Friday, November 15, 2024
Homeలేటెస్ట్ న్యూస్అవును.. ఆ మగాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు..

అవును.. ఆ మగాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు..

ఏప్రిల్ ఒకటినే వారి వివాహం జరిగింది..
మెదక్ జిల్లాలో ఘటన..
స్పాట్ వాయిస్, డెస్క్: అవును.. ఆ మగాళ్లిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుని వివాహం చేసుకుంటే ఇంతగా చర్చ జరిగేది కాదేమో.. కానీ, తాగిన మైకంలో తాళి కట్టే తతంగం పూర్తి చేయడం.., మత్తు దిగిన తర్వాత జరిగిన విషయాన్ని తలుచుకుని తలలు పట్టుకోవడంతో వ్యవహారం పెద్దమనుషుల వరకు వెళ్లింది. దీంతో బండారం బట్టబయలైంది. మెదక్‌ జిల్లా చిలప్‌చెడ్‌లో చోటు చేసుకున్న ఈ వింత ఘటన మంగళవారం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి..
సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన 21 ఏళ్ల యువకుడికి, చిలప్‌చెడ్‌ మండలం చండూర్‌కి చెందిన 22 ఏళ్ల ఆటో డ్రైవరుతో పరిచయమైంది. వీరి పరిచయం కూడా అక్కడ ఇక్కడ అయ్యింది కాదు.., ఏకం మద్యాన్ని సేవించే కొల్చారం మండలం దుంపలకుంటలోని ఓ కల్లు దుకాణంలో జరిగింది. పీకల్లోతు తాగిన తర్వాత బుర్రలో ఏం ఆలోచన కలిగిందో ఏమోగానీ ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. దీంతో జోగిపేటకు చెందిన యువకుడి మెడలో చండూరుకు చెందిన ఆటోడ్రైవర్ తాళికట్టాడు. ఇక్కడి దాకా బాగానే ఉంది. తాగారు.., తమాషాకు తాళి కట్టుకున్నారనుకున్నారు చుట్టు పక్కల వారు. కానీ ఆ తర్వాతే అసలు ట్విస్ట్ ఆరంభమైంది. తాళి కట్టించుకున్న యువకుడు కాపురానికి వస్తున్నానని తాళి కట్టిన యువకుడి ఇంటి ముందు వాలిపోయాడు. తాళి కట్టిన యువకుడి తల్లిదండ్రులు మందలించినా వినకుండా సరాసరి పోలీసులను ఆశ్రయించాడు. తనకు లక్ష రూపాయలు ఇస్తే తప్ప ఫిర్యాదు వెనక్కి తీసుకునేది లేదని మొండికేశాడు. చివరకు పోలీసులు, గ్రామపెద్దలు ఇరువురు యువకుల కుటుంబ సభ్యులను పిలిపించి చర్చించారు. చండూర్‌ యువకుడి కుటుంబీకులతో రూ.10వేలు ఇప్పించడంతో జోగిపేట యువకుడు ఫిర్యాదు వాపసు తీసుకున్నాడని చిలప్‌చెడ్‌ ఎస్సై మహ్మద్‌గౌస్‌ తెలిపారు. దీంతో తాగిన మైకంలో తాళితో ఒక్కటైన ఆ యువకులు, పదివేల పరిహారంతో విడాకుల దశకు చేరిందని చుట్టుపక్కల జనాలు ముచ్చటించుకోవడం వినిపించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments