స్పాట్ వాయిస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రేమ జంట వారి కులాలు వేరు కావడం పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. సుల్తానాబాద్ మండలం కనుకులకు చెందిన ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఊరంతా తెలిసింది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు ఇద్దరు ప్రేమికులను మందలించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి కులాలు వేరు కావడం, ఇద్దరు ప్రేమికులు మైనర్లు కావడంతో పెండ్లి చేయలేమని తేల్చి చెప్పారు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమ జంట చావే మార్గంగా ఎంచుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ప్రియుడు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ కరీంనగర్ ఆస్పత్రిలో మృత్యువాత పడ్డాడు. ప్రియుని మరణవార్త తెలుసుకుని ప్రియురాలు మంగళవారం తెల్లవారుజామున గ్రామంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన ప్రేమికుల ఫైల్ ఫొటోలతో వీడియో తయారు చేసి గ్రామస్తులు సోషల్ మీడియా గ్రూప్లో పోస్ట్ చేశారు.
Recent Comments