వేల సంఖ్యలో బలిదానాలు., వందల సంఖ్యలో చావు అంచుల వరకు వెళ్లిన అనుభవాలు.., పదుల సంఖ్యలో పదవులను వదిలి రాజకీయ శూన్యాన్ని ఆహ్వానించిన గురుతులున్నా.., చివరకు సాధించి, బంగారు ఉద్యమ పాఠాన్ని లిఖించింది మాత్రం సారథి పనే. ఏ చరిత్ర అయినా రణరంగపు బలులు.., రక్త తర్పణాలు సర్వసాధారణమే.., చివరకు గెలుపు జెండాను పట్టుకుని విజయకేతాన్ని ప్రపంచానికి పరిచయం చేసేది మాత్రం ఉద్యమాన్ని నడిపే వేళ పగ్గాలు పట్టుకుని దిశానిర్దేశం చేసే వ్యక్తే.
‘‘మాది ఇప్పుడు పక్కా రాజకీయ పార్టీయే. ప్రత్యేక రాష్ట్ర పోరు సమయంలో ఉద్యమం చేశాం.., కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తూనే ఉన్నాం. సాధించే వరకే ఉద్యమ పార్టీ, చిరకాల వాంఛ నెరవేరిన తర్వాత రాజకీయ పార్టీ. ప్రజలు నమ్మి రెండో పర్యాయం కట్టబెట్టారు. ప్రతిపక్ష పాత్ర పోషించే బలం లేని పార్టీలు ఎడాపెడా తిడుతుంటే హరికథ విన్నట్టు విని ఊరుకోవడానికి చేతగాని వాళ్లం కాదు.., అతిపెద్ద పార్టీగా అవతరించాం, ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. వైరి పక్షాల కుట్రలు తిప్పికొట్టడానికి తప్పకుండా రాజకీయం చేయాల్సిందే. రాజకీయ పార్టీగా మెరుగులు దిద్దుకోవాల్సిందే..’’ ఎన్నో సందర్భాల్లో సీఎం కేసీఆర్నోటి నుంచి వచ్చిన మాటలివి.
వలసలు సర్వసాధారణం. అధికారం ఆకర్షించడం ప్రకృతి నైజం. కాలంతో పాటు పబ్బం గడుపుకోవడంలో రాజకీయాలను మించిన రసవత్తరం మరే రంగంలో లేదనేది నిజం. గులాబీ ప్రభకు మిగతా పార్టీలు విలవిల్లాడాయి. ప్రజలు పట్టిన బ్రహ్మరథం కింద అన్ని పార్టీలు నలిగిపోయాయి. రాష్ర్టం కోసం వేల సంఖ్యలో బలిదానాలు జరిగాయి., వందల సంఖ్యలో చావు అంచుల వరకు వెళ్లిన అనుభవాలున్నాయి.., పదుల సంఖ్యలో పదవులను వదిలి రాజకీయ శూన్యాన్ని ఆహ్వానించిన గురుతులూ పదిలమే.., కానీ, చివరగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, విజయ శంఖాన్ని పూరించింది మాత్రం అధినేతే. ఏ చరిత్రలోనైనా రణరంగంలో ఎందరో బలవుతారు.., ఎందరో రక్తాన్ని చిందిస్తారు.. చివరకు గెలుపు జెండాను పట్టుకుని విజయకేతాన్ని ప్రపంచానికి పరిచయం చేసేది మాత్రం ఉద్యమాన్ని నడిపే వేళ పగ్గాలు పట్టుకుని దిశానిర్దేశం చేసే వ్యక్తే. అయినా, రాలిన ఉద్యమ పూలను చూసి, రక్తపు మరకలకు వెరిసి కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏ రాజూ విజయాన్ని చేరలేడు.., ఏ సారథి ప్రజాకాంక్షను తీర్చలేడు.
మొదటి విడత అన్ని సర్దుకోవడానికే సరిపోయింది. దగ్గర్లో మరో ఆప్షన్ కూడా లేదు. మరో విడత అవకాశం ఇచ్చారు. ముందస్తుకు వెళ్లినా నమ్మకాన్ని వమ్ము చేయకుండా జయకేతనం కట్టబెట్టారు. మలి విడత విజయానంతరం అప్పటి వరకు అంతో ఇంతో కనిపించిన ప్రతిపక్షాలు అప్పటితో దాదాపుగా కనుమరుగయ్యాయి. పదవుల వ్యామోహమో.., ‘పాత చరిత్ర’లను తిరగదోడుకునే రిస్క్ ఎందుకనుకున్నారో.. గానీ, దాదాపుగా మెజార్టీ సంఖ్యలో నేతలంతా కారెక్కారు. ఇప్పుడప్పుడే హస్తం సర్దుకునేది లేదు.., సైకిల్ రిపేర్ అయ్యేదీ కాదు.., కమలం విచ్చుకునేందుకు మరింత సమయం పట్టే పరిస్థితులు. అవసరమైతే మరో ఇరవై ఏళ్లు మేమే అని పెద్ద మనిషి సభాముఖంగా హెచ్చరికతో కూడిన సందేశం పంపుతూనే ఉన్నాడు. ఆయన రాజకీయ చతురత ముందు నిలబడి తట్టుకోవడం తరం కాదనే విషయం తెలిసి ‘బడా’బాబులంతా గులాబీ కండువా కప్పుకున్నారు.
