Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్స్టీరింగ్ స్లిప్పవుతోందా..?

స్టీరింగ్ స్లిప్పవుతోందా..?

స్టీరింగ్ స్లిప్పవుతోందా..?
కారులో ‘కూతల’బారు…
కారేమో జోరుమీదుంది.. అనుచరగణమేమో కాక మీదుంది.. కాల్ లిస్ట్ లో ఎదురు చూస్తున్న వారంతా కలిసి వస్తున్న కాలాన్ని క్యాష్ చేసుకోవడానికి ఎదురు చూస్తూనే ఉన్నారు. విభజన రేఖ స్పష్టంగా లేక, హామీల నేరవేత సాఫీగా సాగక సీనియర్లు, జూనియ ర్లు అనే తేడాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. స్టీరింగ్ పట్టుకున్న పెద్దాయన అటు జాతీయ రాజకీయాలనే రోడ్డునూ చూస్తూ, ఇటు యావత్ గులాబీ కుటుంబం వెళ్తున్న వాహనంలోని వారందరినీ సముదాయిస్తూ, ఇతర పార్టీల నుంచి వస్తున్న ఒత్తిళ్లలాంటి ట్రాఫిక్ ను అధిగమించుకుంటూ ప్రయాణాన్ని సాగ…..దీస్తూనే ఉన్నారు. అయినా ఎంతటి దానికైనా ఆటంకాలు సహజమే.., ఏళ్ల ఓపికకైనా ఓ హద్దు సర్వసాధారణమే. పెద్దాయన నిత్యం బెత్తెం పట్టి కనిపిస్తున్నా, రో జూ చూసే కళ్లకు దాని తాలూకు సీరియస్ నెస్ త ప్పకుండా తగ్గుతుంది. క్రమశిక్షణకు కాలం చెల్లితే ప్రతి కార్యం ఆటంకమయమే.., శిక్షలు తప్పవని తెలిసిన తర్వాత తెగింపులు అతి సహజమే.

జరగాల్సింది పని విభజనే అయినా, జరుగుతున్నది మాత్రం పదవీ భజనే. వన్ అండ్ ఓన్లీ లెజెండ్ కేసీఆర్ సారథ్యంగా నడుస్తున్న ఇంత పెద్ద పార్టీకి ఇప్పుడు అసంతృప్తుల సంఖ్య వేధిస్తున్నది. ఎన్నికల రణానికి సమయం ఉన్నా, ఎక్కడికక్కడ ముసలం మాత్రం మొదలైందనే సంకేతాలు రాష్ట్రమంతా కనిపిస్తున్నా యి. ఎవరికీ అంతుచిక్కని సీఎం కేసీఆర్​ పొలిటికల్ స్ట్రాటజీ ఇప్పుడు పెనుదుమారమే రేపుతున్నది. భవిష్యత్ దృష్ట్యా జరిపే ఆయన వ్యవహారం అర్థమయ్యో.. కాకనో బంటులంతా ఎవరికి వారుగా గొంతులు పెగిలిస్తున్నారు. ఫైనల్స్ ముందు సెమీస్ గా, పరీక్షకు ముందు రిహార్సల్స్ గా జరిపినట్టుగా భావించాల్సిన తీరును ఓన్ చేసుకుంటుండడంతో ఇప్పుడు సీన్ రివర్స్ అవుతున్నది.

విభజన స్పష్టంగా గోచరిస్తున్నది. అప్పుడెప్పుడో సైకిల్ దిగిన వారు, చేతికి హ్యాండిచ్చిన వారంతా కారెక్కిన నుంచి రగులుకుంటున్న కుంపటి, సమయం వచ్చినప్పుడల్లా కొద్దికొద్దిగా రాజుకుంటూనే ఉంది. పరిస్థితి అదుపు తప్పకుండా అధినేత అధిమిపట్టి నష్ట నివారణకు చర్యలు తీసుకుంటూనే ఉన్నా, చాపకింద నీరులా జరగాల్సింది జరుగుతున్న సంకేతాలు వస్తూనే ఉన్నాయి. సుమారు ఎనిమిదేళ్లుగా అడపాదడపాగా జరుగుతున్న ఘటనలు ఇప్పుడు ముదిరిపోయాయి. అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా జిల్లా అధ్యక్షుల నియామకం ఇప్పుడు నేతల మధ్య సఖ్యతను పెంచడం ఏమోగానీ, ప్రజల సాక్షిగా ఎదురు పడి మాట్లాడుకోలేని పరిస్థితిని తెచ్చింది.

