ధాన్యం కొనుగోలుపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది
కొనే దాకా వదిలేదే లేదు
కేంద్రం వైఖరితో రైతులకు నష్టం
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
స్పాట్ వాయిస్, గణపురం: ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, తెలంగాణలో పండించిన ప్రతీ ధాన్యపు గింజనూ కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు సోమవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ రైతు పక్షాన చేపడుతున్న నిరసన దీక్షలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో అన్ని రాష్ర్టాల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రం.. తెలంగాణలో ధాన్యం కొనే విషయంలో మాత్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. పంజాబ్‌లో ధాన్యాన్ని కొనుగోలు చేసిన కేంద్ర ప్రభుత్వం రెండో పంటగా వేసిన గోధుమలను సైతం కొనుగోలు చేస్తోందని అన్నారు. కానీ తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు అనేక కొర్రీలు పెడుతోందని ఆరోపించారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయకుండా తెలంగాణ రైతులపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ రాష్ట్ర నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు సైతం తెలంగాణ ప్రజలను హేళన చేస్తూ మాట్లాడటం బాధాకరమన్నారు. వారు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, అమలు చేసిన పథకాల కారణంగా ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిందన్నారు. రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణ రైతులు పండించిన ప్రతీ ధాన్యపు గింజనూ కొనుగోలు చేసే వరకూ కేంద్ర ప్రభుత్వ మెడలు వంచైనా ధాన్యం కొనేలా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతులకు న్యాయం జరిగే వరకు కేంద్రంపై ఉద్యమం ఆగదన్నారు. టీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు సోమవారం నుంచి 11వ తేదీ వరకు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments