హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం..!
మూడురోజులపాటు మోడీ, షాల మకాం..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానున్నట్లు తెలుస్తోంది. నగరంలోని హెచ్ఐసీసీలోని నోవాటెల్ హోటల్లో సమావేశాలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి బీఎల్ సంతోష్ హైదరాబాద్ రానున్నారు. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, ఇతర కేంద్రమంత్రులు, జాతీయస్థాయి ముఖ్యనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకాన్నట్లు సమాచారం. మూడు రోజులపాటు మోడీ, అమిత్‌షా తదితరులు ఇక్కడే ఉండే అవకాశం ఉంది. సుమారు 300 మంది ప్రముఖులు ఉండేలా నోవాటెల్ వద్ద బస ఏర్పాట్లను చేస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణకు తెలంగాణను వ్యూహాత్మకంగానే ఎంపిక చేసినట్లు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ నేతలు మాదాపూర్‌లోని హెచ్ఐసీసీని సందర్శించారు. ఈ సమావేశాల నిర్వహణ కోసం హైటెక్స్‌లోని హెచ్ఐసీసీతోపాటు మరికొన్ని హోటళ్లు, రిసార్ట్‌లను పరిశీలిస్తున్నారు.
Recent Comments