స్పాట్ వాయిస్, క్రైమ్: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో 17ఏళ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 28న జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్‌కు బాలిక తన ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లింది. పబ్‌లో వారితో కలిసి విందులో పాల్గొంది. పబ్ నుంచి బయటకు వచ్చాక ఇంటివద్ద డ్రాప్ చేస్తామంటూ బాలికను కారులో తీసుకెళ్లారు. మార్గమధ్యలో మరో ఇద్దరు కారు ఎక్కారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారులోనే బాలికపై లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలు కేకలు వేయడంతో యువకులు ఆమెను పబ్ ఆవరణలో వదిలివెళ్లారు. అనంతరం ఇంటికి వచ్చిన కూతురి మెడపై తల్లిదండ్రులు గాయాలు గమనించారు. ఏం జరిగిందని ఆరా తీయగా.. కొందరు యువకులు తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై అసభ్య ప్రవర్తన కింద కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. వైద్య పరీక్షల నివేదిక ప్రకారం బాలికపై లైంగికదాడి జరిగినట్లు భరోసా కేంద్రం అధికారులు తేల్చారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్లో సామూహిక లైంగిదాడి జరిగినట్లు చేర్చి దర్యాప్తు చేపడుతున్నారు. కాగా నిందితుల్లో ఓ ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలిక తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Recent Comments