Monday, November 25, 2024
Homeరాజకీయం‘కారు’ కొట్టుకుపోవడం ఖాయం..

‘కారు’ కొట్టుకుపోవడం ఖాయం..

‘కారు’ కొట్టుకుపోవడం ఖాయం..
ఇదేమైనా గడీల పాలనా..? రాజరిక వ్యవస్థా..?
ఊడిగం చేయడానికి ప్రజాప్రతినిధులకు సిగ్గుండాలి..
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి
మంత్రి కేటీఆర్ కు డైరెక్ట్ ప్రశ్నలు సంధించిన బీజేపీ యువనేత
స్పాట్ వాయిస్, వరంగల్ సిటీ : ‘‘నేను గతంలోనే చెప్పాను.., ఇప్పుడు మళ్లీ చెప్తున్నా.., మళ్లీమళ్లీ చెబుతున్నా.., ఈయేడాది కూడా వరంగల్ మహానగరంలో వరదలు వస్తాయ్ కానీ అవి వానాకాలం వరదలు కావు, ఎన్నికలప్పుడు వచ్చేవి.. అందులో గులాబీ పార్టీ కొట్టుకుపోవడం ఖాయం..’’ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. బుధవారం వరంగల్ నగరానికి రానున్న మంత్రి కేటీఆర్ కు రాకేష్ రెడ్డి సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. గతంలో ఇచ్చిన హామీలు, చేసిన బాసలు మర్చిపోయిన పెద్ద మనిషి, ఇప్పుడు మళ్లీ ఏం ముఖం పెట్టుకుని వస్తున్నాడన్నారు. సీఎం కొడుకు హోదాలో వస్తున్నాడా..? ప్రజలను ప్రలోభ పెట్టే రాజకీయ నేతగా వస్తున్నాడా..? పార్టీ నేతలకు మరో మారు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించడానికి వస్తున్నాడా..? తెలపాలన్నారు. సిగ్గు లేదా జీడిగింజా అంటే నల్లగా ఉన్న నాకేం సిగ్గు అన్నట్టుగా మంత్రి కేటీఆర్ వ్యవహారం ఉందన్నారు. కేంద్రం కేటాయించిన నిధులతో చేస్తున్న అభివృద్ధి పనులకు కనీసంగా కేంద్ర మంత్రులకు ఆహ్వానించకుండా కొబ్బరికాయలు కొట్టడానికి రావడం విడ్డూరంగా ఉందని, వారి తీరు చూస్తుంటే మంది పెళ్లిళ్లకు మంగళహారతి పట్టడానికి వస్తున్నట్టుగా ఉందనిపిస్తోందన్నారు. నిధులన్నీ కేంద్రం నుంచి వచ్చి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక కేటీఆర్ ఎగేసుకుని వచ్చే తీరు చూస్తుంటే అంతా సిద్ధం చేసిన తర్వాత పౌడర్, బొట్టు పెట్టి నాది అనిపించుకోవడానికి వస్తునట్టుందన్నారు. కూరంతా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసినట్టో, కల్యామాకు వేసినట్టో షో చేయడానికి కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాలు పెట్టుకుంటుంటే విచిత్రంగా ఉందన్నారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లోనే చెప్పాలంటే మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని ముద్దాడడానికి వస్తున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.

* ఎనిమిదేళ్లలో ఏం చేశారు..
రాష్ట్రంలో రెండో రాజధానిగా పిలవబడే వరంగల్ కు గడిచిన 8 ఏళ్లుగా ఏం చేసిందో చెప్పుకోలేని దుస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. అన్నం కలిపి నోట్లో పెట్టినట్టుగా కేంద్ర ప్రభుత్వమే నగర సుందరీకరణకు స్మార్ట్ సిటీ, అమృత్, హృదయ్ పథకాల్లో చేర్చి నిధులు కేటాయిస్తే, ఆ నిధులను కూడా సక్రమంగా ఖర్చు చేయలేని దుస్థితిలో సర్కార్ ఉందన్నారు. మాటలు మాత్రం ఎల్లలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడపే దాటడం లేదన్నారు. హామీలు ఇవ్వడానికి పోటీ పడుతున్నారుగానీ, నెరవేర్చడానికి అంగుళం కూడా కదలడం లేదన్నారు.

* జనాల్ని తరలించుడేంది విచిత్రంగా..
ఇంతోటి పనుల శంకుస్థాపనలకు కేటీఆర్ రావడమేంటోనని అర్థం కాక తలలు పట్టుకుంటుంటే, ఆ సక్కదనానికి లోకల్ లీడర్లు జనాలను తరలించాలని చూడడం మరీ విడ్డూరమన్నారు. ఆయన అయితేగియితే మీకు యువరాజు కావచ్చు గానీ, ప్రజలకు ఏం అవుతారో స్థానిక గులాబీ నేతలు చెప్పాలన్నారు. మీ యువరాజా గారి ప్రసన్నానికి మీరు జోక్కుంటే సరిపోతుందిగానీ, ప్రజలను తరలించాలనే ఆలోచన చేయడం సరికాదన్నారు. మీరు చేసే పనులు నిజంగా మంచివే అయితే, మీరు ప్రజాక్షేమానికే పాటు పడితే జనాలు వారంతట వారే వస్తారని, ఈ మాత్రం లాజిక్ మర్చిపోతే ఎలా అని రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలను ఎంతసేపు మీరు ఓటింగ్ యంత్రాలుగానే పరిగణించడం మీ అహంకారానికి నిదర్శనమన్నారు.

* నిజంగా కేటీఆర్ కు సభ పెట్టాలనిపిస్తే అసంపూర్ణంగా ఆగిన కాళోజీ కళాక్షేత్రం ముందో.., పూర్తికాని రింగ్ రోడ్డుపైన్నో.., శంకుస్థాపన చేసి వదిలేసిన టెక్స్ టైల్ పార్క్ ఆవరణలోనో.., అడవిని తలపిస్తున్న మామునూర్ ఎయిర్ పోర్ట్ ప్రదేశంలోనో.., గుంతలుగా మారిన రోడ్లపైన్నో.., కూలగొట్టిన సెంట్రల్ జైలు స్థలమో, అధ్వాన్నంగా ఉన్న ఎంజీఎంలో ఆవరణలోనో మీటింగ్ పెట్టుకోవాలన్నారు. అప్పుడు నిజమైన టీఆర్ఎస్ సర్కార్ చేసిన నిజమైన అభివృద్ధి కనిపిస్తుందన్నారు.

* మంత్రి, ఎమ్మెల్యేలకు సిగ్గుండాలి..
ఓరుగల్లు అభివృద్ధికి మొండి చేయి చూపిన కేసీఆర్ దగ్గర మోకాళ్లపై కూర్చొని ఊడిగం చేస్తున్న మంత్రి ఎర్రబెల్లికి, ఓరుగల్లు నగర ఎమ్మెల్యేలకు సిగ్గుండాలన్నారు. ఓరుగల్లు ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన ఉమ్మడి వరంగల్ నేతలకు ఈ గడ్డపై తిరిగే అర్హత లేదన్నారు. ఆ మాటకొస్తే వాళ్లంతా ప్రజాప్రతినిధుల్లా కాకుండా కేసీఆర్ గడీలో పాలేర్లుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు కేటీఆర్ సమాధానం చెప్పిన తర్వాతే పర్యటన జరపాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments