కేంద్ర మంత్రి.. రోడ్డుపై కూర్చొని ధర్నా చేయడం ఏంటీ..?
ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్
స్పాట్ వాయిస్, జనగామ: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ అమాయకులైన విద్యార్థులను, నిరుద్యోగులను అడ్డుపెట్టుకుని అనవసరమైన ఆందోళనలు చేస్తూ వారిని పెడదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు కేంద్ర నుంచి ఏం సాధించని బీజేపీకి మాట్లాడేందుకు ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి అనే విషయం మర్చిపోయి రోడ్డు పై కూర్చొని ధర్నా చేయడానికి సిగ్గుండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందని, కనీసం 2 వేల ఉద్యోగాలు కూడా ప్రకటించలేదన్నారు. బీజేపీ నాయకులు ఒకరు హైడ్రాను సమర్థిస్తే, మరొకరు విమర్శిస్తున్నారని, ఒకరు మూసీ ప్రక్షాళన చేయాలంటూ మరొకరు వద్దంటూ మాట్లాడడం వారిలో వారికి క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ఏ ఒక్క ప్రాజెక్టును తెలంగాణకు తీసుకురాలేని నాయకులు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సంకల్పనికి తోడుగా నిలబడాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
Recent Comments