రండి బాబూ రండి..
కండువా కప్పుకో.. క్యాష్ పట్టుకో..
‘లోకల్’ లెవల్లో జోరుగా బేరాలు..
నాయకుడి స్థాయిని బట్టి రేటు…
ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర..
అన్ని నియోజకవర్గాల్లోనూ అధికారపార్టీది అదే తీరు..
వింటే ఒకే.., లేదంటే షాకే. నయాన్నో.., భయాన్నో.., ఎలాగైనా సరే. లొంగదీసుకోవడం మాత్రం పక్కా. ఒక్కొక్కరుగా వచ్చి చేరితే అనుకున్న సమయానికి ఎటూ కదలకుండా అంతా చేతిలోనే ఉంటారనే ఫీలింగ్. రాజ్యం గులాబీ సైన్యాన్ని పెంచుకునే యుద్ధ తంత్రంలో దూసుకెళ్తోంది. వార్డు సభ్యుడు మొదలు సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ.. ఇలా స్థాయిని రేటు.., హోదాను బట్టి ముడుపు. ఎలాగైనా సరే ప్రత్యర్థి రావాలి.., పార్టీలో చేరాలి. కండువా కప్పుకోవాలి. అంతే.. ఎన్నికలకు ఇంకా సమయమున్నా ఇప్పటి నుంచే వ్యవహారాలు చక్కబెట్టుకునే ప్రయత్నాలను అధికార టీఆర్ ఎస్ పార్టీ ముమ్మరం చేసింది. గ్రామస్థాయిల్లో ప్రస్తుతం జోరుగా ఈ బేరాలే సాగుతున్నాయి. చోటామోటా నాయకుడిని కూడా వదిలేది లేదన్నట్టుగా అందరినీ కలవడం, మనోడు అనిపించుకోవడం నిత్యకృత్యమైంది.
స్పాట్ వాయిస్, హన్మకొండ: రండి బాబూ రండి.. ఆలసించిన ఆశాభంగం. మంచి తరుణం మించినా దొరకదు. రావాలే.. రావాలే.. అవకాశాన్ని అందిపుచ్చుకోవాలే.. ఇప్పుడు నడుస్తున్న రాజకీయ ట్రెండ్ ఇదంతా. టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు ఆఫర్లు ప్రకటిస్తోంది. పనులు చేయాలన్నా.., అవసరాలు తీర్చుకోవాలన్నా నిధులు తప్పనిసరి. శత్రువుగా ఉండి కొట్లాడడం కంటే మిత్రుడిగా మారి మమ అనిపించుకుంటూ నాలుగు రాళ్లు వెనకేసుకోవడమే మంచిదనే ధోరణి క్రియేట్ అవుతోంది.
కండువా కప్పుకో.. క్యాష్ పట్టుకో…
గులాబీ కండువా కప్పుకుంటే ఎంతో కొంత ముట్టజెప్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వార్డు సభ్యుడికి ఒక రేటు.., అందునా కాస్త ప్రభావితం చేసే వ్యక్తి, జనాలతో తిరిగే, అతడు చెబితే జనాలు అనుసరిస్తారు అనుకున్న నేతలకు మరో రేటు ఫిక్స్ చేస్తున్నారు. మంచివారేగానీ, మరెవరన్నా గానీ అంతా మన పంచన చేరితే అంతకన్నా ఏం కావాలనే రీతిలో వ్యూహాలు నెరుపుతున్నారు.
జోరుగా గులాబీ బేరాలు..
పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో ప్రస్తుతం పార్టీల్లో చేరికలు జోరుగా సాగుతున్నాయి. త్వరలో ఎన్నికలు రానున్నాయి. ఇతర పార్టీలు కూడా కొద్దికొద్దిగా పుంజుకుంటున్నాయి. క్షేత్రస్థాయిలో అధికార పార్టీని మరింత బలంగా చేయాల్సిన అవసరం తప్పని సరైంది. దీంతో గ్రామస్థాయిలో వార్డు మెంబర్ల నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామసభ్యుడి స్థాయిని బట్టి బేరాలు జరుగుతున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ ఇలా హోదాలను బట్టి రేట్లు డిసైడ్ చేస్తున్నారు. రూ.పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఇవ్వడానికి ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తున్నారు. చేరిన వాళ్లు చేరుతారు.., చేరని వాళ్లు స్తబ్దుగా ఉంటారుగా అనే రీతిలో వ్యూహరచన జరుగుతోంది. ఎవరు వచ్చినా రాకపోయినా చేసేదేమీ ఉండదుగానీ, వచ్చిన వారు బాగుపడుతుంటే రాని వారికి మాత్రం భరించేంత ఉండాలి కదా. ఈ దిశగా అందరు పునరాలోచనలో పడేలా బేరసారాలు జగుతున్నాయి. పైగా, గులాబీ కండువా కప్పుకుంటే మంచిది. ఒకవేళ కప్పుకోవడానికి భీష్మించినా పోయేదేమీ ఉండదనే ధీమా. ఎలాగంటే తనతోటి వారు వెళ్లి ఎందరో కొందరు వెళ్లి కారెక్కుతారు కాబట్టి ఇక మనం వ్యతిరేక మార్గంలో పోవడం ఎందుకులే అనే డైలమాలో ఎక్కడివారక్కడ ఆగిపోవడానికి కూడా ఈ స్ర్టాటజీ ఉపయోగపడుతుందనేది మరో కోణం.
బలహీనానికే..
ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టేందుకు గులాబీ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎన్నికల సమయానికి పార్టీలో నూతనోత్తేజాన్ని తీసుకురావడానికి పావులు కదుపుతున్నారు. ప్రతిపక్షంలో ఉంటూ ఇబ్బంది పెట్టకుండా అందరినీ కలుపుకుని పోతే అంతకన్నా ఏం కావాల్సి ఉంటుందనే ఆలోచన జరుపుతున్నారు. గులాబీ పార్టీలో చేరుతాం.. అనే వారికి అయితే దళితబంధు బెనిఫిట్స్, లేదంటే డబుల్ బెడ్రూం ఇల్లు, అంతకూ ఇంకా కావాల్సి వస్తే మరింత నగదు ముడుపులు కూడా ఇవ్వడానికి వెనకాడని పరిస్థితి. రాష్ట్రం మొత్తంగా ఇప్పుడు చూస్తున్నవి దళితబంధు, డబుల్ బెడ్రూం ఇళ్ల వైపే. వాటినే స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులకు ఎరగా వేస్తే పాచిక ఇట్టే పారుతుందనే ధోరణి కనిపిస్తున్నది. వార్డు మెంబర్లకు ఇంకా డబుల్ బెడ్రూం ఇళ్ల స్కోప్ ఎక్కువ, అవసరం కూడా అధికంగా ఉండడంతో వారికి ఇది మంచి అవకాశంగా వదులుతున్నారు.
Recent Comments