Sunday, November 24, 2024
Homeతెలంగాణగూటి నుంచే కుంపటి..

గూటి నుంచే కుంపటి..

గులాబీకే గుచ్చుకుంటున్న ముల్లు
బయటపడుతున్న టీఆర్ఎస్ లో లుకలుకలు
ప్రొసీడింగ్స్ బాధ్యతల అప్పగింతలతో తేడాలు
తీవ్ర అసంతృప్తిలో ప్రతినిధులు
కేసీఆర్ నిర్ణయానికి మొదటిసారి స్వపక్ష వ్యతిరేకత
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: కేసీఆర్ మాటకు తిరగేలేదు., ఉండదు కూడా. మహామహా మంత్రులైన, సీనియర్ మోస్ట్ నేతలైనా సరే అధినేత ఆజ్ఞాపిస్తే క్షణాల్లో వాలిపోయి పనిని చక్కదిద్దుకోని రావాల్సిందే. అంతటి ఆధిపత్యంగా పార్టీని ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా పాలన సాగిస్తున్నారు. కానీ, కొన్ని సందర్భాల్లో పై స్థాయి నాయకులు స్తబ్దుగా ఉన్నా, వారి అనుచరులు, దిగువస్థాయి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఆవేదనను వెల్లగక్కవచ్చుకదా. అనుచుకున్న ఆక్రోషాన్ని బహిర్గతం చేసే ప్రమాదం లేకపోలేదు కదా. ఎంతైనా అన్ని రోజులు ఒకేలా ఉండాలనుకోవడం అత్యాశే అవుతుంది.

అగ్గిరాజేస్తున్న దళితబంధు..
హుజూరాబాద్ ఉపఎన్నికల ముందు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రకటించారు. ఇందిరానగర్ వేదికగా జరిగిన సభకు హాజరైన ముఖ్యమంత్రి ప్రజల సమక్షంలో గర్వంగా దళితులంతా గర్వపడేలా పథకాన్ని ప్రకటించారు. అప్పటికప్పుడు పలువురు లబ్ధిదారులకు చెక్కులు కూడా అందించారు. రాబోయే రోజుల్లో దానిని అమలు తాలూకు విధివిధానాలను కూడా అనౌన్స్ చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఆ పథకమే టీఆర్ఎస్ పార్టీకి మెడకు గుది బండగా మారుతున్నది. ఏండ్లకు ఏండ్లుగా ఆ పార్టీనే నమ్ముకుని గంపెడాశతో ఉన్న వారికి కాకుండా మధ్యలో వచ్చి కారెక్కిన వారికి, అదీ కాదంటే వైరి పక్షం ప్రజాప్రతినిధులకు దాని ప్రొసీడింగ్స్ బాధ్యతలు అప్పగించడంతో లొల్లి షురువైంది. తమను కాదని తమకంటే వెనకొచ్చిన వారికి ఇవ్వడంతో సీనియర్లకు ఈగో హర్ట్ అవుతున్నది. అలాగే, మరికొన్ని ప్రాంతాల్లో కేవలం ప్రతిపక్ష పార్టీ నేతలకు పెద్దపీట వేస్తున్నట్టుగా పూర్తిగా వారికే బాధ్యతలు కట్టబెట్టడం గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

