ఢిల్లీ సీఎంకు రాని బెయిల్ కవితకు ఎలా..?
డిప్యూటీ సీఎంకు 15నెలలకు బెయిల్..
కవితకు ఐదునెలల్లో బెయిల్ పై తీవ్ర చర్చ..
==========
వెనకడుగు వేసేదే లే..
ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ ఆక్రమణలు తొలగిస్తాం..
నిర్మాణాలు ఎవరివైనా కూల్చివేస్తాం..
చెరువుల ఆక్రమణలపై నిజనిర్ధారణ కమిటీ
జన్వాడ ఫామ్ హౌస్ లీజుకని కేటీఆర్ చూపలే..
===========
ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ కు జీతం..
డబ్బులు తీసుకుంటున్నందుకైనా ప్రజల్లో తిరగాలి..
బీఆర్ఎస్ నేతలు పాపాలు కడుక్కోవాలి..
మీడియాతో సీఎం రేవంత్ చిట్ చాట్..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సాక్షాత్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు రాని బెయిల్ ఎమ్మెల్సీ కవితకు ఎలా వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆమెకు ఐదు నెలల్లోనే బెయిల్ రావడంపై చర్చ జరుగుతుందని వ్యాఖ్యానించారు. కవితకు బెయిల్ఇవ్వడాన్ని తప్పుబట్టడం లేదంటూనే.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరించినట్లు తెలుస్తోందంటు చెప్పుకొచ్చారు. ఇక కూల్చివేతలపై వెనక్కి తగ్గేదేలేదని, హైడ్రాకు మరిన్ని పవర్స్ ఇస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఓల్డ్ సిటీ అయినా.. ఇంకేదైనా సిటీ అయినా ఆక్రమణ అని తేలితే కూల్చుడు ఆగదన్నారు. జన్వాడలోని కేటీఆర్ ఫాం హౌస్ అక్రమ కట్టడమని పేర్కొన్నారు. తను, తన కుటుంబం ఎక్కడయినా కబ్జా చేసినట్లు కేటీఆర్ చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తానని సవాల్ విసిరారు. ఇక కేసీఆర్, హరీశ్ రావులపై సెటైర్లు వేశారు. హరీశ్ రావు దొంగ అని, రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని చెప్పి.. తప్పించుకొని తిరుగుతున్నాడన్నారు. ఇక కేసీఆర్ తో తనకు పోలిక లేదని, ఆయన ప్రతిపక్ష నాయకుడని, ఆయకు జీతం అందుకే ఇస్తున్నామని, జీతం తీసుకున్నందుకైనా ప్రజల్లో తిరగాలని సూచించారు. ఇక పదేళ్ల పాలనలోని పాపాలను బీఆర్ఎస్ నాయకులు కడుక్కొవాలన్నారు. బుధవారం సచివాలయంలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్నిర్వహించగా.. పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేజ్రీవాల్ రాని బెయిల్ కవితకు ఎలా..?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సాక్షాత్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు రాని బెయిల్ ఎమ్మెల్సీ కవితకు ఎలా వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆమెకు ఐదు నెలల్లోనే బెయిల్ రావడంపై చర్చ జరుగుతుందని వ్యాఖ్యానించారు. కవితకు బెయిల్ఇవ్వడాన్ని తప్పుబట్టట్లేదని చెప్పారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలలు పట్టిందన్న సీఎం.. అక్కడి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఇప్పటికీ బెయిల్ రాని విషయాన్ని గుర్తు చేశారు. ఈ అంశాలను పరిశీలిస్తే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కోసం పని చేసిందని ఆరోపించారు. ఆ ఎన్నికలకు, కవిత బెయిల్‌కు సంబంధం ఉందన్న చర్చ జరుగుతుందని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేశామని, 22,37,848 ఖాతాలకు రూ.17,939 కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. రుణమాఫీ కాని రైతుల జాబితాను తమకు ఇస్తే వారి పంట రుణంమాఫీ చేస్తామని కేటీఆర్, హరీశ్‌రావులకు సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
వెనకడుగు వేయం
నగరం, శివారు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రాకు మరిన్ని అధికారాలు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. హైడ్రా చేస్తున్న కూల్చివేతలపై ఒత్తిళ్లు వస్తున్నాయన్న సీఎం.. అయినా వెనక్కి తగ్గేది లేదని రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. పాతబస్తీ కాదూ ఏ బస్తీ అయినా సరే ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని స్పష్టం చేశారు. తన ఫాం హౌస్ బఫర్ జోన్ లో ఉందంటూ కేటీఆర్ చేసిన ఆరోపణకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తను, తన కుటుంబం ఎక్కడైన కబ్జా చేసినట్లు కేటీఆర్ చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తానని సవాల్ విసిరారు. అక్రమ కట్టడాలపై ప్రజా కోర్టులోనే తేల్చుకుందామని రేవంత్ రెడ్డి కేటీఆర్ కు సవాల్ విసిరారు. తన కుటుంబ సభ్యులకు చెందిన అక్రమ కట్టడాలు ఉంటే ఆధారాలు తీసుకుని రావాలన్న సీఎం.. కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమ కట్టడం అని ఆధారాలతోనే తాను గతంలో అక్కడికి వెళ్లానన్నారు. 111 జీవోపై సుప్రీంకోర్టు, ఎన్జీటీ మార్గదర్శకాలను పాటిస్తున్నామని చెరువులు, కుంటలలో కొన్ని భవనాలు కట్టుకోవడానికి సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చిందన్నారు. సెక్రటేరియెట్, జీహెచ్ఎంసీ లాంటి భవనాలకు సుప్రీంకోర్టు అనుమతి ఉందన్నారు. జీవో 111పై గత ప్రభుత్వం మభ్యపెట్టేలా వ్యవహరించిందన్నారు. జలాశయాల్లో నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యాసంస్థల ముసుగులో కబ్జా చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.
హైడ్రా హైదరాబాద్ కే పరిమితం..
ప్రస్తుతానికి హైడ్రాను హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమని స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఆక్రమణల తొలగింపే తొలి ప్రాధాన్యమని తేల్చి చెప్పారు. అలాగే చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపే తొలి ప్రాధాన్యం అని అన్నారు. కూల్చివేతలపై అక్రమార్కులతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ, భయాందోళనలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. హైడ్రా మొదట సీడబ్ల్యూసీ సభ్యుడు పల్లంరాజు నిర్మాణాన్నేకూల్చివేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే జన్వాడ ఫామ్‌హౌస్ లీజుకు తీసుకున్నట్లు కేటీఆర్ తన ఎన్నికల అఫిడవిట్లోప్రస్తావించలేదని సీఎం పేర్కొన్నారు. నిర్మాణాలకు అనుమతి ఇచ్చేది అధికారులే తప్ప సర్పంచులు కాదని కేటీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. చెరువుల్లోని ఆక్రమణలపై అధ్యయనం జరుగుతుందని సీఎం తెలిపారు. ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలని అందుకే వారి నిర్మాణాలపై దృష్టి పెట్టామని చెప్పారు. హైడ్రా ఏర్పాటుకు చట్టం అవసరం లేదన్న ఆయన జీవో ఉంటే చాలన్నారు.
ఆక్రమణలపై నిజనిర్ధారణ కమిటీ..
30 ఏళ్ల క్రితం నిర్మించిన కట్టడాలైనా హైడ్రా చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చెరువుల ఆక్రమణలపై నిజనిర్ధరణ కమిటీ వేస్తామని వెల్లడించారు. హరీశ్‌రావు నేతృత్వం వహిస్తానంటే ఆయన నేతృత్వంలోనే కమిటీ వేస్తామని ఎద్దేవా చేశారు. హైడ్రా కూల్చివేతలపై ఒత్తిళ్లు వస్తున్నాయి, వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.
హరీష్ రావు దొంగ…
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును సీఎం రేవంత్ రెడ్డి ఓడిపోయిన దొంగగా అభివర్ణించారు. రుణమాఫీపై హరీష్ రావు చేసిన సవాల్‌కు కట్టుబడి లేడన్న సీఎం… హరీష్ రావు రాజీనామా చేయకుండా పారిపోయారన్నారు. చెరువులపై హరీష్ రావుకు మంచి అవగాహన ఉందన్న సీఎం.. అందుకే ఆయన హయాంలో కమిషన్ కాకతీయ వచ్చిందన్నారు. రుణమాఫీ అనేది తన కమిట్మెంట్ అన్న సీఎం తాను చెప్పింది చేసి చూపించానన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇచ్చిన హామీలపై బహిరంగ చర్చలు జరుపుదామా అని సవాలు విసిరారు. అన్ని పార్టీల మేనిఫెస్టోలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చిద్దామన్నారు. అప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని పారిపోవద్దన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామనీ రుణమాఫీ కాలేదు అంటే కేటీఆర్, హరీష్ రావు గ్రామాలు తిరగాలన్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామాలు తిరిగి రైతుల ఖాతాలను లిస్టు తయారు చేసి కలెక్టర్లకి ఇవ్వాలన్నారు.
కేసీఆర్‌కు, నాకూ పోలిక ఏంటి?
తనకు కేసీఆర్ కు పోలిక ఏంటనీ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాను కొడంగల్, కోస్గి, కొండారెడ్డి పల్లికి మాత్రమే హెడ్‌ను కాదనీ. రాష్ట్రానికి ముఖ్యమంత్రినన్నారు. కేసీఆర్ కేవలం ప్రతిపక్ష నాయకుడన్నారు. ఆయన బయటకు వచ్చి ప్రజల కోసం పోరాటం చేయాలన్నారు. కేసీఆర్‌కు ప్రతిపక్ష నాయకుడు హోదాలో జీతాలు ఇస్తున్నామన్న సీఎం జీతం తీసుకుంటున్నందుకైనా ప్రజల్లో తిరగాలని సెటైర్టు వేశారు. ప్రభుత్వ వ్యవస్థలను వాడుకుంటున్న కేసీఆర్ పని చేయకపోతే ఎలా అని సీఎం ప్రశ్నించారు.? రుణమాఫీపై ధర్నాలు చేసేవారందరూ బీఆర్ఎస్ కార్యకర్తలేనని, బీఆర్ఎస్ ధర్నాల్లో అసలు రైతులు లేరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్ల కాలంలో తాము చేసిన పాపాలను కడుక్కోవాలన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండేందుకు తమకు కావలసినంత బలం ఉందన్నారు.
Recent Comments