Saturday, November 23, 2024
Homeటాప్ స్టోరీస్పుష్ప.. తమ్ముల్లా ఏందీ..?

పుష్ప.. తమ్ముల్లా ఏందీ..?

మన్నెంలో స్మగ్లింగ్ స్మెల్..
ఏజెన్సీ అడవుల్లో పుష్ప సీన్
జోరుగా గంజాయి రవాణా
దొరికితే దొంగ లేదంటే దొరే
భద్రాద్రిలో అరటన్ను గంజాయి పట్టివేత
ట్రాక్టర్లో ఛాంబర్ కట్టి తరలింపు
గంజాయి స్మగ్లర్లు మాస్టర్ ప్లాన్

 

స్పాట్ వాయిస్, భద్రాచలం : భద్రాచలం మన్యంలో పుష్ప చిత్రం సీన్లు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. అడవిమాటున అక్రమం రాజ్యమేలుతోంది. గంజాయి స్మగ్లింగ్ జోరు అందుకుంది. గంజాయి స్మగ్లర్లు గంజాయి తరలింపునకు రకరకాల మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు. భద్రాచలం మీదుగా కోట్లాది రూపాయలు విలువ చేసే నిషేధిత గంజాయి సరిహద్దులు దాటుతోంది. సోమవారం అర టన్ను విలువ చేసే గంజాయి పోలీసులకు చిక్కటం గమనార్హం. ట్రాక్టర్ ట్రాలీకి ప్రత్యేక ఛాంబర్ కట్టి అందులో గంజాయి ప్యాకెట్లు తరలిస్తుండగా పట్టుబడిన సంఘటన ‘పుష్ప’ చిత్ర సన్నివేశం గుర్తుకు తెచ్చింది.

మన్నెంలో స్మగ్లింగ్ స్మెల్…
భద్రాచలం మన్యంలో నిషేధిత గంజాయి స్మగ్లింగ్ గుట్టుగా సాగుతోంది. ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అడవుల్లో గంజాయి సాగు జరుగుతుండగా, ఈ నిషేధిత గంజాయిని అక్కడినుంచి సమీప భద్రాచలం అటవీ ప్రాంతం గుండా అక్రమార్కులు సరిహద్దును దాటిస్తున్నారు. ఒడిశాలోని చిత్రకొండ, కల్లూరు, బలిమెల, పెళ్లి బాయ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుత్తేడు, డొంకరాయి, సీలేరు, కొండరాజుపేట, ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాల్లో గంజాయి పెద్ద ఎత్తులో సాగుతోంది. దొరికితే దొంగ లేదంటే దొర అన్న చందంగా స్మగ్లర్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. ఛత్తీస్ గఢ్, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో చెక్ పోస్ట్ లు ఉన్నా అవి ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యాయి. అక్కడి అధికారుల కనుసనల్లోనే ఈ గంజాయి రవాణా సాగుతోందన్న ఆరోపణలు లేకపోలేదు. ఇదిలా ఉండగా తెలంగాణ భద్రాచలం వద్ద కూడా చెక్ పోస్ట్ లు ఉన్నాయి. అడపాదడపా ఇక్కడ కూడా గంజాయి పట్టుబడుతున్నప్పటికీ పెద్ద ఎత్తున భద్రాచలం కూడా గంజాయి దాటి పట్టణాలకు తరలిపోతోందని తెలుస్తోంది. గతంలో పెద్ద ఎత్తున గంజాయి పట్టు పడగా, ఇటీవల కాలంలో స్మగ్లర్లు రకరకాల మార్గాల ద్వారా గంజాయిని సరిహద్దు దాటిస్తున్నట్లు సమాచారం.

భద్రాచలంలో గంజాయి పట్టివేత.. విలువ రూ.కోటి పైనే..
భద్రాచలంలో సోమవారం భారీగా గంజాయి పట్టుబడింది. రూ.కోటి విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం భద్రాచలం కూనవరం రోడ్ చెక్ పోస్ట్, సీఆర్పీఎఫ్ క్యాంపు వద్ద ఎస్సై శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు చేస్తుండగా మల్కన్ గిరి(ఒడిశా రాష్ట్రం)కి చెందిన ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్ లో తరలిస్తున్న 485 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. ఆంధ్ర – ఒడిశా సరిహద్దులలో గల మల్కన్ గిరి వద్ద నుంచి కరీంనగర్ కు భద్రాచలం మీదుగా అక్రమంగా తరలిస్తుండగా రఘునాథ్, రబింద్ర అను ఇద్దరిని పట్టుకున్నట్టు ఏఎస్పీ వెల్లడించారు. మరో ఆరుగురు ఈ అక్రమ గంజాయి తరలింపులో భాగస్వాములుగా ఉన్నట్లు తెలిపారు. ఒక్కొక్క గంజాయి ప్యాకెట్ 5 కిలోల బరువు ఉంటుందని, మొత్తం 97 ప్యాకెట్లు ఉంటాయని పట్టుబడిన గంజాయి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని ఏఎస్పీ పేర్కొన్నారు. గంజాయి తరలింపుకు ట్రాక్టర్ ట్రాలీకి సీక్రెట్ ఛాంబర్ ను ఏర్పాటు చేసుకొని పలుమార్లు విజయవాడ, గుంటూరు, కరీంనగర్లలో వీరు అమ్మినట్లుగా ఏఎస్పీ తెలిపారు. భద్రాచలం టౌన్ సీఐ నాగరాజు రెడ్డి కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments