సహచరులు బెదిరించారని.. వ్యక్తి ఆత్మహత్య
బస్వరాజుపల్లిలో వెలుగు చూసిన ఘటన
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐ పులి వెంకట్
స్పాట్ వాయిస్, గణపురం : గుప్తనిధుల తవ్వకాల గొడవకు సంబంధించి సహచరులు బెదిరించారని అని ఓ వ్యక్తి ప్రాణాన్ని తీసుకుని.. కుటుంబాన్ని రోడ్డున పడేశాడు. ఒకే గ్రామంలో ఉంటున్న వారు గొడవల్లో అనరాని మాటలు అనడంతో పాటు బెదిరించారని.. ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బస్వరాజుపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు, చిట్యాల సీఐ పులి వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం.. బస్వరాజుపల్లి గ్రామానికి చెందిన చెరుకు రవి (45) కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులతో కలిసి గుప్త నిధుల తవ్వకాలు చేస్తుండేవారు. ఈ క్రమంలో వారంతా కలిసి వివిధ ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. కాగా, ఎంత ప్రయత్నం చేసినా గుప్త నిధులు దొరకకపోవడంతో సహచర వ్యక్తులు రవిని నీ వల్లే గుప్త నిధులు దొరకడం లేదని అవమానించేవారు. అయితే ఈ మధ్య రవిని బెదిరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన రవి శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108లో ఎంజీఎం హాస్పిటల్ కు తరలించగా, చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య చెరుకు రమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పులి వెంకట్ తెలిపారు. కాగా, ఇటీవల గ్రామ శివారులోని ఇటికాలపల్లి చెరువు కట్ట వద్ద వీరంతా తవ్వకాలు జరపగా నిధులు బయటపడినట్లు తెలుస్తోంది. అయితే తవ్వకాలు జరిపిన ప్రదేశంలో చెరుకు రవి నుంచి ఇంజక్షన్ ద్వారా రక్తాన్ని సేకరించి ఆ ప్రదేశంలో చల్లి, పూజలు చేసినట్లు, అప్పటి నుంచి రవి మానసిక ప్రవర్తనలో మార్పు కనబడినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ తవ్వకాల్లో కొందరు ప్రజాప్రతినిధులతో పాటు మరికొంతమంది ఉన్నట్లు సమాచారం.
Recent Comments