అదిగో ముందస్తు, ఇదిగో వచ్చే ముందస్తు.. అన్నట్టుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఆధారాలు లేని ప్రచారాల పర్వం కూడా ఆ బాపతు నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వెనకాలే ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితితో స్థానికంగా అన్యాయమైందని భావిస్తున్న కొందరైతే క్యాలీ తప్పి ప్రవర్తిస్తున్నారు. కలిసి ఉన్నప్పుడు నూరు తప్పులను తన్మయించుకుని వెళ్లిన వారు, ఇప్పుడు వీడిపోతున్నట్టుగా భావిస్తూ చిన్న విషయాలకే కారాలుమిర్యాలు నూరుకుంటున్నారు. పెద్ద బొక్కలున్నప్పుడు చూసీచూడనట్టు నడుచుకున్నవారు, ప్రస్తుతం సూది బెజ్జాల్లోనే సమస్త గత, వర్తమాన, భవిష్యత్ ను వెతుక్కుంటున్నారు. పంథాలకు పోయి చించివేతల వరకు వెళ్తున్నారు.
పోయేవారు పోవచ్చు అనా…, లేదంటే ఉన్నవారే నిజమైనోళ్లనా.. గానీ టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ సైనికులకు పరీక్షలు పెడుతూనే ఉన్నారు. కఠినమైన ఆ టెస్ట్ సరళి అర్థమైనోళ్లు ఓపికగా వ్యవహరిస్తుండగా, మిడిమిడి వారు అనవసరాలు క్రియేట్ చేసుకుని ఆయాసపడుతున్నారు. చేళ్లో పండిందంతా పంటే కావచ్చుగాక, కానీ అందులోనే తాలు కూడా ఉంటుంది. మన పంటచేలే కదా అని అంతటినీ తీసుకెళ్లి ఇంట్లో దాచుకోలేం కదా..? స్వచ్ఛమైన ధాన్యాన్ని పొందేందుకు తాలు ధాన్యం తాలూకును వదిలించుకునేందుకు యత్నిస్తాం. వ్యర్థాన్ని దూరం చేయకుంటే అసలు ధాన్యానికి న్యాయం జరగదనేది జగమెరిగిన సత్యం. అచ్చంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా ధాన్యానికి, తాలుకు మధ్య అంతరాన్ని తెలియజెప్పి చక్కదిద్దే వ్యవహారానికి శ్రీకారం చుట్టారనిపిస్తోంది.
కారు ఇంజిన్ వేడెక్కుతోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కొద్దీ లోకల్ గా మంటలు పెరుగుతున్నాయి. స్థానికంగా ప్రాధాన్యం తగ్గి, దూరంగా ఉన్నవారు పీఠంపై ఎక్కడంతో జిల్లా రాజకీయాలు అల్లకల్లోలంగా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో నాయకులంతా పైకి అంతా బాగానే కనిపిస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నా, లోపల మాత్రం కడుపు మంటలతోనే చంపేసుకునేంత పగలు పెంచుకుంటున్నారు. వేదికలపై ఒకే వరుసలతో కూర్చుంటారు గానీ, ఒకరినొకరు పలకరించుకోరు. మైకులు పట్టుకుని మాట్లాడుతారు గానీ డైరెక్ట్ గా ఏదీ చెప్పరు. ఈయన మాట్లాడుతుంటే ఆయన నేలకేసి చూడడం, ఆయన మాట్లాడుతుంటే ఇయన పక్క చూపులు చూడడం షరామామూలు దృశ్యాలే. వెనకాలే ముఖ్యమంత్రి కేసీఆర్, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్, యోధానయోధులైన పార్టీ ఇతర ముఖ్యుల ఫొటోలు గమనిస్తున్నాయన్న స్పృహకూడా లేకుండా కొట్టుకున్నంత పనిచేస్తున్నారు. ఒక వేదికను అలంకరించిన పెద్దలంతా ఎంత దగ్గరగా అయితే కూర్చుంటున్నారో అంతగా కలిసి ఉండలేకపోతున్నారు.

నేతల మధ్య అంతరం ప్రతి సందర్భంలోనూ అధిపత్యం కోసమే అన్నట్టుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ప్రభుత్వ పెద్దలేమో ధాన్యం లొల్లిని గల్లీ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లే హడావుడిలో ఉండగా, నియోజకవర్గాల్లోనేమో ప్రజాప్రతినిధులు నేను ముందంటే నేను ముందు, నా బలమంటే నాబలం అనే భ్రమల్లోనే కొట్టుకుంటున్నంత పనిచేస్తున్నారు. స్టీరింగ్ పట్టుతప్పకుండా సర్వశక్తులూ ఒడ్డుతున్న కేసీఆర్ చక్కదిద్దే చర్యలు ఎప్పుడు మొదలు పెడుతారో గానీ, విద్యాసంస్థల్లో సీనియర్లు, జూనియర్ల అన్న స్పష్టమైన తేడా మాదిరిగా నేతలు మాత్రం గోడలు కట్టుకుంటున్నారు. గులాబీ రంగులు వెలిసిపోయేలా చేస్తున్న పె ద్దలు ఇప్పటికే దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్టు సంకే తాలు ఉన్నా, వ్యవహారం ఎప్పుడు చక్కబడుతుందో.., క్రమశిక్షణకు కట్టుబడి వెంటే ప్రయాణం చేసేవారెందరుంటారో అంతా అధినేతకొక్కరికే తెలియాలి.
– చేలిక రాజేంద్ర ప్రసాద్ – ఎడిటర్

RELATED ARTICLES

Most Popular

Recent Comments