Thursday, September 19, 2024
Homeతెలంగాణబాలాపూర్ లడ్డూ రికార్డ్ బ్రేక్..

బాలాపూర్ లడ్డూ రికార్డ్ బ్రేక్..

బాలాపూర్ లడ్డూ రికార్డ్ బ్రేక్..

రూ. రూ.30.1 లక్షలకు వేలం..

తొమ్మిది సార్లు ఆ వంశస్తులకే..

స్పాట్ వాయిస్, బ్యూరో:  బాలాపూర్‌ గణపతి లడ్డూ యావత్‌ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. లక్షల్లో లడ్డూ వేలం పలుకుతూ అందరి దృష్టి ఆకర్షించే బాలాపూర్‌ గణనాథుని చరిత్ర ఎంతో ఘనంగా ఉంది. లడ్డూ కొన్నవారికి కొంగు బంగారం అవుతుందనే నమ్మకం ఉండడంతో, ఈ ఏడాది సైతం రికార్డు స్థాయి ధర పలికింది. స్థానికుడు కొలను శంకర్ రెడ్డి, వేలం పాటలో రూ.30.1 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.

 రికార్డ్స్​ బ్రేక్

 బాలాపూర్‌లో ప్రతిష్టించే విజ్ఞాధిపతికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భాగ్యనగరంలో బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటకు ఘన చరిత్ర ఉంది. లంబోదరుడి చేతిలో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకుంటే, వారింట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. బాలాపూర్‌లో తొలిసారిగా 1980లో గణేశుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఉత్సవ నిర్వాహకులు 1994లో మొదటిసారి లడ్డూ వేలం నిర్వహించారు. తొలి వేలం పాటలో రూ.450కి స్థానికుడు కొలను మోహన్​రెడ్డి గెలుపొందారు. పొందిన లడ్డూను కుటుంబసభ్యులకు ఇవ్వడంతోపాటు వ్యవసాయ క్షేత్రంలో చల్లారు. ఆ కుటుంబానికి, కొలను మోహన్​రెడ్డికి ఆ ఏడాది అన్ని పనుల్లోనూ మంచి జరిగింది. లడ్డూ పొందడం ద్వారానే బాగా కలిసొచ్చిందని భావించిన మోహన్‌రెడ్డి, మరుసటి ఏడాది 1995లో మళ్లీ వేలంలో పాల్గొని లడ్డూను దక్కించుకున్నారు. అప్పుడు వేలం ధర రూ.4,500.  ఆ సంవత్సరం కూడా లడ్డూ పొందిన అతడికి అన్ని విధాల కలిసి వచ్చింది.

తొమ్మిదిసార్లు వాళ్లకే..  

 ఇలా 1994లో 450 రూపాయలతో మొదలైన లడ్డూ వేలంపాట, వందలు, వేలు దాటి రికార్డు స్థాయిలో లక్షలు పలుకుతోంది. 2001వరకు బాలాపూర్ లడ్డూ వేలల్లోనే పలికింది. 2002లో కందాడ మాధవరెడ్డి పోటీపడి రూ.1,05,000కు లడ్డూ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఒక్కో లక్ష పెరుగుతూ వచ్చింది. 2007లో స్థానికుడు రఘునందనచారి 4,15,000 రూపాయలకు పాటపాడి లడ్డూను దక్కించుకున్నారు. 2015లో బాలాపూర్ లడ్డూ రూ.10 లక్షలు దాటి రికార్డు సృష్టించింది. కల్లెం మదన్ మోహన్‌రెడ్డి రూ.10,32,000 లకు లడ్డూను దక్కించుకున్నారు. కాగా ఇప్పటివరకు జరిగిన బాలాపూర్‌ వేలంలో అత్యధికంగా ఎనిమిది సార్లు కొలను వంశస్తులే దక్కించుకోవటం గమనార్హం. గతేడాది 2023లో రూ.27 లక్షలకు లడ్డూ వేలం ధర పలకగా, ఈసారి అంచనాలకు తగ్గట్టు రూ.3.01 లక్షలకు కొలను కుంటుంబం మళ్లీ లడ్డూను దక్కించుకుంది. దీంతో తొమ్మిది సార్లు కొలను కుటుంబమే ఆ మహా ప్రసాదం దక్కించుకుంది. ఈ దఫా బాలాపూర్ లడ్డూను దేశ ప్రధాని మోదీకి అంకితం ఇస్తున్నట్లు లడ్డూ విజేత కొలను శంకర్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments