Monday, November 25, 2024
Homeక్రైమ్అల్లుడే చంపాడు..

అల్లుడే చంపాడు..

వీడిన జంట హత్యల మిస్టరీ
స్పాట్ వాయిస్, మల్హర్(మంథిని): అల్లుడే అత్తమామలనే కడతేర్చాడు. కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలన్నందుకు అంతమొందించాడు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం పుట్టపాక గ్రామ పరిధిలోని చల్లపల్లిలో రెండు రోజుల క్రితం జరిగిన జంట హత్య కేసును పోలీసులు ఛేదించారు. అల్లుడే నిందితుడని గుర్తించి అరెస్ట్​ చేశారు. కొత్త సాంబయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. ఇద్దరు కూతుళ్లకు వివాహం కాగా.. కుమారుడు తల్లిదండ్రులతో పాటే ఉంటున్నాడు. చిన్న కూతురు వసంతను.. వెంకటాపూర్‌కు చెందిన పెంట శ్రీనివాస్​తో వివాహం చేశారు. పెళ్లి జరిగి పదేళ్లు అవుతుండగా.. వసంత, శ్రీనివాస్​దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబంతో పాటు హైదరాబాద్​లోనే ఉంటోన్న శ్రీనివాస్​.. ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండేవాడు. కొంతకాలం నుంచి శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఉద్యోగానికి వెళ్లడం బంద్ చేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. పంచాయితీలు పెట్టి శ్రీనివాస్​ను మందలించారు. అయినా.. అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈనెల 10న మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అదే విషయమై.. వసంత తమ్ముడు వచ్చి శ్రీనివాస్​ను నిలదీయటంతో కోపంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో వసంత తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పంచాయితీలు పెట్టి తన పరువు తీసినందుకు అత్తామామలపై ఎప్పటి నుంచో కోపం పెంచుకున్న శ్రీనివాస్ అందరూ తనను మందలించడానికి కారణం వాళ్లేనని భావించి అదే రోజు రాత్రి హైదరాబాద్ నుంచి చల్లపల్లికి చేరుకున్నాడు. అత్తమామలపై రోకలిబండతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఇంట్లోని 20 వేల నగదు తీసుకున్నాడు. హత్యకు వాడిన రోకలిబండను పక్కనే ఉన్న బావిలో పడవేసి.. తన స్వగ్రామమైన వెంకటాపూర్​కు వెళ్లాడు. విచారణ వేగవంతం చేసిన పోలీసులు శ్రీనివాస్ కనిపించకపోవటంతో అనుమానం వ్యక్తం చేశారు. సెల్​ఫోన్​ సిగ్నల్స్​ ద్వారా అతడి ఆచూకీ కనుక్కున్నారు. శుక్రవారం ఉదయం శ్రీనివాస్​ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య నేరాన్ని ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments