ఉరుములు.. మెరుపులు
ఈదురుగాలుల బీభత్సం..
అకాల వర్షంతో ఆగమైన రైతులు..
స్పాట్ వాయిస్, నెట్ వర్క్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లు తడిసి ముద్దయ్యాయి. అకాల వర్షానికి వరి ధాన్యం తడవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలే అంతంత గానే కాసిన మామిడి నేల రాలిపోయింది. కాగా, కొన్నిరోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న నగర ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించినట్లైంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కరీంనగర్, నల్లగొండ జిల్లాలో..
ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిసాయి.
హైదరాబాద్ ఆగమాగం..
బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షం తో.. హైదరాబాద్ నగరం ఆగమైంది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో నగర రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి.
Recent Comments