గుంతలో పడి ఆటో బోల్తా
– ఒకరికి తీవ్ర గాయాలు
-353 జాతీయ రహదారిపై ఘటన
స్పాట్ వాయిస్, గణపురం: మండలంలోని మైలారం గ్రామ శివారు 353 జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలో ఆటో బోల్తా పడి ఒకరికి తీవ్రగాయాలైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన ఇంచర్ల నాగరాజు ఆదివారం భూపాలపల్లిలో జరుగుతున్న గురుకుల ప్రవేశ పరీక్షలకు తన కూతురుతో పాటు మరి కొందరు కలిసి ఆటోలో భూపాలపల్లికి వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో మైలారం గ్రామం సమీపంలో ప్యారడైస్ దాబా హోటల్ వద్ద జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలో ఆటో ముందు చక్రం పడడంతో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న నాగరాజుకు తీవ్రగాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. నాగరాజును 108 వాహనంలో వరంగల్ ఎంజీఎంకు తరలించినట్లు తెలిపారు.
ప్రమాదంగా మారిన పట్టించుకోరా..?
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారం గ్రామం 353 జాతీయ రహదారి ప్రమాదకరంగా మారింది. సహజంగా రహదారిపై గుంతలు ఏర్పడితే పూడ్చాల్సిన ఆర్ అండ్ బీ అధికారులే గుంతలు తీసి పూడచ్చకుండా వదిలేయడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు జరిగే ఈ జాతీయ రహదారిపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అసలు ఆర్ అండ్ బీ అధికారులు ఉన్నారా..? అనే అనుమానం కలుగుతోంది. వారి నిర్లక్ష్యం కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గుంతలలో వాహనాలు నడపాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంత అలాగే ఉంటే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలు పూడ్చి వేయాలని వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Recent Comments