నిందలతో ఆధారాలు మారుతాయా..?
సొసైటీలో అన్యాయం జరిగిందని న్యాయవాదుల ఆరోపణ..
చీఫ్ విప్ పై గుడిమల్ల చిందులెందుకని అభిమానుల ఆవేదన..
చట్టామే అన్నీ తేలుస్తుందని హితబోధ..
నిందలతో నిజాలు ఆగవు.., మాటలతో కళ్ల ముందు సాక్ష్యాలు దాగవు. వ్యవస్థలో ప్రతీది సమయం వచ్చినప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలిచి, సమాధానం చెప్పే వరకూ విశ్రమించదు. మంచిగున్నప్పుడు అంతా మనమే అనుకుని, చెడే సమయం వచ్చినప్పుడు ‘మొత్తం మీరే…’ అనే ప్రచారం ఆ పూటకు బాగుండొచ్చుగానీ, కాలం నిర్వహించే పరీక్షల్లో సమాధానం దొరకని క్లిష్ట పరిస్థితిని కల్పించి తీరుతుంది. అయినా, అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే నిజమవుతుందనేది ఎంత భ్రమో.., కప్పి పుచ్చితే నిజం కనుమరుగవుతుంది అనుకోవడం కూడా అంతకు మించిన అమాయకత్వం. సొంత వ్యవహారాలను, రాజకీయ సంబంధాలకు ముడిపెడితే న్యాయం దాగుతుందా..? గతానికి వర్తమానాన్ని అంటగడితే భవిష్యత్తు గందరగోళం అవుతుందనేది జగమెరిగిన సత్యమే కదా..
-స్పాట్ వాయిస్, ఓరుగల్లు
తప్పు తేలితే.. పగొడిపై నెట్టేయడం.. మంచి జరిగితే నేనే చేశానని కాలర్ ఎగరేయడం నేటి రోజుల్లో కామన్ అయింది. ఆరోపిస్తే.. పోయేదిముంది.. నాలుగు మాటలే కదా అవతలి వ్యక్తి ఏమైపోతే నాకేంటి అనుకునే మనుషులున్నా రోజులవి. సరిగ్గా చీఫ్ వినయ్ భాస్కర్ గుడిమల్ల రవికుమార్ మధ్య జరిగిన అంశం కూడా ఇదే. అవినీతి ఆయనది.. అక్రమం ఆయనది. తప్పూ ఆయనదే. కానీ నింద మోసేది మాత్రం చీఫ్ విప్. న్యాయవాదుల ప్లాట్ల అంశానికి.. చీఫ్ విప్ దాస్యానికి ఆపాదించడంపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కాలంలో జరిగిన అక్రమాలపై పోలీసులు అరెస్ట్ చేస్తే వినయ్ భాస్కర్ కుట్ర అనడం ఎంతవరకు కరెక్ట్ అని ఆపార్టీ నాయకులు నిలదీస్తున్నారు.
అసలేం జరిగిందంటే
2014-15లో రవికుమార్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, సూరం నరసింహస్వామి ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. వీరి హయాంలో న్యాయవాదుల కోసం హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది న్యాయవాదులను సభ్యులుగా చేర్చుకొని సభ్యత్వ రుసుంగా రూ.10వేలు వసూలు చేశారు. ఆ తర్వాత గజం రూ.1200 చొప్పున న్యాయవాదుల నుంచి దశలవారీగా డబ్బులు వసూలు చేసి, ఆ డబ్బుతో మడికొండ శివారులో 32 ఎకరాల 20 గుంటల భూమి కొనుగోలు చేశారు. అనంతరం ప్లాట్లు చేసి ఒక్కొక్కరికి 300 గజాల చొప్పున లాటరీ పద్ధతిలో కేటాయించి రిజిస్ట్రేషన్ చేశారు. అయితే కొందరు న్యాయవాదులకు ప్లాట్లు దక్కలేదు. దీంతో వారు 2021 జనవరి 20న న్యాయవాదుల సొసైటీ భూములను దుర్వినియోగం చేశారంటూ గుడిమల్ల రవికుమార్, నరసింహస్వామిపై సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్లాట్లు ఇస్తామని చెప్పి డబ్బులు వసూల్ చేసి ఇప్పుడు దాటేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు గుడిమల్ల రవికుమార్ ను అరెస్ట్ చేశారు.
