పేదలను ఆదాయ మార్గాలుగా చూస్తున్న ప్రభుత్వాలు
అంబానీ, అదానీల కోసమే నేటి ప్రభుత్వాలు
ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను కేవలం ఆదాయ మార్గాలుగానే చూస్తున్నాయని ఎంసీపీఐ(యూ) జాతీయ కార్యదర్శి మద్దికాయల అశోక్ అన్నారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలో ఎంసీపీఐ(యూ) మహాసభ నిర్వహించారు. నర్సంపేట పట్టణంలోని ఓంకార్ భవన్ నుంచి ప్రభాబండ్లతో కోలాటాలు, డప్పు వాద్యాలతో భారీ ర్యాలీ తీశారు. ద్వారకాపేట్ రోడ్ లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ.. నేటి ప్రభుత్వాలు పేదవారికి కనీస మౌలిక వసతులు కల్పించకుండా, వారికి కావాల్సిన పారిశ్రామిక వేత్తలకు లక్షలకోట్ల రూపాయల బ్యాంక్ అప్పులను మాఫీ చేస్తున్నాయని విమర్శించారు. స్వతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా పేదవాడు ఇంకా పేదవాడి గానే మిగిలిపోతున్నడన్నారు. ప్రభుత్వాల విధానాల వల్ల దో చుకునే వాడే దొర అన్న చందంగా మారిందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ రేట్లను 50 రూపాయల వరకు పెంచి కేవలం 9 రూపాయలు తగ్గించి ప్రజలకు సాయం చేశామని చెప్పుకునే స్థితిలో ఉన్నాయన్నారు. నేడు నిత్యావసర ధరలు రాకెట్ కన్నా వేగంగా పెరిగి కనీసం రెండుపూటలా తినడానికి తిండి దొరకని స్థితిలో రాష్ట్ర పరిస్థితి ఉందని విమర్శించారు. కష్టపడి వ్యవసాయం చేస్తే నేడు ఆ పంటకుడా అమ్ముకోలేని స్థితిలో రైతులు ఉన్నారన్నారు. గిట్టుబాటు ధర కాదు కనీసం మా పంట కొంటె చాలు అనే స్థితిలోకి రైతులను నేటి ప్రభుత్వాలు తీసుకొచ్చాయన్నారు. పేదలకు న్యాయం జరగాలన్నా, రైతులకు గిట్టుబాటు ధర రావాలన్న అది కేవలం వామపక్షాల వల్లే సాధ్యమన్నారు. చదువుకునే విద్యార్థులకు సమయానికి స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా చెల్లించలేని స్థితిలో ప్రభుత్వాలున్నా యని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా కళాకారుల పాటలు, సంస్మృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధానకార్యదర్శి జార్జి, గాదగోని రవి, కన్నం వెంకన్న, పెద్దరపు రమేష్,గిన్నె కుమారస్వామి, వంగాల రాఘసుధ, గడ్డం నాగార్జున, బాబురావు, జన్ను రమేష్, నాగేళ్ళు కొమురయ్య, మంద రవి, కనకం సంధ్య, ఘటికె మమత తదితరులు పాల్గొన్నారు.
Recent Comments