వాళ్లు ఇష్టంతో చేస్తున్నారు.. చర్యలొద్దు..
సెక్స్ వర్కర్ల జీవితాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
స్పాట్ వాయిస్, డెస్క్: దేశ అత్యున్నత న్యాయస్థానం సెక్స్ వర్కర్ల జీవితాల విషయంలో కీలక ఆదేశాలు వెల్లడించింది. ఇష్టంతో పనిచేసే సెక్స్ వర్కర్లపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, వారి పనుల్లో జోక్యం చేసుకోవద్దని సుప్రీం కోర్టు సూచించింది. అదే సమయంలో వారిని నేరస్తుల మాదిరిగా చూడొద్దని, సముచిత గౌరవం ఇవ్వాలని స్పష్టం చేసింది. 2011లో కోల్ కత్తాలో ఓ సెక్స్ వర్కర్ పై నమోదైన ఫిర్యాదుకు సంబంధించిన కేసును కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. న్యాయమూర్తి ఎల్ నాగేశ్వర రావు నేతృత్వంలో బీఆర్ గవాయ్, ఏఎస్ బోపన్న సభ్యులుగాగల ధర్మాసనం ఈనెల 19వ తేదీన కేసులో కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా, కేసులో దర్బార్ మహిళా సమన్వయ కమిటీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అనంద్ గ్రోవర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు సెక్స్ వర్కర్ల విషయంలో ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ఇదే మొదటిసారన్నారు. సెక్స్ వర్కర్లతోపాటు సమాజానికే ఇదో మంచి మేసేజ్ అని, ఇక నుంచి వారిని నేరస్తులుగా కాకుండా గౌరవంగా చూడాలనే విషయాన్ని అంతా తెలుసుకోవాలన్నారు. ఇప్పుడు రైడ్లలో సెక్స్ వర్కర్లు పట్టిబడితే, ఇష్టపూర్వకంగానే వారు ఆ పనికి సిద్ధమైతే, పోలీసులు అరెస్టు చేయడానికి వీల్లేదని ఆయన వివరించారు. వేశ్యా గృహాలపై దాడులకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని, అక్కడ మహిళలను అరెస్టు చేయడానికి వీల్లేదని ఎందుకంటే వారు నేరస్తులు కాదని ఆనంద్ పేర్కొన్నారు. కానీ ఈ తీర్పులో ఓ కీలకమైన విషయాన్ని అంతా గుర్తు పెట్టుకోవాలని ఆయన సూచించారు. సెక్స్ వర్కర్లను నేరస్తులుగా పరిగణించొద్దని మాత్రమే కోర్టు చెప్పిందని, వారి పనిని మాత్రం వృత్తిగా గుర్తించలేదని ఆయన వివరించారు.
Recent Comments