ప్లాట్లకు దాస్యంకేం సంబంధం..
పశ్చిమ ఎమ్మెల్యే, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కు న్యాయ వాదులకు ఫ్లాంట్లకు సంబంధమే లేదు. అలాగే కేసు వేసింది న్యాయవాదులే. దీనివల్ల వినయ్ భాస్కర్ కు ఓరిగేది ఏమీ లేదు. అయితే ఆయనపై కేసు నమోదు చేయించింది.. అరెస్ట్ చేయించింది వినయ్ భాస్కర్ అంటూ గుడిమల్ల ఆరోపించారు. రవికుమార్ చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యనేతలు వస్తే మినహా ఆయన టీఆర్‌ఎస్ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఈక్రమంలో అధిష్టానం దృష్టిలో దాస్యంకు చెడ్డపేరు తీసుకురావాలనే కుటిల ఆలోచనలు చేస్తున్నారని ఆ పార్టీ శ్రేణులే ఆరోపిస్తున్నారు.
న్యాయవాదుల మండిపాటు..
గుడిమల్ల రవికుమార్ చీఫ్ విప్ దాస్యంపై చేసిన ఆరోపణలపై న్యాయవాదులు మండిపడుతున్నారు. లాయర్లకు కాస్ట్ టు కాస్ట్ బేస్ లో ఎలాంటి లాభం లేకుండా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పి దాదాపు రూ. 15 కోట్ల వరకు వసూలు చేశారని న్యాయవాదులు చెబుతున్నారు. భూమి కొనుగోలు ధర సభ్యులకు తెలువకుండా గజాల లెక్కన కోట్లు గడించి ఇప్పటి వరకు సొసైటీ ఆడిట్ చూపలేదన్నారు. డాక్యుమెంట్ లెక్కులు, సొసైటీ రిజిస్ర్టార్ ఇవ్వకుండా అవనీతికి పాల్పడితే పోలీసులు విచారణ చేసి అరెస్ట్ చేశారనే కానీ చీఫ్ విప్ ప్రమేయం ఏమీ లేదన్నారు. న్యాయవాదుల అంశంలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, గుడిమల్ల కేసు నుంచి బయటపడేందుకు దాస్యంపై బట్టకాల్చి మీద వేస్తున్నారని వారు మండిపడుతున్నారు. ప్రజల్లో సానుభూతి పొందడానికి చిల్లర ఎత్తుగడ వేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో తోడునీడగా..
హన్మకొండలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్, గుడిమల్ల రవికుమార్ తోడునీడగా ఉండేవారు. దాస్యం ఎమ్మెల్యేగా ఉన్నకాలంలో గుడిమల్ల రవికుమార్ ఏ పని చేసినా వెంట నడిచేవారు. తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్‌ను స్థాపించిన సమయంలో వెన్నంటి ఉన్నారు. ఎంతో మంది ఆటో డ్రైవర్లకు, వారి పిల్లలకు గుడిమల్ల సూచనల మేరకు సాయం చేశారు. ట్రాఫిక్ పోలీసులతో ఎదురయ్యే ఇబ్బందులను పోలీసులతో మాట్లాడి పరిష్కరించారు.
పదవి కోసమేనా..?
గుడిమల్ల రవికుమార్ చీఫ్ విప్ దాస్యంపై ఆరోపణలు చేయడంపై టీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తనకు పదవులు రావడం లేదని ప్రస్టేషన్ లోనే ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఉద్యమ నేత పార్టీ కోసం పని చేసే వారికి అవకాశం వచ్చినప్పుడల్లా పదవులు కట్టబెడుతున్నారు. గుడిమల్లకు సైతం సీఎం కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారు. అధినేత ఆజ్ఞ కోసం ఎదురుచూడకుండా పార్టీలో వేరుకుంపటి రాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని ఎందుకు కోల్పోయారో మీకు తెలియదా అని టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. స్వయం క్రుపారాదాన్ని ఇతరులపైకి నెట్టడం సరికాదన్నారు.
Recent Comments