Friday, September 20, 2024
Homeతెలంగాణరాజీనామా చేస్తాం..

రాజీనామా చేస్తాం..

ములుగు కారులో ముసలం
జెడ్పీటీసీలు, మండల అధ్యక్షుల రహస్య భేటీ..!
ఇన్ చార్జి మంత్రి సత్యవతి రాథోడ్ తీరుపై నిరసన
దళిత బంధు లబ్ధిదారుల ఎంపికపై ఆగ్రహం..
కాంగ్రెస్ నాయకులకిస్తే తామెట్ల ఓట్లకు వెళ్లాలంటూ ఆవేదన
 రాజీనామా చేయాలని తీర్మానం..
స్పాట్ వాయిస్, ములుగు: క్రమ శిక్షణకు మారుపేరైన టీఆర్ఎస్‌లో కొద్ది రోజులుగా నిరసన గళాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కారులోని లుక లుకలను బయటపెడుతూనే ఉన్నారు. ఓరుగల్లులో అధికార పార్టీలో లొల్లులు రోజుకొకటి వెలుగుచూస్తునే ఉన్నాయి. ఇటీవల రైతు నిరసన దీక్షలో మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది. తాజాగా ములుగు జిల్లా టీఆర్‌ఎస్‌లో ముసలం రాజుకుంది. తాడ్వాయిలో జిల్లా ఇన్ చార్జి మంత్రి సత్యవతి రోథోడ్ తీరును నిరసిస్తూ తొమ్మిది మండలాల అధికార టీఆర్​ఎస్​పార్టీ కి చెందిన ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు రహస్యంగా భేటీ అయినట్లు విశ్వసనీయ సమాచారం. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో సొంత పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలను ఎంపిక చేశారంటూ ఆవేదన వెలిబుచ్చినట్లు తెలిసింది. ‘దళితబంధు’లో అర్హులంతా కాంగ్రెస్ నాయకులు ఉంటే ఎన్నికల్లో తామెలా ఓట్లకు వెళ్లేదంటూ చర్చించుకున్నట్లు సమాచారం. ఇందుకు నిరసనగా తమతమ పదవులకు, పార్టీకి రాజీనామాలు చేయాలని తీర్మానించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా అభివృద్ధికి నిధులు కూడా సరిగా ఇవ్వడం లేదంటూ చాలా రోజులుగా జెడ్పీటీసీలు, అధికార పార్టీ మండల అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రస్తుతం భేటీ కాఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీరి రహస్య భేటీ విషయం ఆ నోట.. ఈ నోట విలేకరులకు చేరింది. పరుగున వారు అక్కడికి చేరే వరకూ అందరూ వెళ్లిపోయారు. ఫోన్ చేసి సమాచారం కోసం ఆరా తీయడానికి ప్రయత్నిస్తే ఎవరూ స్పందించడం లేదు. మొత్తానికి అధికార పార్టీకి సొంత పార్టీ నాయకులే చెమటలు పుట్టిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments