మళ్లీ మకిలీ..
ఎమ్మెల్యే చల్లా ఇలాఖాలో లొల్లి
కన్నీరు పెట్టుకున్న ఆడబిడ్డ
దళితబిడ్డనవడం వల్లే చిన్నచూపని ఎంపీపీ ఆరోపణ
కనీసం లెక్కలోకి తీసుకోవడం లేదని ఆవేదన
తన సామాజికవర్గానికే పెద్ద పీట
గతంలోనూ ఇదే లొల్లి
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి క్యాంపు ఆఫీసు సాక్షిగా.. దళిత ఆడబిడ్డ కన్నీరుపెట్టుకుది. ప్రజాప్రతినిధి అనే కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ విలపించింది. తన సామాజిక వర్గానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులకు, పెద్ద పీట వేసి.. తమను దూరం పెడుతున్నారంటూ ఆరోపించారు. ఇప్పటికే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై దళిత ఉద్యోగులను తిట్టారనే మకిలీ ఉండనే ఉంది. దానికి తోడు ఆత్మకూరు మండలంలోని ఓ ఆడబిడ్డ పెట్టిన అట్రాసిటి కేసు విత్ డ్రా చేయించడంలో బెదిరింపులకు గురి చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో రైతు రచ్చబండకు వచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సభకు ముఖంగా ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. అది జరిగిన నాలుగు రోజులకే.. పరకాల నియోజకవర్గ కేంద్రంలో పరకాల ఎంపీపీ స్వర్ణలత కన్నీరుపెట్టుకుంది. తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తూ.. కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. దళిత బంధు ఎంపికలో ప్రస్తుత ప్రజాప్రతినిధులను వదలి, మాజీలకు బాధ్యతలు ఇచ్చారంటూ కన్నీరు పెడుతున్న వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
స్పాట్ వాయిస్, పరకాల: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నియోజకవర్గం మళ్లీ వార్తల్లో నిలిచింది. సొంత పార్టీ ప్రజాప్రతినిధి, దళిత ఆడబిడ్డ.. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ఎదుట విలపించడం..సర్వత్రా చర్చగా మారింది. దళితబిడ్డను కావడం వల్లే తనపై చిన్నచూపు చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దళితబంధు ఎంపికలో దళిత ప్రజాప్రతినిధినైన తనను లెక్కలోకి తీసుకోవడం లేదని, లబ్ధిదారుల ఎంపికలో తనకు కనీస గుర్తింపు లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దళితబంధు అర్హుల ఎంపికలో మాజీ ప్రజాప్రతినిధులకే పెద్ద పీట వేస్తున్నారని, తమను గుర్తించడం లేదన్నారు. పరకాల నియోజకవర్గంలో ఆదివారం దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక చేపట్టారు. ఈ విషయంలో తనకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. మాజీ ప్రజాప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి, సమ్మిరెడ్డిలు చెప్పిన వారికి దళితబంధు కేటాయించారని, వాళ్లకు నచ్చిన వారికే ఇచ్చారంటూ కన్నీరు పెట్టుకుంటూ క్యాంపు ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. మాజీ ప్రజాప్రతినిధులనే లెక్కలోకి తీసుకుంటే తమ పరిస్థితి ఎంటని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే గతంలోనూ ప్రోటోకాల్ రగడ వచ్చింది. తనను పట్టించుకోవడం లేదని, అధికార కార్యక్రమాలపై తనకు సమాచారం ఇవ్వడం లేదంటూ మీడియా సమావేశంలో వాపోయింది.
వివాదాల్లో ఎమ్మెల్యే చల్లా..
చల్లా ధర్మారెడ్డి తరుచూ వివాదాల్లో ఇరుకుంటున్నారు. గతంలో దళిత ఉద్యోగులను అవమానించేలా మాట్లాడారంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అలాగే ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన ఓ దళిత మహిళను బెదిరించి ఎస్సీ అట్రాసిటీ కేసు విత్ డ్రా చేయించారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఇటీవల రైతు రచ్చబండకు వచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చల్లా ధర్మారెడ్డిని సభ పై నుంచి హెచ్చరించారు. దళిత వ్యతిరేక విధానాలకు పాల్పడితే ఖబడ్దార్ అని, వారి ఆగ్రహానికి గురైతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇలా వరుస ఘటనలతో ఎమ్మెల్యే దళితుల ఆగ్రహానికి గురవుతున్నారు. కాగా ఎమ్మెల్యే తీరుపై దళిత సంఘాలతో పాటు ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు.
Recent Comments