ఆయనే మంత్రా.., ఈయన కాదా..?
యువరాజుకు అగ్రతాంబులం.. బావకు అవమానం..
వచ్చారా.. వెళ్లారా.. అన్నట్టుగానే ఆరోగ్యమంత్రి పర్యటన..
అయ్యో హరీశయ్యా… అంటూ జిల్లావాసుల నిట్టూర్పు..
స్పాట్ వాయిస్, హన్మకొండ : ఇరవై రోజుల వ్యవధిలో యువరాజు రెండు సార్లు వచ్చారు. అందునా మొదటిసారి వచ్చినప్పుడైతే నగరమంతా ఒకటే హడావుడి. ఎక్కడ లేనన్ని కొత్తకొత్త గులాబీ తలకాయలు బయటకొచ్చాయి. ఎలాగైనా సరే రామన్న దృష్టిలో పడాలని నానా యాగి. కొందరు పెద్దలైతే మరీ శృతిమించిన పోకడలకు పోయి ఒకరిని మించి ఒకరు ఫ్లెక్సీలు కట్టి జరిమానాలు విధించుకుని నవ్వులపాలైన దాఖలాలు. ఎలాగైతేనేం రాజావారి దృష్టిలో పడ్డాం లే అనే ఆత్మసంతృప్తి పొందిన గురుతులు. పొద్దంతా ఆయన ఎటూ పోతే అటే. చెమటలు కక్కే ఎండను సైతం లెక్కచేయక పోటాపోటీగా కార్యక్రమాల్లో కనిపించేందుకు పడిన తాపత్రయం. కేటీఆర్ పాల్గొన్న ప్రతి చోటా గుక్కతిప్పుకోనివ్వనంత సందడి. ఒక్క మాటలో చెప్పాలంటే త్రినగరికి పెద్ద గులాబీ రంగు డబ్బా పెట్టుకుని బ్రెష్ తో రంగేసినట్టు అనిపించిన ఫీలింగ్. అదే ఇవ్వాళ్టి రోజున అతి కీలకమైన మంత్రి హరీశయ్యా నగరానికి వచ్చారు. పాపం భూపాలపల్లి, వరంగల్ జిల్లాల్లో పర్యటించారు. వేల కోట్లతో చేపట్టబోయే పనులకు శంకుస్థాపన చేశారు. వచ్చేది వానాకాలం జాగ్రత్తగా ఉండాలని, పేదల ఆరోగ్యమే మనకు సౌభాగ్యమనే స్థాయిలో ఉపదేశించడానికి మీటింగ్ కూడా పెట్టారు. కానీ ఏం లాభం. ఆయన వచ్చారన్న హడావుడి ఏ కోశన కూడా కనిపించలేదు. ఏదో సాదాసీదా నాయకుడి మాదిరిగా ఆయనంతట ఆయన వచ్చారా.. పోయారా అన్నట్టుగా సాగింది హరీశయ్య పర్యటన. ఎక్కడా అంతగా ఆకట్టుకునే ఫ్లెక్సీలు లేవు., స్వాగతాలు పలికే మహిళల గుంపు అంతకన్నా లేదు. కాకపోతే కొద్దిలో కొద్ది మంది ప్రధాన నాయకులు మాత్రం ఒకటి రెండు పూలబొకేలు ఆయన చేతికందించి మమ అనిపించారు. మంత్రి హరీశ్ కు ఏమిటి ఈ పరిస్థితి అని ‘ఆ గుంపు’లోని కొందరే అనుకోవడం కనిపించింది. ఎంతైనా యువరాజు యువరాజే కదా…!
Recent Comments