నిధులు తెచ్చిందెవరు..? ఇచ్చిందెవరు..?
తమ హయాంలోనే నిధులు, ప్లాన్ అంటున్న గులాబీ
గెలిచాకే చాలెంజ్ గా తీసుకొని కట్టామంటున్న హస్తం..
ఆ రెండు కాదు.. కేంద్రం ఇచ్చిన స్మార్ట్ నిధులంటున్న కాషాయం
తెగని మోరీ పంచాయితీ
పశ్చిమ రాజకీయాల్లో హీట్ పెంచిన నయీంనగర్ బ్రిడ్జి..
నయీంనగర్ బ్రిడ్జి వరదలొచ్చినప్పుడు పతాక శీర్షికలోనే.. పునర్నిర్మాణం అయిన తర్వాత కూడా పతాక శీర్షికలోనే కొనసాగుతోంది. నిర్మాణంతో వరద సమస్య తీరినా.. రాజకీయ పార్టీల క్రెడిట్ లొల్లి మాత్రం తీరలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఏ పార్టీకాపార్టీ బ్రిడ్జి క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగానే బీఆర్ఎస్-కాంగ్రెస్ బ్రిడ్జిమే సవాల్ అంటూ లొల్లికి దిగాయి. నిధులు ఇచ్చింది.. బ్రిడ్జి ప్లాన్ చేసింది బీఆర్ఎస్ సర్కార్ అని గులాబీ శ్రేణులు చెబుతుండగా.. కాంగ్రెస్ సర్కార్ ప్రజా ప్రభుత్వమని, అధికారంలోకి రాగానే వరదలకు ప్రధాన ముప్పుగా నయీంనగర్ మోరీని చాలెంజ్ గా తీసుకొని పూర్తి చేశామని కాంగ్రెస్ చెబుతోంది. ఈ రెండు పార్టీలు మాటలతోనే కాదు.. బాహాబాహీకి దిగి మారి.. తేల్చుకునేందుకు రెడీ అయ్యాయి. ఇక తాజాగా బీజేపీ రంగంలోకి దిగింది. ఆ రెండు పార్టీలు ప్రజలకు అబద్దాలు చెబుతున్నాయని, నాయింనగర్ నాలా విస్తరణ, బ్రిడ్జి నిర్మాణం అంతా కేంద్రం ఇచ్చిన స్మార్ట్ నిధులు నుంచే చేశారని చెబుతున్నాయి. బీజేపీకి చారిత్రక నగరి ఓరుగల్లు అభివృద్ధికి కట్టుబడి ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. బుధవారం నయీంనగర్ బ్రిడ్జి సందర్శనతో పాటు.. ప్రజలకు నిధులు వివరాలు తెలిపిందేకు బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సిద్ధమైంది. మరి దీనిపై కాంగ్రెస్, బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: హన్మకొండ రాజకీయం నయీంనగర్ బ్రిడ్జిపైకి చేరింది. బ్రిడ్జి నిర్మాణం, నాలా విస్తరణ రాజకీయ దుమారానికి తెరలేపింది. మొదటి నుంచి బ్రిడ్జి నిర్మాణం క్రెడిట్ ను ఖాతాలో వేసుకునేందుకు గులాబీ, హస్తం పార్టీలు ఉత్సాహం చూపిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల లొల్లిలోకి తాజాగా బీజేపీ సైతం చేరింది. బ్రిడ్జి నిర్మాణం, నాలాల విస్తరణకు నిధులు ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్, బీఆర్ఎస్ కాదని, మోడీ సర్కార్ స్మార్ట్ సిటీ కింద నిధులు ఇచ్చారని, అందులో భాగంగానే ఈ డెవలప్ మెంట్ అని చెబుతున్నారు.
క్రెడిట్ కోసం..
నగరంలో ప్రధాన సమస్యగా నయీంనగర్ బ్రిడ్జి ఉండేది. దీని పరిష్కరిస్తే ప్రజలు ఆదరిస్తారని నాయకులకు సైతం తెలుసు. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు బ్రిడ్జి క్రెడిట్ ను సొంతం చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తాను గెలిచిన అనంతరం చాలెంజ్ గా తీసుకొని ఐదు నెలల వ్యవధిలో వెంటబడి బ్రిడ్జి నిర్మాణం, నాలా విస్తరణ పనులు పూర్తి చేశానని చెబుతున్నారు. ఇక బీఆర్ఎస్ నాయిని మాటలపై సీరియస్ గా స్పందించింది. బ్రిడ్జి నిర్మాణానికి మా ప్రభుత్వ హయంలో డిజైన్ చేసి నిధులు కేటాయిస్తే, ఎమ్మెల్యే నాయిని తన క్రెడిట్ పొందుతున్నాడని విమర్శలు చేశారు.
మోరీపైకి బీజేపీ
చారిత్రక నగరి ఓరుగల్లు అభివృద్ధి కోసం బీజేపీ పని చేస్తోందని ఆ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధులను కేటాయిస్తే.. అందులో తమ కార్పొరేటర్ తో కలిసి నాలా విస్తరణ, బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రాతిపాదించారని చెబుతున్నారు. ఆ నిర్మాణం బీఆర్ఎస్సో.., కాంగ్రెస్ పనితనమో కాదని, కేవలం బీజేపీకి అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమని చెబుతున్నారు. నిధుల కేటాయింపు విషయం నగర ప్రజలకు తెలిసేందుకు బుధవారం నాయీంనగర్ బ్రిడ్జి సందర్శనకు రావు పద్మా పిలుపునిచ్చారు.
ఎలా స్పందిస్తారో..?
నాయీంనగర్ బ్రిడ్జి లొల్లి నిన్నటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నడువగా.. ఇప్పుడు బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. మరి నిర్మాణం, విస్తరణ స్మా్ర్ట్ నిధులే అయితే.. ఆ రెండు పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలిమరి. తామే చేశామని గల్లలు, గల్లలు పట్టుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు రేపు బీజేపీకి ఎలాంటి సమాధానం ఇస్తారోననే ఆసక్తి నెలకొంది. మొత్తంగా హన్మకొండ రాజకీయాల్లో నాయీంనగర్ బ్రిడ్జి కీలకం మారిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Recent Comments