కార్మికుల హక్కులను హరిస్తున్న బీజేపీ
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత
స్పాట్ వాయిస్ కాజీపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఫాతిమా నగర్ లోని సెయింట్ గ్యాబ్రియల్ గ్రౌండ్ లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక ధర్మయుద్ధం బహిరంగ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థలను అదానీకి ధారాదాత్తం చేస్తూ ప్రజల ఆస్తులను దోచుకుంటుందని అన్నారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కాదు అదానీ అనే విధంగా తయారైందని ఎద్దేవా చేశారు. కార్మికుల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని, దేశసంపదను సృష్టిస్తున్న కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్న చట్టాలు, హక్కులను సవరణల పేరుతో కాలరాస్తోందన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, 4 కోడ్‌లను తీసుకొచ్చి కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలను బీజేపీ ప్రోత్సహిస్తుందని, దీంతో కార్మికులకు తీరని నష్టం వాటిల్లుతుందని అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇవ్వడమే కాకుండా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులను రెగ్యులరైజ్ చేసిన ఘనత టీఆర్ఎస్ దే అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా కార్మికులకు చేరేలా, సంఘటిత, అసంఘటిత కార్మికుల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించి వారిని చైతన్యం చేయడమే కార్మిక చైతన్య మాసోత్సవ ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ఆరురి రమేష్, నరేందర్, కూడా ఛైర్మన్ సుందర్ రాజు యాదవ్, మేయర్ గుండు సుధారాణి, వాసుదేవరెడ్డి, దాస్యం విజయ్ భాస్కర్, ఎల్లావుల లలిత యాదవ్, కార్పొరేటర్లు, కార్మిక సంఘాల నాయకులు, డివిజన్ ల అధ్యక్షులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Recent Comments