Saturday, September 21, 2024
Homeజనరల్ న్యూస్అమయుడు.. పనిమంతుడు

అమయుడు.. పనిమంతుడు

నో కాంప్రమైజ్.. ఓన్లీ వర్క్..
ధరణిలో ఫిర్యాదు చేశారా..? ఇక నో టెన్షన్
హాట్ కేకుల్లాంటి జిల్లాలో ధరణి అద్భుతాలు
రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్ చొరవ
రాష్ట్రంలోనే జిల్లాకు ప్రత్యేక స్థానం..

భూమి కాలి కింద ఉండేదే అయినా, దాని ధరలకు రెక్కలు తొడిగి ఆకాశానికి ఎత్తిన జిల్లా అది. ఖాళీగా గజం భూమి కనిపిస్తే, మరుసటి రోజు అది యథాతథంగా కనిపిస్తే ఒట్టు. రూపురేఖలు మార్చేయడం, పదుల సంఖ్యలో యాజమానులమంటూ పత్రాలతో గందరగోళం క్రియేట్ చేయడం అక్కడ పరిపాటి. రాజధానికి చుట్టూతా ఉండే ఆ భూముల్లో లెక్కకు కూడా చిక్కని చిక్కులు చాలా సహజం. ఎప్పుడూ రాజకీయ ఒత్తిళ్లు, పేట్రెగే ముఠాల తగాదాలు, కేసులు, కోర్టులు ఇలా ఆ జిల్లా వ్యవహారమంతా ఎప్పుడూ రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్. ల్యాండ్ ఇష్యూ అంతగా హైరిస్క్ జోన్ లో ఉన్న ఆ జిల్లాలో వాటి వ్యవహారాన్ని చక్కదిద్దడం ఆషామాషి కాదు. సవాళ్లను అధిగమిస్తూ, ధరణి పోర్టల్ ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు ఆ జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్. పెండింగ్ అంటే సమస్య పెరిగిపోతుందనే కాన్సెప్ట్ తో ఎప్పటికప్పుడు పిటిషన్లను క్లియర్ చేయడమే టార్గెట్ గా పెట్టుకుని పనులను చక్కబెడుతున్నారు ఆయన. తనకున్న అనుభవాన్ని మొత్తంగా రంగరించి ఇప్పటి వరకు 95 శాతం మేరా సమస్యలను పరిష్కరించి ఔరా అనిపించుకుంటున్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా సిబ్బందిని గాడిలో పెడుతూ ఇటు ప్రజలతో పాటు అటు సర్కార్ పెద్దలతో కూడా శభాష్ అనిపించుకుంటున్నారు. ఒక్క మాటలతో చెప్పాలంటే ఆయన వచ్చాక తమకు ‘నో టెన్షన్ కలెక్టర్’ గా అనిపిస్తున్నదని జిల్లా ప్రజలు గుండెనిబ్బరంగా పేర్కొంటున్నారు.
-స్పాట్ వాయిస్, ప్రత్యేక ప్రతినిధి

అత్యధిక భూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఆ జిల్లా. బంగారం కంటే పది రెట్లు విలువైన ధరలు ఆ భూముల సొంతం. వందల మంది వీవీఐపీల భూముల సమస్యలు ప్రతిరోజూ ఆ కార్యాలయం తలుపు తడుతూ ఉంటాయి. ఆ జాగాలు రియల్ ఎస్టేట్ మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తాయి. చిన్న సంతకం పెడితే చాలు అధికారుల టేబుళ్లన్నీ పచ్చనోట్లతో నిండిపోతాయి. అలాంటి జిల్లాలో ఎలాంటి వివాదం లేకుండా 95 శాతం భూముల సమస్యలను అత్యంత సులువుగా పరిష్కరించడం సాధ్యమేనా? రాజకీయ ఒత్తిళ్లు తట్టుకుని నిలబడటం అధికారుల వల్ల అవుతుందా?, నోట్ల కట్టలను ఎర వేసినా నిజాయితీగా పని చేసే అధికారులు అక్కడ డ్యూటీ చేయగలరా?, అవును సమస్యను సులువుగా పరిష్కరించొచ్చు. ఒత్తిళ్లను తట్టుకుని నిలబడొచ్చు. నిజాయితీగా డ్యూటీ కూడా చేయొచ్చు.. ఐఏఎస్ అమయ్ కుమార్‌ లాంటి వ్యక్తులుంటే అవన్నీ సాధించొచ్చు. ధరణి పోర్ట్ లో 95 శాతం సమస్యలను పరిష్కరించి రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా, ఆ జిల్లాను ఎలాంటి మచ్చ లేకుండా పాలిస్తున్న అమయ్ కుమార్‌పై ప్రత్యేక కథనం..

పారదర్శకంగా పనులు..
భూ సమస్యలు పరిష్కారం కావాలంటే అయితే చెప్పులు అరిగేలా అయినా తిరగాలి.. లేదా అడిగినంతైనా సమర్పించాలి. ఎంత కష్టపడ్డా ఒక్కోసారి నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాలి. అయినా సమస్య పరిష్కారం అవుతుందన్న గ్యారంటీ లేదు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ధరణి పోర్టల్‌ను ప్రారంభించింది సర్కార్. భూ సమస్యల పరిష్కారానికి బాధితుల సమయం, డబ్బు ఆదా కావాలని, పారదర్శకంగా మేలు జరగాలని సర్కార్ ధరణిని ప్రారంభించింది. ధరణి వచ్చిన తర్వాత అధికారుల్లో సమన్వయం రావడంతో పనులన్నీ సులువుగా అవుతున్నాయి.

రంగారెడ్డి ఫస్ట్ అండ్ ది బెస్ట్..
దీంతో ఏళ్ల తరబడి భూ సమస్యలు పరిష్కారం అవుతూ ఉండటంతో అధికారులు, బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా భూ సమస్యలను వేగంగా పారదర్శకంగా పరిష్కరించిన జిల్లాల్లో మొదటి స్థానంలో ఉంది. రంగారెడ్డి తర్వాత మిగతా ఏ జిల్లాలు కూడా దాని దరిదాపుల్లోనే లేవు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 1,25,185 దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా వచ్చాయి. ఇందులో 1,20,518 దరఖాస్తులను అతి తక్కువ సమయంలోనే క్లియర్ చేశారు. 74, 205 దరఖాస్తులకు అనుమతులు కూడా ఇచ్చేశారు. వివిధ కారణాలతో 46, 313 దరఖాస్తులను అధికారులు టెక్నికల్ సమస్యతో తిరస్కరించారు. క్లియరెన్స్ ఇచ్చిన దరఖాస్తుల్లో కేవలం 4667 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. వీటి శాతం దాదాపు 96‌గా ఉంది. దీన్ని బట్టే భూముల క్లియరెన్స్ లో ఎలాంటి పారదర్శకత పాటిస్తున్నారో ఇట్టే అర్థం అవుతోంది. మరోవైపు ప్రజావాణిలోనూ కొందరు భూముల సమస్యలపై ఫిర్యాదు చేస్తే.. అవి చకచకా పరిష్కారం అవుతున్నాయి. ఇలా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ప్రత్యేక దృష్టి పెట్టి తన సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ధరణి పోర్టల్‌లో ఉండే సమస్యలను పరిష్కరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. చాలా భూములు కబ్జాకు గురయ్యాయి. వాటన్నింటినీ వెలికి తీసి సమస్యలను పరిష్కరించడం అంటే మాటలు కాదు. అవన్నీ అమయ్ కుమారే స్వయంగా పరిశీలిస్తూ చక్కదిద్దుతున్నారు.

వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లిపోవడమే..
ధరణి పోర్టల్‌లో భూ సమస్య ప్రత్యక్షం అయ్యిందంటే చాలు దాని పుట్టుపూర్వోత్తరాలపై వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నారు. కింది స్థాయి సిబ్బందికి నేరుగా ఆదేశాలు ఇస్తూ ఫీల్డ్ విజిట్ చేయిస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారమైన వెంటనే పాస్ బుక్ జారీ చేసేస్తున్నారు. ధరణి పోర్టల్‌ను ప్రత్యేకంగా స్టడీ చేయడంతో పాటూ టెక్నికల్‌గా అన్ని విషయాలపైనా కలెక్టర్ అమయ్ కుమార్ పట్టు సాధించారు. అందుకే ఎటు వెళ్లినా, కారులోనే చకచకా పోర్టల్ ఓపెన్ చేసి ఇష్యూను క్లియర్ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. 96 శాతం ల్యాండ్స్ క్లీన్ గా ఉంచడమంటే మాటలు కాదు. అందులోనూ అందరి కళ్లూ ఉన్న రంగారెడ్డి లాంటి జిల్లాల్లో వివాదాలకు అవకాశం లేకుండా ధరణి పోర్టల్‌లో ఫైళ్లను క్లియరెన్స్ ఇవ్వడమంటే మామూలు విషయం కాదు. సీఎం కేసీఆర్, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ శేషాద్రి ప్రోత్సాహం, సీఎంవో అధికారుల సూచనలతోనే ఆయన చకచకా పనులను చేయగలుగుతున్నారు. భూ సమస్యల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగిన వారికి ధరణి చాలా ఉపశమనం కలిగిస్తోంది. ధరణికి ముందు, ధరణికి తర్వాత జరిగిన మార్పులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అయితే పోర్టల్ రావడం వేరు.. దాన్ని ఉపయోగించి సమస్యలను పరిష్కరించడం వేరు. అందులోనూ జెట్ స్పీడ్‌తో ఇష్యూను క్లియర్ చేయడం వేరు. అలా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ చొరవ జిల్లాను మొదటి స్థానంలో ఉంచేలా చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments