అనుమానపు ఉపశమనం..?
ఎవరి దారి వారిదైతే ఎవరికి చెప్పుకుని మాత్రం ఏం ప్రయోజనం. పట్టింపులను పంచుకుని తుట్టెలు కట్టుకుని మరీ పేనితే తట్టుకుని నిలవడం మాత్రం ఎవరి తరం. ఏదైనా జరగాల్సినప్పుడు జరిగితేనే గౌరవం., అందాల్సిన సమయంలో దక్కితేనే విలువ. మూసుకుపోతున్న దారిని లాంతర్లు వేసుకుని వెతికినా ప్రయోజనం ఉండదు.., నష్టం జరుగుతున్న వేళ వేడుక చూస్తే జరగాల్సిన తంతును ఆపడమెవరికీ సాధ్యం కాదు. ఇప్పుడు రైతులు, అధికారులు.., నాయకుల త్రిముఖ వ్యూహంగా అప్రకటిత పోరు జరుగుతున్నది. కలిసి నడవాల్సిన అన్నదాతను శత్రువుగా భావిస్తున్న ‘ఘటికులు’ సాధిస్తున్నది ఏమిటో..? ఏం మూట గట్టుకుంటారో గానీ కర్షకుడు ఆగమైన వేళ అంతా సర్వనాశనం అనే సామాన్య విషయాన్ని మరిచిన విషయమే అత్యంత దౌర్భాగ్యం.
అధికారులేమో హడావుడి చేస్తున్నారు. అన్నదాతలేమో ఆగమాగమవుతున్నారు. నేతలేమో మిన్ను విరుగుతున్నా, సోయి లేకుండా నిమ్మలంగా, నింపాదిగా నిల్చొని చూస్తున్నారు. పొలాల్లో నడవాల్సిన పాదాలు తారు రోడ్డుపై కవాతు చేస్తున్నాయి. సాగులో తలమునకలవాల్సిన రైతు సహాయ నిరాకరణతో అలసి పోతున్నాడు. భూములుంటాయా.., పోతాయా… అనే ఆందోళనలో అన్నపానీయాలు మాని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. లాక్కోవాల్సిన అఘాయిత్యం ఎవరికొచ్చిందో…, లాక్కుంటే ఎవరికి అదృష్టమో, ఎవరికి దురదృష్టం చుట్టుకుంటుందో నిర్ణయించిన పాలకులు ఒడ్డున కూర్చుని జరగాల్సిన తంతును ‘పెంచి’ పోషిస్తున్నారు. చేయాల్సిన పనులు వదిలి, తమ వల్ల కాని రాజకీయ క్రీనీడలో పావులుగా మారిన కర్షకుడు రంగుల జెండాలతో రగులుతున్న ఎండలో మాడిపోతున్నాడు. మరుగుతున్న మేధావులకు రుధిరాభిషేకం సమర్పించి, విరిగిన ఎముకలు, కమిలిన మాంసపు ముద్దలతో నులకమంచాలు పట్టుకుని నడవలేని దుస్థితిలో ‘వాలి’పోతున్నారు.
కాలం నెత్తిమీదికొచ్చిన ఈ వేళ అన్నదాతకు అందాల్సిన విత్తనాలు, ఎరువుల గురించి ఆలోచించాల్సిన సోయి మరిచి అనవసరపు వాటితో సమయాన్ని వృథా చేస్తున్న ఘనాపాటిల రాజ్యం నడుస్తోంది. సందట్లో సడేమియా మాదిరిగా ఎవరి పనుల్లో వారుంటున్నారు. ఇటు యంత్రాంగం, అటు నేతలు రైతును దగా చేసే పనిలో నిమగ్నమై ఉంటుండగా, వారికి కలిసొచ్చినట్టుగా మోసగాళ్లు కూడా వాటం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే నకిలీలు గుట్టు చప్పుడు కాకుండా నగరాల నుంచి మారుమూల తండాలకు సైతం చేరాయనేది వినిపిస్తున్న కఠోర సత్యం. పాపం ఖాకీలేమో నాయకులకు ఏమీ కాకుండా చుట్టు రక్షణ వలయంగా ఉండడానికే సరిపోతున్నది.., అధికారులేమో సొంత ఆలోచనలను పూర్తిగా మరిచిపోయి ఐదేళ్లుండే అధినేతల నీడలో జీ హుజూర్ అనే పనిలో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. రైతులేమో సొంత భూములను రక్షించుకోవడం, యేడాదంతా బిజీలో ఎండాకాలంలో చేసుకుందాం లే అని పెండింగ్ లో పెట్టుకున్న పనులతోనే తలమునకలై ఉన్నారు.
అవసరం వారిని ‘నకిలీ’ వైపు పురిగొల్పుతున్నది., అవకాశం వీరిని కోట్లు కొల్లగొట్టుకోమని ప్రోత్సహిస్తున్నది. నిద్రపోతూ మేల్కొనే ఉన్నామనే నటనలో ఉన్న సర్కార్ తొత్తులు, రాజ్యాంగ శక్తులతో వీరికి భారీగా కలిసొస్తున్నది. కట్టడి ముందే జరిగితే నష్టం నివారణ పెద్ద సమస్యేమీ కాదు., విచ్చలవిడిగా జరుగుతుంటే పట్టుతప్పి జరగాల్సింది జరుగుతుంది.., బలికావాల్సిన వారు అవుతూనే ఉంటారు. ఎటొచ్చి ఇప్పటికైనా యంత్రాంగం ఎవరికి వారుగా రైతన్న పక్షాన కాస్త శ్రద్ధ పెట్టి నకిలీల బెడదలు లేకుండా, అన్నదాత నట్టేట మునగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మనస్సు పెడితే అంతా సంతోషమే. అంతకన్నా సంతోషమేముంటది.?
ప్రగతి పరుగులు పెడుతున్న మాటలో నిజముందో లేదో తెలియదుగానీ, పాలకులు మాత్రం తమదైన వక్ర రచనను కొనసాగిస్తున్నారు. గత నాలుగైదు పర్యాయాలను ఉదహరిస్తూ, ఈ దఫాకు సంబంధించిన లెక్కలేసుకుంటున్నారు. ‘పల్లె, పట్టణా’లకు ప్రజలెక్కడ దూరమవుతారోనని కొద్ది రోజులుగా ఉంటున్న గడబిడలకు తాత్కాలిక బ్రేక్ ఇస్తూ, జరగాల్సిన కార్యానికి విఘాతం లేకుండా జాగ్రత్తపడుతున్నారు. అయినా సరే ఆయా సందర్భాల్లో అస్సలు నేతల మధ్యే ప్రగతి పరిహాసమవుతున్న దాఖలాలు కోకొల్లలు. ‘నువ్వెళ్లిన చోటకు నేను రాను.., నువ్వు రాని చోటికే నేనెళ్తా’ అనే రీతిగా ప్రయాణంలో ముందస్తు ప్రణాళికా రచనలు మస్త్ గా రచిస్తున్నారు. ప్రజలందరికీ జవాబుదారీగా ఉంటూ, అగ్రభాగాన వెలుగొందాల్సిన వారు పక్కదారులు వెతుక్కుంటున్నారు. ప్రగతి పనుల్లో అభివృద్ధి ఏమోగానీ, చేపట్టిన కార్యాల్లో స్థానికంగా ఉన్న నేతల మధ్యే క్లారిటీ మిస్ అయ్యే సన్నివేశాలను చూస్తున్న జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. పెద్దాయన ఆదేశాలంటూనే ఎవరి ఇష్టారీతిగా వారు వ్యవహరిస్తూనే ఉన్నారు.
భారం తగ్గిందనే ఉపశమనమా..? లైన్ క్లియరెన్స్ కు మార్గం కాస్త సుగమం అయ్యిందనే ఆత్మ సంతృప్తో గానీ, హడావుడి మాత్రం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. నిన్నటి వరకు ఓ మాదిరిగా ఉన్న మైండ్ సెట్, సడెన్ గా మారితే గుర్తుపట్టడం అంత కష్టమేమీ కాదు. చేస్తున్నామో.., లేదంటే చేస్తున్నట్టుగా నటిస్తున్నమో గానీ గమనించడానికి మాత్రం అంతా నిఘా పెట్టే ఉన్నారు. ఎవరూ చూడడం లేదనుకుని చూస్తున్న కళ్లను చూడకుండా మనకు మనంగా తప్పించుకు తిరుగుతున్నామనే అతి విశ్వాసంతో వెళ్తుంటే కన్నంలో దాక్కున్నా లాగిపట్టి మరీ తీసుకొచ్చి అన్నీ గుర్తుకు చేస్తారు. దేనికైనా సమయం రావాలి.. సందర్భమూ కలిసిరావాలి….
రాజేంద్ర ప్రసాద్ చేలిక
ఎడిటర్
Recent Comments