Friday, November 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్ట్విట్టర్‌లో ధాన్యం వార్..

ట్విట్టర్‌లో ధాన్యం వార్..

హాట్ హాట్ గా ట్వీట్లు.. తిట్లు
టీఆర్ఎస్ పై కాంగ్రెస్ సెటైర్లు
కాంగ్రెస్ పై గులాబీ నేతల ఫైర్..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య గత కొద్ది రోజులుగా నిరసనలు, ఆందోళనలతో నడుస్తున్న ధాన్యం వార్.. ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది. ట్విట్టర్ వేదికగా.. ఒకరిపై ఒకరు ట్వీట్లు విసురుకుంటున్నారు. అయితే ఇందులో బీజేపీ లేకుండా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ డిజిటల్ వార్ కు తెరలేపాయి. ఇంతకీ ఈ వార్ ఎలా మొదలైందంటే.. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ తమ నైతిక బాధ్యతను మరిచిపోయాయంటూ ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అంతేకాదు రైతుల శ్రమతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణలో పండిన పంటనంతా కొనేవరకూ రైతుల తరఫున కాంగ్రెస్ పోరాడుతుందన్నారు.
స్పందించిన టీఆర్ఎస్..
రాహుల్ కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్
ధాన్యం ‌కొనుగోలుపై రాహుల్ ట్వీట్‌కు ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం ట్విటర్‌లో సంఘీభావం చెప్పడం సరికాదంటూ హితవు పలికారు. వడ్ల కొనుగోలుపై రాష్ట్రానికో విధానం ఉండకూడదన్నారు. పంజాబ్‌, హరియానాలో చేసినట్లు ధాన్యం సేకరించాలని కోరుతున్నామన్న కవిత.. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఒకే దేశం – ఒకే సేక‌ర‌ణ విధానం కోసం పార్లమెంటులో రాహుల్‌ డిమాండ్ చేయాలన్నారు. టీఆర్ఎస్ ఎంపీలకు మద్దతుగా నిలవాలని సూచించారు.
కవితకు టీపీసీసీ చీఫ్ రేవంత్ సెటైర్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇవ్వగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ కవిత ట్వీట్‌కు సెటైర్ విసిరారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడటం లేదని.. సెంట్రల్ హాల్ లో కాలక్షేపం చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ‘ఇకపై ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీ తండ్రి కేసీఆర్ గత ఆగస్టులోనే ఒప్పందంపై సంతకం చేశారు. మీ తండ్రి ఆ రోజు చేసిన సంతకం నేడు తెలంగాణ రైతుల మెడకు ఉరితాడైంది. ఈ వాస్తవాన్ని మీరు మర్చిపోయారు’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
రాహుల్ పై హరీశ్ ఫైర్
తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపాలని రాహుల్ గాంధీని ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. తెలంగాణ మేలు కోరుకుంటే.. ఎంపీలతో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేయాలని సూచించారు. ఓకే దేశం.. ఒకే సేకరణపై కాంగ్రెస్ తీరేంటని ప్రశ్నించారు. రైతుల విషయంలో రాజకీయాలు చేసి పరువు తీసుకోవద్దని ట్వీట్ చేశారు.
రాహుల్ గాంధీకి ధన్యవాదాలు..: దాసోజు
తెలంగాణ రైతుల కోసం గళమెత్తిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం చేయాల్సింది.. పార్లమెంటు వెల్ లో డ్రామాలు కాదు.. ధాన్యం కొనుగోలంటూ కవితకు కౌంటర్ ఇచ్చారు. స్వార్థ రాజకీయం కోసం పేదరైతుని బలిపెట్టకండని సోషల్ మీడియాలో కోరు. కుట్రలు, కుతంత్రాలు మాని, ప్రతిపల్లెలో ఐకేపీ కేంద్రాలు పెట్టి ధాన్యం సేకరించాలంటూ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments