మన్యంలో.. మట్టి దందా..!
అధికారులొస్తున్నారని అక్రమార్కులు పరార్
వాజేడు మండలంలో అర్ధరాత్రి యథేచ్ఛగా తవ్వకాలు.. తరలింపు
స్పాట్ వాయిస్, వాజేడు: అధికారులు ఎన్ని సార్లు దాడులు చేసినా, కేసులు నమోదు చేసినా మట్టి అక్రమ తరలింపు ఆగడం లేదు. దందా విషయం తెలుసుకున్న అధికారులు, సిబ్బంది కార్యాలయం నుంచి బయలుదేరి ఘటనా స్థలానికి చేరుకునేలోగా సమాచారం అందుకున్న అక్రమార్కులు మట్టి తవ్వకాలకు ఉపయోగించే జేసీబీలు, లారీలు, ట్రిప్పుర్లును అక్కడ నుంచి తరలిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరగాల్సిన పరిస్థితి. అయితే అంతటితో ఊరుకోకకుండా మరుసటి రోజు యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి మండల కేంద్రంలోని చింతూరు పంచాయతీలో సొసైటీ ఇసుక రీచ్లకు, రోడ్డు నిర్మాణం కోసం ఎర్రని మట్టి (గ్రావెల్) నిక్షేపాలు ఉండడంతో ఇక్కడ క్వారీ తవ్వకాలు జరుపుతున్నారు. గ్రామాల్లో అర్ధరాత్రివేళ మట్టితో తరలిస్తున్నారు. ఇదేంటి అని అడిగితే మాకు అన్ని అనుమతులు ఉన్నాయని బెదిరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. అక్రమార్కులకు నాయకుల అండదండలు ఉండడంతో అధికారులు చర్యలు తీసుకోకపోగా తలలు పట్టుకుంటున్నారనే ఆరోపణలున్నాయి..
ఫిర్యాదు వస్తే వెంటనే దాడులు చేస్తున్నాం..
తహసీల్దార్ సర్వర్ పాషా
మండలంలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఎవరి నుంచైనా ఫిర్యాదు వస్తే వెంటనే స్పందిస్తున్నాం.. తమ సిబ్బందితో కలిసి వెంటనే దాడులు చేస్తున్నాం. ఎవరైనా సరే మట్టి తరలించడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అక్రమంగా ఎవరైనా మట్టి తవ్వకాలు చేపట్టి, తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
Recent Comments