మాస్క్ ధరించాల్సిందే..
లేకపోతే రూ.1000 ఫైన్
కొవిడ్ ముప్పు తక్కువే అయినా జాగ్రత్తగా ఉండాలి
డీహెచ్ శ్రీనివాస్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయని డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చైనా, తైవాన్, ఈజిప్టు వంటి దేశాలతో పాటు ఢిల్లీ, హర్యానా, యూపీలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని పేర్కొన్నారు. కానీ పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. రోజుకు 20-25 కరోనా కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. కొవిడ్ ముప్పు తప్పిందని నిర్లక్ష్యం చేయడం తగదని, ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని డీహెచ్ సూచించారు. ఫోర్త్‌వేవ్‌పై అనేక అనుమానాలు ఉన్నాయని, సీరో సర్వే ప్రకారం తెలంగాణలో ఫోర్త్ వేవ్ రాదని డీహెచ్ తెలిపారు. మాస్కు ధరించకపోతే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని చెప్పారు.
భారీగా పెళ్లిళ్లు..
తెలంగాణ వ్యాప్తంగా ఈ రెండు నెలల్లో భారీ సంఖ్యలో పెళ్లిళ్లు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సీరో సర్వే ప్రకారం తెలంగాణలో ఫోర్త్ వేవ్ రాదని స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రతీ వ్యక్తి మాస్కు ధరించడంతో పాటు, అర్హులైన వారు వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భాగస్వామ్యంతో కొవిడ్‌ను నియంత్రించామని, రాబోయే రోజుల్లోనూ ప్రజల సహకారం అవసరం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా తీసుకున్న జాగ్రత్తల వల్ల కరోనాను పూర్తిగా నిరోధించగలిగామని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఢిల్లీ, హర్యానా, యూపీతో పాటు పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోర్త్ వేవ్ నుంచి బయటపడాలంటే మాస్కు, వ్యాక్సిన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. 60 ఏళ్ల పైబడిన వ్యక్తులందరికీ ప్రతీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో బూస్టర్ డోసు ఇస్తున్నామని తెలిపారు. రెండో టీకా తీసుకొని 9 నెలలు పూర్తయిన వారు మూడో డోసు తీసుకోవాలని సూచించారు. 12 నుంచి 17 ఏండ్ల వయసున్న పిల్లలు రెండో డోసు తీసుకోవాలని, 18-59 ఏండ్ల వయసు వారికి ఉచితంగా బూస్టర్ డోసు పంపిణీకి కేంద్రంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంప్రదింపులు జరుపుతుందని డీహెచ్ శ్రీనివాస్ రావు వెల్లడించారు.
ఎండలో బయటికి రావొద్దు
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే గొడుగు ఉపయోగించాలన్నారు. లేదా తలకు ఏదైనా బట్ట చుట్టుకోవాలని సూచించారు. నలుపు రంగు దుస్తులు ధరించకుండా, లేత రంగు దుస్తులు, కాటన్ వస్త్రాలు ధరించాలని చెప్పారు.
మాస్క్ ధరించాల్సిందే..
RELATED ARTICLES
Recent Comments