కాంట్రవర్సీ ఎమ్మెల్యేలకు టికెట్లు కష్టమే..
అధిష్టానం చేతిలో పీకే సర్వే
తాజా సమీక్షలోనూ ఇదే అంశంపై చర్చ
వ్యతిరేకత ఉన్న వాళ్ల మార్పు అనివార్యం
కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ సూచన
ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల భవితవ్యంపై చర్చ
సిట్టింగులం.. అధినేతకు గులాంగా పనిచేస్తున్నాం.. మాకేంటి ఢోకా అనుకునే వారి సీటు ఇక చిరిగినట్టే. ‘పీకే’ ఏం ఉపదేశించాడోగానీ, కొందరి సీట్లకు కోత పడే ప్రమాద ఘంటికలు పొంచి ఉన్నాయనే సంకేతాలు వస్తున్నాయి. కాంట్రవర్సీకి తగిన మూల్యం చెల్లించుకునేందుకు వారంతా సిద్ధంగా ఉండాలనే హెచ్చరికలు వెలువడుతున్నాయి. పార్టీ ప్రయోజనాలే తప్ప వ్యక్తిగతమైన విషయాలకు పెద్దపీట వేసే ప్రసక్తే లేదనే సంకేతాలు అధినేత వివాదాస్పదులకు చేరవేసినట్టు సమాచారం. ప్రశాంత్ కిషోర్ సూచనలతో సీట్లు చిరుగనున్నాయి. ఉమ్మడి వరంగల్ లో మెజార్టీ స్థానాలకు భ్రంశం తప్పదనేది ఇప్పుడు హాట్ టాపిక్.
-స్పాట్ వాయిస్, ఓరుగల్లు
సిట్టింగ్ ఎమ్మెల్యే చైర్ వణుకుతోంది. అధినేత ఎప్పుడూ కుర్చీ లాగేస్తారోననే భయం నిద్రపట్టనివ్వడం లేదు. ప్రస్తుతం రాష్ర్టంలో రాజకీయం వేడివేడిగా ఉంది. గత రెండు ఎన్నికల్లో కనీస పోటీ ఇవ్వని కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు గులాబీ జెండాకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మాటకు మాట.., సవాల్ కు ప్రతి సవాల్ విసురుతున్నాయి. ప్రతీ అంశంపై నిలదీస్తున్నాయి. అధికార పార్టీని కడిగిపడేస్తు్న్నాయి. ఇన్నాళ్లు మాటల మాంత్రికులు కారులోనే ఉన్నారనుకుంటే మారిన రాజకీయ నేపథ్యంలో అన్ని పార్టీల్లోనూ ఎదురుదాడి చేసే నాయకులు తెరపైకి వచ్చారు. దీంతో గులాబీ అధినేత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మూడోసారి విజయాన్ని అందిపుచ్చుకోవడానికి బుర్రకు పదునుబెడుతున్నారు. ఎత్తులు వేస్తున్నారు. పోత్తులకై దారులు తీస్తున్నారు. గెలుపే లక్ష్యంగా చర్చలు జరుపుతున్నారు. ఇందుకోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేలపై ఫోకస్..
గులాబీ బాస్ తన నీడను తానే నమ్మరు. ఎప్పుడూ సర్వేలు చేయించుకుంటూ.. సొంతంగా ఆరా తీస్తూ పార్టీని నిలబెట్టేందుకు శ్రమిస్తుంటారు. అంతేకాకుండా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఆయనకు ఆయనే సాటి. మొదటిసారి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకే సీఎం కేసీఆర్ రెండోసారి టికెట్లు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే అప్పటికే ప్రతిపక్షాల్లో జీవం లేకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు బయటపడ్డారు. కానీ ఈసారి పరిస్థితులు మారాయి. ప్రతిపక్షాలు బలం పుంజుకున్నాయి. రెండుసార్లు పట్టం కట్టిన టీఆర్ఎస్ పై జనంలో వ్యతిరేకత మొదలైంది. ఓటర్లు మార్పు కోరుకుంటున్నారు. అంతేకాదు.. రెండు సార్లు పదవులు అనుభవించిన ఎమ్మెల్యేల్లో చాలా మంది కార్యకర్తలను విస్మరించడం, ప్రజలను పట్టించుకోకపోవడం చేశారు. వీరిపై జనాల్లో భారీగా వ్యతిరేకత ఉంది. అయితే సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు నియోజకవర్గా్లలో సర్వే చేయించి నెగెటివ్ ఉన్న ఎమ్మెల్యేను హెచ్చరించుకుంటు వస్తూనే ఉన్నారు. అయితే తాజాగా రాష్ర్టంలో కారుకు ఎదురుగాలి వీస్తోంది. దీంతో అలర్ట్ అయినా కేసీఆర్ ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న వారితో పాటు సొంత పార్టీలో ఉంటూ చీలకలకు ప్రయత్నం చేస్తున్న వారిపై ఫోకస్ పెట్టారు. వీరికి సీట్ కదిలించే పనిలో సీఎం ఉన్నారు.
మార్పు అనివార్యం..
ప్రత్యేక రాష్ర్టంలో ముచ్చటగా మూడోసారి జరగనున్న ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈసారి ప్రతిపక్షాలు బలం పుంజుకొని బరికి సై అంటున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరింత అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను సాయం కోరారు. ఈ నేపథ్యంలో ఆయన సంస్థ ఐప్యాక్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. తాజా ఆదివారం పీకేతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈనేపథ్యంలో కొంతమంది మ్మెల్యేలపై ప్రజావ్యతిరేకత ఉందనే విషయాన్ని గులాబీ బాస్ కు వివరించారు. ఎలాగైన తమకే ఎమ్మెల్యే సీటు వస్తుందనే భావనతో ఒటెత్తు పోకడలు పోతున్నారని చెప్పారు. జనంలో వ్యతిరేకత ఉన్న వారిని మార్చే విషయం పరిశీలించాలని పీకే సూచించినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ పర్సనల్ సర్వేలోనూ కొంతమందిపై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది.
ఓరుగల్లులో కుమ్ములాట..
ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లులో టీఆర్ఎస్ పరిస్థితి ఆగమాగం అవుతోంది. నిత్యం కుమ్ములాటలతో అధినేత చూపుల్లోనే ఉంటోంది. ఈనేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఎవరెవరికి మళ్లీ సీట్లు కేటాయిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. సొంత పార్టీలోనే ఉంటూ పార్టీ ప్రతిష్టతను దెబ్బతీస్తున్న, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వారు, ప్రజలకు అందుబాటులో ఉండని ఎమ్మెల్యే చిట్టను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కాంట్రవర్సీ ఎమ్మెల్యేలను పక్కన బెట్టాలని నిర్ణయానికి వచ్చారట. మూడోసారి గెలుపును ప్రతిష్టగా తీసుకోవడంతోపాటు కేటీఆర్ ను సీఎం చేయాలనే ఆలోచనలో ఉండడంతో వీరి వల్ల పార్టీ ఓటమి పాలు కాకూడదనే ఆలోచనతో సిట్టింగ్‌ల సీట్లు కదిలించడం ఖాయంగా మారింది. ఇప్పటికే ఓరుగల్లులోని వరంగల్ తూర్పు, పశ్చిమ, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాల్లో ఈసారి సిట్టింగ్ లకు సీట్ల కేటాయింపు కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాల కోసం అధినేత అన్వేషణ చేశారని ఆ పార్టీలోని ముఖ్య నాయకులు చెబుతున్నారు.
Recent Comments