తీవ్ర అసంతృప్తిలో ప్రజాప్రతినిధులు
దళితబంధు ప్రొసీడింగ్ బాధ్యతలు మంత్రి సత్యవతి రాథోడ్ కు అప్పగించడంపై నాలుగు రోజుల కిందట ములుగు జిల్లాలోని జిల్లాస్థాయి నేతలు సమావేశమై తర్జనభర్జన పడ్డారు. తమకు గుర్తింపు లేకుండా ఇతర ప్రాంతాల వారికి, అజమాయిషీ ఇవ్వడం, తమ ప్రాంత లబ్ధిదారుల ఎంపికను వేరే పార్టీ ఎమ్మెల్యేకు అప్పగించడంపై వారంతా మండిపడ్డారు. స్థానికంగా తమ విలువను మొత్తంగా జీరో చేసిన ఇలాంటి చర్యలతో మున్ముందు తలెత్తుకుని ఎలా తిరగగలమని వాపోయారు. తీవ్ర అసహనానికి గురైన వారంతా అప్రకటిత యుద్ధానికి దిగారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అది జరిగిన రెండు రోజుల తర్వాతే మంథని నియోజకవర్గంలోనూ కాటారం సబ్ డివిజన్ కు చెందిన మండలాల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కూడా సమావేశమై పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న విధానపరమైన నిర్ణయాలపై తీవ్రంగా చర్చించారు. దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ప్రొసీడింగ్స్ బాధ్యతలు అప్పగించడంపై అసంతృప్తికి గురై త్వరలోనే దిద్దుబాటు చర్యలకు దిగకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు కూడా చేస్తామని ప్రకటించారు. కొందరైతే ఏకంగా టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

స్వపక్షమే విపక్షంగా..
సొంతపార్టీ నుంచే వ్యతిరేక పవనాలు వీయడం ఇదేమీ కొత్త కాదు కానీ, బహిర్గతం కావడం మాత్రం కొత్త విషయమే. గతంలో లుకలుకలు వచ్చినా లోలోపలే సర్దిచెప్పి వ్యవహారాన్ని బయటకు పొక్కనివ్వలేదు. కానీ, ఇప్పుడు ఎవరో చెబితే వినే స్థితిలో మరెవరో లేరన్నట్టుగా ఎక్కడికక్కడ అసంతృప్తులంతా తిరుగబావుటా ఎగరేస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన పార్టీలో ఇలా రెబెల్ బెడద రోజురోజుకు పెరుగుతుండడం నిజంగా దళిత బంధు పుణ్యమే అని పలువురు పేర్కొంటున్నారు. తమకు చెందిన వారికి అన్యాయం చేస్తూ, మధ్యలో వచ్చిన వారికి లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్న ఎంపిక ప్రక్రియ ఇప్పుడు నిప్పు రాజేసింది. కొద్దికొద్దిగా మొదలైన ఈ స్వపక్షంలోని విపక్ష జ్వాలా పూర్తిగా అంటుకునే పరిస్థితులు కూడా లేకపోలేదని పలువురు నేతలు పేర్కొంటున్నారు. తీవ్ర అసహనంతో ఉన్న వారంతా ప్రత్యామ్నాయాలను చూసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు బయటకు వెళ్లినా ప్రయోజనాలు ఉండవు కాబట్టి, పార్టీలోనే కొనసాగుతూ పక్కవారితో టచ్‌లో ఉంటూ సమయం రాగానే జంప్ కావాలనే ఆలోచనలో కూడా చాలామంది జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులు ఉన్నట్టు తెలుస్తోంది.

కారుకు కారునుంచే కష్టాలు..
కారుకు ఇతర పార్టీల కంటే కూడా అందులోని ఓ ప్రత్యేక పక్షం నుంచే కష్టాలు మొదలయ్యాయి. గుచ్చుకుంటున్న గులాబీ ముల్లును పంటిబిగువున భరిస్తూ వచ్చిన వారంతా ఇప్పుడు తమ ప్రతాపాన్ని చూపడానికి సిద్ధమవుతున్నారు. ఒక్క ములుగు, మంథని అనే కాకుండా, కరీంనగర్ లోని హుజూరాబాద్, మానకొండూరు, వరంగల్ లోని మహబూబాబాద్, పరకాల వంటి పలు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా దళితబంధు తమకు దక్కకపోతే తగిన బుద్ధిచెబుతామని ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ఆయా నియోజకవర్గాల నేతలంతా బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికలకు ఇంకా సమయమున్నా రాజుకున్న అగ్గిని ఇప్పటి నుంచే అదుపులో పెట్టకపోతే నిజంగానే టీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీలోని వారే తప్పకుండా నష్టం చేసే చర్యలకు దిగుతారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments