రూ.500 నోట్లలో ఫేక్ నోట్స్..
స్పాట్ వాయిస్, బ్యూరో: రూ.500 నోట్ల విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన ఫేక్ రూ.500 నోట్లు మార్కెట్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఈ నోట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీనికి సంబంధించి సమాచారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ), ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీతో కూడా పంచుకున్నట్లు వెల్లడించింది. ఈ నకిలీ నోట్ల ముద్రణ, వాటి నాణ్యత, అసలైన నోట్లను తలపించేలా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. వాటిని గుర్తించడం సులభం కాదని, చాలా క్లిష్టంగా మారిందని పేర్కొన్నారు. అయితే, ఈ నకిలీ నోట్లలో ఓ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని.. దాన్ని గుర్తించడమే కీలకమని తెలిపింది. ‘RESERVE BANK OF INDIA’ అనే పదంలో ‘RESERVE’ పదంలో ‘E’కి బదులు ‘A’ పడినట్లు వెల్లడించింది. నోటును క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ తప్పును గుర్తించొచ్చని తెలిపింది. ఫేక్ నోట్లు పెద్ద ఎత్తున మార్కెట్లో చెలామణీ అవుతున్నట్లు తెలిపింది. వాటి ఖచ్చిత సంఖ్యను గుర్తించడం చాలా కష్టమైన పని అని పేర్కొంది. వీటి విషయంలో ప్రజలు, వ్యాపార సంస్థలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Recent Comments