Monday, November 25, 2024
Homeజిల్లా వార్తలుఒక్క హామీ నెరవేర్చలేదు..

ఒక్క హామీ నెరవేర్చలేదు..

ఒక్క హామీ నెరవేర్చలేదు..
మళ్లీ మోసం చేసేందుకే కేటీఆర్​వరంగల్​పర్యటన
నగరాభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ఏఐసీసీ ఓబీసీ జాతీయ కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి
స్పాట్​వాయిస్, సుబేదారి : గతంలో వరంగల్ నగర ప్రజలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరలేదని, మళ్లీ మోసం చేసేందుకే తారకరామారావు పర్యటన పేరుతో ఓరుగల్లుకు వస్తున్నారని ఏఐసీసీ ఓబీసీ జాతీయ కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి ఆరోపించారు. ఓరుగల్లు ప్రజలకు గతంలో ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారు..? ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారనే విషయాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్​చేశారు. మంగళవారం బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటస్వామి మాట్లాడారు. వరంగల్ ను విదేశీ నగరాలతో సమానంగా అభివృద్ధి చేస్తామని గతంలో కేసీఆర్, కేటీఆర్, దయాకర్ రావు అనేక హామీలు ఇచ్చి, వాటిని తుంగలో తొక్కి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, టెక్స్​టైల్​పార్క్, ఐటీ పార్క్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు లాంటి హామీలు ఇచ్చి ఏ ఒక్క దానిని నెరవేర్చుకుండా మళ్లీ నగర ప్రజలను మోసం చేయడానికి వరంగల్ కు వస్తున్నారని ఎద్దేవా చేశారు. నగరంలో వరదలు వచ్చినప్పుడు మాత్రమే ఆక్రమణల గురించి మాట్లాడి, ఆ తర్వాత పట్టించుకోకుండా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు. కేటీఆర్ రేపటి పర్యటనలో నగర అభివృద్ధిపై ప్రభుత్వం చేసిన వాగ్దానాల లిస్టు, హామీలు నెరవేర్చేందుకు విడుదల చేసిన నిధులు, స్మార్ట్ సిటీ పేరుతో కేంద్రం విడుదల చేసిన నిధుల వివరాలను వెల్లడించాలని, లేకపోతే తెలంగాణలోనే రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్​విసిరారు. సమావేశంలో ఏఐసీసీ ఓబీసీ జాయింట్ కో ఆర్డినేటర్ యాదగిరి, రాష్ట ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా చైర్మన్ కృష్ణ , జిల్లా కో చైర్మన్ జనార్ధన్, రాజ్ కుమార్, తిరుపతి, గణేష్, లింగమూర్తి, శంకర్ గౌడ్, పలనాటి శ్రీను, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments