ఎలుకలు పట్టాలా.. వైద్యం చేయాలా..?
ఎంజీఎంలో ఎలుకల బోన్లతో డాక్టర్ల నిరసన
సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ ఆందోళన
ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే రాష్ర్ట వ్యాప్త ఆందోళన
హెచ్చరించిన ప్రభుత్వ వైద్యుల సంఘం
స్పాట్ వాయిస్, ఎంజీఎం: వరంగల్ ఎంజీఎంలో పేషెంట్ పై ఎలుకల దాడి చేసిన ఘటనకు బాధ్యులుగా ఇద్దరు డాక్టర్లపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వైద్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు.ఎలుకల బోన్లు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైద్యం చేయాలా..? లేదంటే ఎలుకలు పట్టాలా? అంటూ మండిపడ్డారు. తమ పని వైద్యం చేయడమని, ఎలుకలు పట్టడం కాదన్నారు. తాము రోగులకు చికిత్స చేయడానికి మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నామని, తమ విధులు రోగులను చూడడం.. రోగాన్ని నిర్ధారించి చికిత్స చేయడం వరకేనన్నారు. తమ విధులు నిర్వహించడంలో ఏమైనా నిర్లక్ష్యం ఉంటే.. లేదా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలనే కానీ సంబంధం లేని అంశాలకు ఎందుకు బాధ్యులను చేస్తున్నారని ప్రశ్నించారు. వార్డులో ఎలుకలు వస్తున్నాయని చెప్పగానే ఆస్పత్రి సూపరింటెండెంట్ స్వయంగా పరిశీలించి.. చెత్త, సామాన్లు తీసేయించారని.. తర్వాత కూడా కాంట్రాక్టర్ కు కేవలం నెల రోజుల్లోనే రెండుసార్లు నోటీసులివ్వడం జరిగిందన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఎలుక వచ్చి పేషెంట్ ను కొరికితే.. అది కాంట్రాక్టర్ ఫెయిల్యూర్ లేదా.. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్ అవుతుందన్నారు. ప్రభుత్వం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అందజేయాలే గాని.. ఏదో ఉద్దేశంతో అడిషనల్ డీఎంఈ క్యాడర్ లో ఉన్న సూపరింటెండెంట్ కు షోకాజ్ లేకుండా.. మెమో ఇవ్వకుండా.. వివరణ అడగకుండా సరెండర్ చేయడం ఏకపక్ష వైఖరేనన్నారు. ప్రభుత్వ ఇమేజీ పెంచడానికి మేమంగా తోడ్పడుతుంటే.. మామీద దెబ్బ వేయడం సరికాదన్నారు. శానిటేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కానీ, డాక్టర్లను సస్పెండ్ చేయటం అన్యాయన్నారు. ఇద్దరు డాక్టర్లపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, సూపరింటెండెంట్ సస్పెన్షన్ ను రీవోక్ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రభుత్వ వైద్యుల సంఘం తరపున హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉత్తర్వులు జారీ చేయకపోతే.. ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లి మరింత ముమ్మరం చేస్తామని ప్రకటించారు.
Recent Comments