Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్అంతా సుబ్బారావే చేశాడు..

అంతా సుబ్బారావే చేశాడు..

అంతా సుబ్బారావే చేశాడు..
అల్లర్ల ఘటనపై.. పోలీసులు దర్యాప్తు

స్పాట్ వాయిస్ , హైదరాబాద్: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసంలో సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ సుబ్బారావు కీలకంగా వ్యవహరించాడని రైల్వే పోలీసులకు పక్కా ఆధారాలు లభించాయి. విధ్వంసం సృష్టించాలన్న ప్రణాళిక, కార్యాచరణను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారనే సాక్ష్యాలనూ సేకరించారు. జూన్‌ 16న సుబ్బారావు అనుచరులతో గుంటూరు నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో దిగాడు. ముఖ్య అనుచరులు శివ, మల్లారెడ్డితో చర్చించాడు. వారి ద్వారా ఆర్మీ విద్యార్థులను రప్పించుకుని ఆ రోజు రాత్రి సమాలోచనలు జరిపాడు. మూకుమ్మడిగా రైల్వే స్టేషన్‌లోకి వెళ్లి దాడులు చేయాలని సూచించాడు. లోటుపాట్లుంటే అప్పటికప్పుడు సరిచేసేందుకు వీలుగా అనుచరులనూ మాస్కులతో స్టేషన్‌లోకి పంపించాడు. విధ్వంసం మొదలైన కొద్దిసేపటికి గుంటూరుకు పారిపోయినట్లు రైల్వే పోలీసులు గుర్తించారు.

సాంకేతిక ఆధారాలతో…

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు నిర్వహించిన ఆందోళనకు సంబంధించి అన్ని వ్యవహారాల్లోనూ సుబ్బారావు ప్రమేయం ఉందని రైల్వే పోలీసులు ముందు నుంచీ అనుమానిస్తున్నారు. విధ్వంసం ప్రారంభమైన అరగంట వ్యవధిలోనే పదిహేను మంది పోలీస్‌ అధికారులు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు వాట్సాప్‌ గ్రూపుల్లో ఉన్న సభ్యుల ఫోన్‌ నంబర్లన్నింటినీ పరిశీలించారు. అభ్యర్థులు రూపొందించుకున్న ఎనిమిది వాట్సాప్‌ గ్రూపుల్లో.. నాలుగింటిలో సుబ్బారావు సభ్యుడిగా ఉన్నట్టు గుర్తించారు.

పట్టుబడిన అనుచరులు.. బయటకొచ్చిన నిజాలు

అల్లర్ల కేసులో సుబ్బారావును అనుమానితుడిగా భావించిన రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణ లో తనకెలాంటి సంబంధం లేదంటూ బుకాయించాడు. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు శివ, మల్లారెడ్డి సహా మరో ముగ్గురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. ప్రశ్నించగా.. సుబ్బారావుకు రైల్వే విధ్వంసంతో సంబంధం ఉందని, ఆయన తమకు ఫలానా ఫలానా పనులు అప్పగించాడని వారు చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సుబ్బారావు తాను ఈ నెల 16న సికింద్రాబాద్‌కు వచ్చానని అంగీకరించినట్టు సమాచారం. దీంతో గురువారం అర్ధరాత్రి సుబ్బారావు, ఆయన అనుచరులను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments