Monday, September 23, 2024
Homeలేటెస్ట్ న్యూస్సిపాయిగా రావాల్సింది.... సచ్చి రావడ్తివి..

సిపాయిగా రావాల్సింది…. సచ్చి రావడ్తివి..

అయ్యో కొడుకా.. ఎంతపనాయె…
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న రాకేష్ తల్లిదండ్రులు
సికింద్రాబాద్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రాకేష్
గ్రామంలో విషాదచాయలు

‘‘దేశం కోసం కొట్లాడుతవనుకుంటే దిక్కులేని సావు సత్తివి.., మిల్ట్రీ బట్టలేసుకుని ఊళ్లెకు వస్తవనుకుంటే పెట్టెల పండుకొని రావడ్తివి. అక్క మిల్ట్రిల జేత్తాంది.. నేనుకుడా పోతా అని కనవడ్డోళ్లకల్లా చెప్పుకుంట ముర్తివి.., మిల్ట్రీలకద్దురా ఇంకేదన్న ఉద్యోగం చేసుకుందామని సోపతిగాళ్లు ఎన్నిమాట్ల చెప్పినా ఇనకపోతివి. సస్తే దేశం కోసమే సావాల్రా.., జన్మనిచ్చిన దేశానికి రుణం తీర్చుకోవాల్రా.. అని వాళ్లనే సముదాయించేటోడివి. ఉద్యోగంల జెర్తే సూసి మురిసిపోతామనుకుంటే, ఇయ్యాల సచ్చిపోయి వత్తానవంటే ఎట్ల తట్టుకోవ్రాల బిడ్డా…’’ అని రాకేష్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మీమేం పాపం జేసినమని దేవుడిశిక్ష వేసిండని కనబడ్డోళ్లనల్లా అడుగుతూ గుండెలవిసేలా ఏడుస్తున్నారు.
-స్పాట్ వాయిస్, నర్సంపేట

అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ స్టేషన్లో జరిగిన విధ్వంసకాండ అందర్నీ ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది. ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అందరూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ఘటనలో ఆందోళనకారులు రాళ్లు రువ్వగా ప్రతిగా పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని, కాల్పుల్లో వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దబీర్ పేటకు చెందిన రాకేశ్‌ అనే యువకుడు మరణించాడని పేర్కొన్నారు.

అక్క స్ఫూర్తితో..
రాకేశ్ తండ్రి కుమార స్వామి రైతు. అతడికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. రాకేశ్ అక్క సంగీత బీఎస్ఎఫ్ జవాన్‌ గా పశ్చిమ బెంగాల్‌లో పని చేస్తోంది. ఎప్పుడూ ఆమెనే స్ఫూర్తి తీసుకుని, ఆమె ప్రోత్సాహంతో తాను కూడా సైన్యంలో చేరాలని రాకేశ్ కలలు కనేవాడు. సిపాయిగా కావాలని తీవ్రంగా శ్రమించాడు. రాకేశ్ హెయిర్‌స్టయిల్ చూస్తేనే అతడికి ఆర్మీలో చేరడం అంటే ఎంత ఇష్టమో తెలుసుకోవచ్చు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితమే రాకేశ్ హైదరాబాద్ వెళ్లాడు. శుక్రవారం సికింద్రాబాద్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో దురదృష్టవశాత్తు మృతి చెందాడు. అతడి మరణ వార్తను అక్కడి పోలీసులు కుటుంబీకులకు తెలిపారు. దీంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. వారిని వరంగల్ పోలీసులు సికింద్రాబాద్ తీసుకెళ్లారు. రాకేష్ మృతితో దబీర్ పేటలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. కాగా, సికింద్రాబాద్‌ కాల్పుల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచ గ్రామానికి చెందిన లక్కం వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లగా ప్రస్తుతం గాంధీ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు.

ఇది ముమ్మాటికీ కేంద్రం హత్యే
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
దామెర రాకేష్ ది కేంద్ర ప్రభుత్వ హత్యేనని, కేంద్ర వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. ఆయన శుక్రవారం రాకేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం దేశానికి సేవ చేసే సైనిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రశ్నించిన వాళ్లను కాల్చి చంపడం హేయమైన చర్య అన్నారు. ఒక పేద విద్యార్థిని బలితీసుకున్నారని, ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారన్నారు. రాకేష్ మృతికి సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. దేశంలో భయానక వాతావరణం సృష్టించేందుకు మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం నర్సంపేట బంద్ కు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments