Sunday, November 24, 2024
Homeటాప్ స్టోరీస్రద్దా..! హోల్డా..?

రద్దా..! హోల్డా..?

ల్యాండ్ పూలింగ్ పై క్లారిటీ ఏదీ..?
ఎవరు చెప్పేది నిజం..
ఆందోళనలో బాధిత రైతులు
స్పాట్ వాయిస్, హన్మకొండ: ఒకే విషయమై విరుద్ధ ప్రకటనలు.. అత్యంత కీలకమైన ఇష్యూపై క్లారిటీ లేని కంక్లూజన్. ఇద్దరు కీలక వ్యక్తుల మధ్య అంతరాలను చూపించడం చూపించకపోవడం దేవుడెరుగుగానీ, బాధితులు మాత్రం ఎలా అర్థం చేసుకోవాలో తెలియని కన్ఫ్యూషన్ కు గురయ్యారు. ఆ ఇద్దరు ఎవరో కాదు.. కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, వైస్ చైర్మన్ ప్రావీణ్య. వారం రోజులుగా తీవ్ర రూపం దాల్చిన ల్యాండ్ పూలింగ్ ఆందోళనకు యంత్రాంగం కదిలింది. బాధిత రైతుల నుంచి తాకుతున్న సెగకు తట్టుకోలేక బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశం అయ్యారు. తీవ్రంగా సమీక్షించారు. ఒకరికొకరు అభిప్రాయాలను సీరియస్ గా షేర్ చేసుకున్నారు. భూసేకరణపై వాస్తవ పరిస్థితులను, ప్రజల నుంచి వస్తున్న నిరసనలను దీర్ఘంగా చర్చించారు. అంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు.
ఇది ఒక కోణం .. ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది.
సమావేశ మందిరం నుంచి బయటకు రాగానే ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఎవరి దారిలో వారు వెళ్లారు. కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తన చాంబర్ లో మీడియాతో మాట్లాడారు. కుండ బద్ధలు కొట్టినట్టుగా ల్యాండ్ పూలింగ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, ఆయన ఉండగా అన్నదాతలకు ఇసుమంత కూడా నష్టం కలిగించడని ప్రకటించారు. అంతా సంతోషం వెలిబుచ్చారు. దీనిపై కొద్ది సేపట్లోనే వైస్ చైర్మన్ ప్రావీణ్య ప్రకటన విడుదల చేస్తారని కూడా చెప్పారు. సరిగ్గా అంతా ఆమె ప్రకటన కోసం లక్ష కళ్లతో చూస్తుండగా, అసలు విషయం అప్పుడు బయటకు వచ్చింది. కమిషనర్ విడుదల చేసిన ప్రకటనలో సావు కబురు చల్లగా చెప్పినట్టు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అనే కాలంతో అందరిని అయోమయంలో పడేశారు. అనుకున్నదే జరిగింది అని బాధితులంతా లబోదిబోమన్నారు. ప్రభుత్వం రద్దు అనే స్పష్టమైన ప్రకటన విడుదల చేసే వరకు ఆందోళనలు విరమించేది లేదని ప్రకటించారు. ఇద్దరు ప్రముఖ వ్యక్తుల పరస్పర ప్రకటనలతో అయోమయానికి గురిచేయడం సరికాదని, అంతా అనుకూలమైన నిర్ణయం తీసుకునప్పుడు ఒకే అభిప్రాయాన్ని ప్రజల ముందుంచాలని పలువురు పేర్కొన్నారు. ఎంతైనా కుడానా.. మజాకానా..? వారి మార్క్ ఎంటో మరోమారు నిరూపించుకున్నారని కొందరు మొహం మీదే పేర్కొనడం కొసమెరుపు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments