సినీ ఫక్కీలో ఘటన
కారులో ఎక్కించుకొని రేగొండ నుంచి వరంగల్ కు తీసుకెళ్లిన దుండగులు
మట్టెవాడలో కారు ఆపడంతో తప్పించుకొని వచ్చిన బాలుడు
కారులో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు చెబుతున్న బాలుడు
స్పాట్ వాయిస్, రేగొండ: బాలుడి కిడ్నాప్ సంఘటన రేగొండ మండలంలో కలకలం రేపుతుంది. సీనిఫక్కీలో జరిగిన ఈ కిడ్నప్ పై ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది. మండల కేంద్రానికి చెందిన కోలేపాక మహేందర్-సునంద దంపతుల కుమారుడు కొలేపాక డేవిడ్ జాకారంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఉగాది పండుగ కోసం భూపాలపల్లి మండలంలోని అమ్మమ్మ ఊరైన నిమ్మగూడెం వెళ్లాడు. తిరిగి ఆదివారం సాయంత్రం రేగొండ కు వచ్చారు. సోమవారం ఉదయం ఏడు గంటలకు టిఫిన్ తినడానికి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న టిఫిన్ సెంటర్ కు బయలుదేరాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు తమ కారును బాలుడి పక్కన నిలిపి ప్రభుత్వ దవాఖాన ఎక్కడ ఉందా అని అడిగారు. పక్కనే ఉందని చెప్పగా.. కారులో తీసుకెళ్తాం చూపిస్తావా అంటూ కారు ఎక్కించుకొని తీసుకెళ్లారు. ప్రభుత్వ దవాఖాన దాటిన కారు ఆపక పోవడంతో బాలుడు ఏడుపు మొదలుపెట్టాడు. దీంతో అతడికి మందు ఇచ్చి పడుకో బెట్టినట్లు బాలుడు తెలిపాడు. అక్కడి నుంచి వరంగల్ మట్టెవాడ ప్రాంతానికి వెళ్లగానే కారు ఆపడంతో అప్పటికి తెలివికి వచ్చి డేవిడ్ కారులో నుంచి దూకి పక్కనే ఉన్న షాపుల వద్దకు పరిగెత్తినట్లు చెబుతున్నాడు. అక్కడ ఉన్న యువకులు బాలుని గమనించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేతులకు ఉన్న తాడును విప్పి ఫోన్ నెంబర్ తెలుసుకొని బాలుని తల్లికి సమాచారం ఇచ్చారు. అప్పటికే ఇంటి దగ్గర బాలుని కోసం వెతుకుతున్న తల్లి సునంద బస్సులో వరంగల్ కి వెళ్లి బాలుడిని తీసుకొని ఇంటికి వచ్చింది. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తల్లి పేర్కొంది. ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. విచారణ చేపట్టామని పూర్తి వివరాలు తెలుసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉంటే కారులో ఇంకో ఇద్దరు బాలిక, బాలుడు ఉన్నట్లు కిడ్నాప్ నకు గురైన బాలుడు చెబుతున్నాడు. ఇంతకీ వారేవరనేది అంతుచిక్కకుండా ఉంది.
Recent Comments