కలవడం వరకు అంతా బాగానే ఉంది. కానీ, కారెక్కిన ప్యాసింజర్లంతా వేర్వేరు స్వభావాలు ఉన్నవారు. ఒక్కొక్కరి రాజకీయ పుట్టుపూర్వోత్తరం ఒక్కోటి. వ్యాపకాలుంటాయి, వ్యాపారాలుంటాయి.., ఇతరత్రా ఏమేమో ప్రయోజనాలుంటాయి. వాహనం ఎక్కిన కొత్తలోనే సొంతానికి పంథం పడితే ఉన్న నమ్మకం పోతుందని ఎవరికి వారుగా నెమ్మదించారు. జర్నీలో కాస్త సీనియారిటీ రావాలి.., పరిచయాలు పెరగాలి.., చనువుగా మంచిచెడులు చెప్పుకునే సాన్నిహిత్యాలు బలపడాలని కొన్నేళ్లు ఆగారు. అప్పటికీ చాపకింద నీరులా ఎక్కడి వారక్కడ వ్యవహారాలు చక్కబెట్టుకునే పనిని మాత్రం వదులలేదనేది నూటికి వెయ్యిపాళ్లు నిజం. ఇక రెండో విడత ముగిసేందుకు కూడా సమయం ఆసన్నమవుతోందనే అడపాదడపా సంకేతాలు వస్తూనే ఉన్నాయి. దీంతో గులాబీ పువ్వు పట్టిన వాళ్లు చక్కదిద్దుకునే వ్యవహారాన్ని వేగం చేశారు.
ఇప్పుడున్నవన్నీ పాత మనుషుల కొత్త కోణాలే. కక్షలు అవే.., కత్తి దూసుకోవడాలు అవే.., కలరు మారిన తెర ముందు కదులుతున్న పాత్రలు అంతే. రంగులు మార్చిన పాత దృశ్యాన్నే చూపుతున్నారు. గులాబీలో ఒక్కో రెమ్మ రెచ్చిపోతున్నది. అధినేత కంట్రోల్ లో ఉన్నామనే సోయి కూడా మరిచిపోయి అసలు రంగులు బయటపెట్టుకుంటున్నాయి. ఎనిమిదేళ్లు స్తబ్దుగా సాగిన కారు ప్రయాణంలో ఏడాది నుంచి కుదుపులు కనిపిస్తున్నాయి. ఎక్కడో బీజాలు పడిన మొక్కలకు, ఇప్పుడు రక్తపుధారల రుచి చూపుతున్నాయి.
పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతుల మారణకాండ.., మానుకోట కౌన్సిలర్ హత్యోదంతం.., మహిళా ప్రజాప్రతినిధుల వ్యవహారంలో అమర్యాదగా ప్రవర్తించే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల ఉదంతాలు.., గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో మహిళా ఉద్యోగులు, రోజువారీ కూలీల పట్ల ‘అదే కోణం’లో చూస్తూ పైశాచికం పొందే ప్రజాప్రతినిధుల తీరు ఇలా అన్నీ రాజకీయ కోణాలే. పదవిలో ఉన్నామనే గర్వంతో పని ప్రదేశాల్లోని మహిళామూర్తులకు వేధింపుల బహుమానాలు.., ‘బలవంతపు’ ప్రలోభాలతో లొంగదీసుకునే యత్నాలు. ఇంత చేసినా న్యాయం కోసం పోయే బాధితులకు వ్యవస్థలు కూడా పట్టించుకోకుండా మభ్యపెట్టే స్థాయికి ఎదిగిన శైలి.., నిజంగా పార్టీ ప్రతిష్టను మలినపరిచే తీరుకు నిదర్శనాలే. అదీగాక, గల్లీగల్లీకి కబ్జా పర్వాలు.., పదవులు కాపాడుకునే ఎత్తుగడలో కారాలుమీరాలు నూరుకోవడాలు.., మంచి పనులకు ప్రేరేపించిన నిధుల్లో వాటాల పంపకాలు.., మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో మొండిబారిపోయిన ప్రవర్తనలు.., నిజంగా ఇవన్నీ ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న పెద్దాయనను ఇరకాటంలో పెట్టే చర్యలే.., రాజకీయంగా పార్టీకి కూడా ఎంతో కలంకం తెచ్చేవే.
కాంగ్రెస్, బీజేపీ నేతల గొంతులు ‘ఆ బాపతు’ వాళ్లంతా గులాబీ పేటెంట్లే అనే స్థాయిలో పెగులుతున్నా, అసలు పుట్టుక ఎక్కడో అందరికీ తెలిసినా ఎవరూ బయటపెట్టని నిజం. రాజకీయంగా గులాబీ నేత మాటలు ఒక విధంగా ఉదహరిస్తే, వాస్తవంలో మాత్రం కిందిస్థాయి కేడర్ దానిని వారి కోణంలో వాడుకుంటున్నారు. ‘ప్రత్యేక గుర్తింపు’ ఉన్న పార్టీ వన్నె తగ్గే పనులు చేస్తూ సర్కార్ ను ఇరకాటంలో పెట్టే చర్యలు ‘లోకల్’ గా విస్తృతి పెంచుకుంటున్నా., పైకి అంతా బాగానే ఉందనుకునే కప్పిపుచ్చే ధోరణితో నెట్టుకొచ్చే పరిస్థితి. ఏది ఏమైనా స్వతంత్ర్య గుర్తింపును కోల్పోయే స్థాయికి చేరడమంటేనే అనుమానానికి విజయం కట్టబెట్టడమే.., అజ్ఞానాన్ని విస్తృతం చేస్తున్నామంటే పతనం షురూ అయినట్టే…
–రాజేంద్ర ప్రసాద్ చేలిక, ఎడిటర్
(ఏప్రిల్ 27 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని..)
Recent Comments