మండలి చైర్మన్ గా గుత్తా పేరు ఖరారు..?
మధుసూదనాచారికి మొండిచెయ్యేనా..
మంత్రిగా ఆశలు సజీవం..
ముందుస్తుకు వెళ్తే అదీ కష్టమే..
సిరికొండ మధుసూదనాచారి పరిచయం అక్కర్లేను పేరు. మంచితనానికి మరోరూపు. అధినేత అప్పగించిన ఏ పనైనా చక్కబెట్టే నైపుణ్యం ఉన్న లీడర్. పదవి ఉన్నా, లేకున్నా ఒకేరకమైన నడవడిక. శ్రమను గుర్తించాల్సిన ముఖ్యనేత తప్పకుండా అక్కున చేర్చుకుంటాడనే ఓపిక. కానీ, ఆ ఓపికకు ఇప్పుడు మరిన్ని పరీక్షలు ఎదురవుతున్నాయి. మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ప్రతిపాదించారనే ప్రచారం జరుగుతుండడంతో సిరికొండకు మొండిచేయేనా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలి పోతే మంత్రి అవుతాడనే ఆశలు పదిలంగా ఉన్నా, ముందస్తుకు వెళ్తే అదీ సాధ్యమయ్యేనా అనే సందేహాలు నెలకొన్నాయి. మొత్తంగా సుఖేందర్ పీఠాధిరోహణ సిరికొండకు ఇబ్బందులు తెచ్చిందనే చెప్పొచ్చు.
స్పాట్ వాయిస్, ప్రధానప్రతినిధి: 2018 సాధారణ ఎన్నికల్లో సిరికొండ మధుసూదనాచారి భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. భారీ మెజార్టీతో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిరికొండకు తప్పకుండా ఏదో ఒక అవకాశం ఇస్తారని అంతా అనుకున్నారు. పార్టీ కేడర్ రక్షించుకోవడానికి, మధుసూదనాచారికి ఉన్న మంచి పేరును కాపాడడానికి నామినేటెడ్ పదవి వరించబోతుందని ప్రచారం కూడా జరిగింది. తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన గండ్ర వెంకటరమణారెడ్డి సైతం గులాబీ గూటికి చేరాడు. ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలు కావడంతో ఇక సిరికొండకు తప్పకుండా పెద్దల సభకు పంపించి గౌరవాన్ని కట్టబెడుతారని అభిమానులంతా ఆశగా ఎదురు చూశారు.
ఆలస్యంగా..
టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరికో పదవుల పంపకం జరిగింది. కానీ సిరికొండకు మాత్రం చాలా ఆలస్యంగానే అదృష్టం దక్కిందని చెప్పాలి. మొన్నటి ఎమ్మెల్సీ కోటాలో ఆయనను పెద్దల సభకు పంపించారు. అప్పటి నుంచి మాజీ స్పీకర్ అనుచరులు, పార్టీ శ్రేణులు తప్పకుండా మండలి చైర్మన్ గానో, మంత్రిగానో పదవి వరించే రోజు దగ్గరలోనే ఉందని ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే ఒకటి లేదా రెండేళ్లు ఉండే అవకాశాలు ఉన్నాయని, అదే మండలి చైర్మన్ గా నియామకమైతే ఆరేళ్లపాటు పదవిలో ఉండే అవకాశాలు ఉంటాయని ఆయన అనుయాయులు కూడా సలహాలు ఇచ్చినట్టు సమాచారం. కానీ, ప్రస్తుతం చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు పరిశీలనలో ఉందని తెలియడంతో సిరికొండకు అవకాశాలు గల్లంతయ్యాయి.
ముందస్తుకెళ్తే అదీ కష్టమే..
మొదటి విడత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రజా తీర్పును తేల్చుకోవడానికి ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్లారు. సర్కార్ పై నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఆయనకు అఖండ మెజార్టీ స్థానాలతో మరోమారు అవకాశం కల్పించారు. అదే క్రమంలో ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ముందస్తుకు వెళ్తే ఇప్పట్లో మంత్రి మండలిని విస్తరించడం అయ్యే పనికాదు. ఒకవేళ విస్తరణ జరిగినా మంత్రిగా అవకాశం వస్తుందో రాదో కూడా తెలియదు. వచ్చినా కొద్ది నెలల పాటే పదవిలో కొనసాగే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి పదవి ఎప్పటికి దక్కేనా.. ఆయన నిరీక్షణకు ఎప్పటికీ ఫలితం అందేనో అని అభిమానులు, పార్టీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు.
Recent Comments