తలకిందులు..
లోకల్‌లో ఆన్‌లైన్ సర్వేలు
ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్
వాట్సాప్‌లో అభిప్రాయం తెలపాలంటూ లింకులు
రెండు రోజులుగా ఓరుగల్లులో షేరింగ్
నజర్ వేసిన ప్రజాప్రతినిధులు..
తమకు వస్తున్న ఓటింగ్ పై ఆరా
సర్వేలు ఎమ్మెల్యేలకు చెమలు పుట్టిస్తున్నాయి. ఆన్ లైన్ యుగంలో ఎవరికి వారుగా సర్వేలు.. రిపోర్ట్స్ అంటూ వారికి టెన్షన్ తెప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ సర్వేపై ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు సీరియస్ గానే నజర్ పెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో తమకు వస్తున్న ఓటింగ్ పై ఆరా తీస్తున్నారు. రెండు రోజులుగా ‘మేక్ యువర్ ఒపీనియన్ నౌ..’ అంటూ ఓరుగల్లు ప్రజాప్రతినిధులకు ఓ సర్వే సంస్థ నిద్రపట్టనివ్వడం లేదు. ఇందులో తాజా ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా పడిపోవడం మరింత చర్చనీయంగా మారిన అంశం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సర్వేలు ఎంత వరకు ప్రభావం చూపుతాయో తెలియదు గానీ, ప్రస్తుతం మాత్రం ప్రజాప్రతినిధులను కూర్చోనివ్వకుండా, నిలబడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: సర్వే.. సర్వే. ఇప్పుడు ఏ నియోజకవర్గంలో చూసినా మీకు నచ్చిన.. మీరు ఓటు వేసే నాయకుడు ఎవరంటూ ఆరా తీస్తున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నా.. ముందస్తు ఎన్నికలపై ఊహగానాలు ఊపందుకున్నాయి. దీనికితోడు రాజకీయ వేడి సైతం అదేస్థాయిలో సెగలు కక్కుతున్నాయి. ఈనేపథ్యంలో కొన్ని సంస్థలు ఆయా నియోజకవర్గా్ల్లో సర్వేలు చేపడుతున్నాయి. గతంలో ఇంటింటికీ.. లేదా ప్రధాన కూడళ్లలో ప్రజల అభిప్రాయాన్ని నేరుగా సేకరించేవారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తుండడంతో దీన్ని వేదికగా ప్రజల ఒపీనియన్ సేకరిస్తున్నారు. రెండు రోజులుగా వరంగల్ లోని పలు నియోజకవర్గాల్లో ఓ సంస్థ మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మీ ఓటు ఎవరికి అంటూ అభిప్రాయాలు సేకరిస్తోంది.
లోలోన సీరియస్
ఆన్‌లైన్ వేదికగా చేపట్టిన ఈ సర్వేపై ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నజర్ వేశారు. ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అంతేకాదు.. తమ పార్టీ నాయకులను వారివారి గ్రూపుల్లో షేర్ చేసి మనకు ప్లస్ వచ్చేలా చూడాలని ఆదేశాలు సైతం జారీ చేస్తున్నట్లు పలువురు కార్యకర్తలు చెబుతున్నారు. తెలిసిన వారందరికీ ఫోన్లు చేసి మనకు పాజిటివ్ ఒపీనియన్ ఇచ్చేలా పురమాయించాలని ఆదేశిస్తున్నారు. పై మాటలకు అవి అంతా బోగస్ అంటూ ఇంటర్నల్ గా మాత్రం సర్వే పై సీరియస్ గా ఫాల్ అప్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రభావం చూపేనా..?
వాట్సప్ గ్రూపుల్లో లింకులు షేర్ చేస్తూ.. మీకు నచ్చిన నాయకుడిని సెలెక్ట్ చేసుకోవాలని సూచిస్తుంటారు. అయితే ఆన్ లైన్ సర్వే కాబట్టి ఎవరైనా ఓటు ఓపీనియన్ ఇవ్వొచ్చు. అయితే సర్వేలో ఎక్కువ మంది ఎడ్యుకేషన్ ఉన్న వారే కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో సర్వే రిపోర్ట్ ప్రభావం చూపేనా అనే ఆలోచనలో ఎమ్మెల్యేలు పడుతున్నారు. చదువుకున్న వారిలో వ్యతిరేకత ఉంటే వారి కుటుంబాన్ని గ్రామాన్ని సైతం ప్రభావం చూపే అవకాశం ఉంటుందనే ఆందోళన వారిలో నెలకొంది. సర్వేపై చిన్నచూపు చూడకుండా.. దీన్ని సైతం పరిగణలోకి తీసుకొని లోటుపాట్లను సరిదిద్దుకునే అవకాశంగా భావించొచ్చనే అభిప్రాయంలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుత ఎమ్మెల్యేలపై విముఖత
ఆన్ లైన్ సర్వేలో ప్రస్తుత ఎమ్మెల్యేలపై ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు రిపోర్ట్ చెబుతోంది. ఓరుగల్లులోని పలు నియోజకవర్గాల్లో సాగుతున్న ఈ సర్వేలో అధికార పార్టీ షాక్ గురయ్యే రిపోర్ట్ కనిపిస్తుంది. చాలా మంది ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఓటు వేసేందుకు ఇష్టపడడం లేదు. కొత్తవారికి, ఇతర పార్టీల నాయకుల వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఈ సర్వే రిపోర్ట్ నిద్రపట్టనివ్వడం లేదు.
నిజమెంతా..?
2023లో మీ ఎమ్మెల్యే ఎవరంటూ సాగుతున్న సర్వే రిపోర్ట్ లో నిజమెంతా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరు చేస్తున్నారు.. ఎలా లెక్కలు పరిగణలోకి తీసుకుంటున్నారనే అంశాలపై క్లారిటీ లేదు. ఎన్నికల ముందు అనేక సంస్థలు సర్వే చేయడం పరిపాటి. అనేక రిపోర్టులు ప్రజా నాడికి దూరంగానే ఉంటాయి. రిజల్ట్ వస్తే గాని ప్రజలు ఎవరి వైపుమొగ్గు చూపారో తెలియదు.
Recent Comments