హన్మకొండ జిల్లాలో విషాదం
పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
మూడు నెలల్లో రెండు ఘటనలు..
స్పాట్ వాయిస్, ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్ గ్రామానికి చెందిన బండి విజయ్ (22) విద్యార్థి ఇంజెక్షన్ వికటించి సోమవారం రాత్రి మృతిచెందినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. జగన్నాథపూర్ గ్రామానికి చెందిన బండి రవీందర్-తిరుమల దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విజయ్ పంజాబ్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్దామని నిర్ణయించుకొని, వీసా పనులు పూర్తి చేసుకున్నాడు. త్వరలో వెళ్లే పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. శనివారం అలసటగా ఉండగా, జీల్గుల విలేజ్ కు చెందిన ఆర్‌ఎంపీ వేముల శ్రీనివాస్ వద్దకు సాయంత్రం సమయంలో వెళ్లాడు. తుంటికి ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆదివారం వరకు గడ్డలా మారింది. ఇదే క్రమంలో మరోసారి సదరు ఆర్ఎంపీ ఇంజెక్షన్ వేసి, మందులు ఇచ్చాడు. అయినా నొప్పి తగ్గలేదు. దీంతో ఆ ఆర్ఎంపీ సోమవారం ఉదయం హుజూరాబాద్ లోని ఓ దవాఖానకు తీసుకువెళ్లారు. పరిస్థితి సీరియస్ గా ఉందని హన్మకొండలోని రక్షిత్ మల్టీ స్పెషాలిటీకి తరలించారు. అక్కడ డాక్టర్ సి. అశ్రిత్ రెడ్డి విజయ్ ని పరీక్షించాడు. రోగి పరిస్థితి విషమంగా ఉందని తెలిసి, 4 రోజుల తర్వాత ఆసుపత్రికి రావాలని సూచించి ఇంటికి పంపించాడు. సాయంత్రం వరకు విజయ్ పరిస్థితి క్షీణించడంతో ఎంజీఎం దవాఖానకు తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తన కుమారుడి మరణానికి ఆర్ఎంపీ వేముల శ్రీనివాస్, రక్షిత్ దవాఖాన వైద్యుడు అశ్రిత్ రెడ్డి కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని విజయ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.
మితిమీరిన ఆగడాలు..
ఎల్కతుర్తి మండలంలో ఆర్ఎంపీల ఆగడాలు మితిమీరుతున్నాయి.. వైద్యం వికటించి మూడు నెలల్లో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. ఇదే మండలంలోని బావుపేట కు చెందిన ఆటో డ్రైవర్ ఇంజెక్షన్ వికటించి ఇటీవల మృతిచెందగా, రూ. 8 లక్షలకు కుటుంబ సభ్యులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఆ డబ్బులు చెల్లించకుండా తప్పించుకోవడంతో బాధితులు ఆర్ఎంపీ ఇంటి ఎదుట బైఠాయించారు. తాజాగా జీల్గుల ఆర్ఎంపీ నిర్వాకం వెలుగుచూసింది. కొన్ని సందర్భాలలో ఆర్ఎంపీలు చేతివాటం ప్రదర్శించి, తమకు అనుకూలంగా ఉన్న దవాఖానలకు రెఫర్ చేస్తూ పేషెంట్ల నుంచి అందినకాడికి గుంజుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. నైపుణ్యం ఉన్న వైద్యులు నిర్వర్తించాల్సిన విధులు అర్హత లేని వారు నిర్వహిస్తున్నారని, పేదల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Recent Comments