెళ్లి ఇష్టం లేదనడంతో ఆ సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. ఇటీవల పోచారం గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకొని 28 న ఘనంగా వివాహం చేయాలని పెండ్లి పనుల్లో తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు. కాగా శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో కోమల ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆత్మహత్య చేసుకున్న కూతురిని చూసిన తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శనివారం మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments