Monday, November 25, 2024
Homeలేటెస్ట్ న్యూస్జస్ట్ ఫర్ చేంజ్.. జరిగింది పెళ్లి.. మళ్లీమళ్లీ

జస్ట్ ఫర్ చేంజ్.. జరిగింది పెళ్లి.. మళ్లీమళ్లీ

వరుసలు తారుమారు..
అక్కకు మరిదితో.. చెల్లికి బావతో…
కొంపముంచిన పవర్ కట్..
ఇద్దరికి మళ్లీ పెళ్లి..

స్పాట్ వాయిస్, డెస్క్: వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు. ఇద్దరికీ ఒకే ముహూర్తానికి ఒకే మండపంలో పెళ్లి చేస్తే భారం తీరుతుందని నిర్ణయించుకున్న తల్లిదండ్రులకు అనుకున్నట్టుగానే కలిసొచ్చింది. ఇద్దరికి సంబంధాలు కుదిరాయి. ఒకే ముహూర్తం పెట్టుకున్నారు. ఫంక్షన్ హాల్ కూడా మాట్లాడుకున్నారు. పెళ్లికి అంతా రెడీ అయింది. తాళి కట్టడానికి కొద్ది నిమిషాల ముందు కరెంట్ పోయింది. అయినా ముహూర్తానికి పెళ్లి తంతు జరిపించాల్సిందే అనుకున్న పెద్దలు ఆ దిశగా పంతుళ్లను తొందరపెట్టారు. మసక వెలుతురులోనే కార్యక్రమం ముగిసింది. అప్పగింతల తర్వాత ఎవరి అత్తారిళ్లకు వారు వెళ్లిన తర్వాత అసలు విషయం బయటపడి అంతా షాక్ అయ్యారు. పెళ్లికూతుళ్లు మారిపోయారని తెలిసి పంచాయితీ పెట్టారు. వివరాలివి.. మధ్యప్రదేశ్‌ ఉజ్జయిన్‌కు చెందిన రమేశ్ లాల్కు నికిత, కరిష్మా అనే ఇద్దరు కూతుళ్లు. ఇద్దరికీ ఒకేసారి పెళ్లికి నిర్ణయించి, వేర్వేరు కుటుంబాలకు చెందిన దంగ్వారా భోలా, గణేశ్ అనే యువకులతో సంబంధం కుదుర్చుకున్నాడు. పెళ్లి కూతుళ్లుగా ముస్తాబైన అక్కాచెల్లెళ్లు ముఖాన్ని తెరతో కప్పుకుని మండపానికి రాగా, కొద్ది సేపట్లోనే కరెంటు పోవడంతో పెళ్లికొడుకులు తారుమారయ్యారు. అక్కను చేసుకోవాల్సిన వరుడు చెల్లిని, చెల్లెల్ని చేసుకోవాల్సిన పెళ్లికొడుకు అక్క మెడలో మూడు ముళ్లు వేశారు. అప్పగింతల అనంతరం వధువులిద్దరూ అత్తారింటికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత తెర తీయడంతో అసలు విషయం బయటపడింది. పెళ్లి కూతుళ్లు మారిపోయారని తెలుసుకున్న వరుడి తరఫున వారు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. పెద్ద మనుషులను పిలిచి పంచాయితీ పెట్టారు. చివరకు మూడు కుటుంబాలు ఒక అంగీకారానికి వచ్చి ముందుగా అనుకున్న ప్రకారం మళ్లీ పెళ్లి జరిపించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments